మీరూ కావొచ్చు... గూగుల్ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఆశించే కుర్ర‌కారు క‌ల‌ల కంపెనీ గూగుల్‌. అయితే ఆ సంస్థలో కొలువుదీరే అవ‌కాశం వ‌చ్చేది కొంద‌రికే. గూగుల్‌లో జాబ్ పొందాలంటే ఐఐటీలు లేదా పేరున్న సంస్థలో విద్యార్థి అయి ఉండాలి. ఎందుకంటే క్యాంప‌స్ నియామ‌కాల కోసం ఆ సంస్థ ఉన్నత బోధ‌నా ప్ర‌మాణాలు క‌లిగి, మెరిక‌ల్లాంటి విద్యార్థులు ఎక్కువ‌గా ఉన్న క‌ళాశాల‌ల గ‌డ‌ప మాత్రమే తొక్కుతుంది. వారిలో అతి కొద్దిమందికే ఆఫ‌ర్ లెట‌ర్ అందిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక మాదిరి, చిన్నాచిత‌క క‌ళాశాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులు గూగుల్‌లో అవ‌కాశం సొంతం చేసుకోవ‌డం ఎలా? దీనికొక మార్గం ఉంది అదే అపాక్‌. ప్రోగ్రామింగ్‌లో అస‌మాన ప్రతిభ ఉంటే మీరూ కావొచ్చు గూగుల్ ఉద్యోగి. ఇంత‌కీ ఏమిటీ అపాక్‌?
గూగుల్ లాంటి పెద్ద సంస్థలు ప్రపంచ‌వ్యాప్తంగా ప్రతి క‌ళాశాల‌కూ వెళ్లి కోడింగ్ యోధుల‌ను గుర్తించి, ఉద్యోగిగా అవ‌కాశం క‌ల్పించ‌డం సాధ్యం కాదు. అందుకే కొన్ని ప్రమాణాల‌ను నిర్ణయించుకుని ఆ మేర‌కు అతి త‌క్కువ క‌ళాశాల‌ల‌కు మాత్రమే వెళ్లి విద్యార్థుల‌ను ఎంపిక‌చేస్తాయి. అయితే ఒక మోస్తరు క‌ళాశాల‌ల్లో చ‌దువుకుంటూ విశేష ప్రతిభ‌ను సొంతం చేసుకునే విద్యార్థులు మ‌రీ ఎక్కువ సంఖ్యలో కాక‌పోయినా అక్కడ‌క్కడా త‌ప్పక ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు ఉద్యోగం ఎంత అవ‌స‌ర‌మో, పెద్ద సంస్థల‌కు ఈ త‌ర‌హా వ్యక్తులు కూడా అంతే అవ‌స‌రం. ఈ దిశ‌గా ఆలోచించి గూగుల్ రూపొందించిన ఆన్‌లైన్ ప‌రీక్షే అపాక్‌. ఈ ప‌రీక్షను ప్రపంచంలో ఎవ‌రైనా ఉచితంగా రాసుకోవ‌చ్చు. మౌలికాంశాల‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న‌, చిన్నచిన్న స‌మ‌స్యల‌కు సొంతంగా ప్రోగ్రామింగ్ రాయ‌గ‌లిగే నేర్పరిత‌నం ఈ రెండూ ఉంటేచాలు గూగుల్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవ‌చ్చు.
ప్రతిభ‌కు ప‌ట్టం క‌ట్టడానికి ఏటా గూగుల్ అపాక్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్స్ టెస్ట్ పేరుతో ఆన్‌లైన్‌లో ప‌రీక్షను నిర్వహిస్తుంది. సాధార‌ణంగా ఈ ప‌రీక్ష కోసం ఆగ‌స్ట్‌లో రిజిస్ట్రేష‌న్లు మొద‌ల‌వుతాయి. నాలుగు సార్లు ప‌రీక్షను నిర్వహిస్తారు. క‌నీసం ఒక ప‌రీక్ష‌లోనైనా మెరిస్తే చాలు ఇంట‌ర్వ్యూకు ఎంపిక కావ‌చ్చు. అందులోనూ నెగ్గితే గూగుల్‌లో ఉద్యోగం సొంత‌మైన‌ట్టే.
ఎవ‌రు అర్హులు
వ‌చ్చే విద్యా సంవ‌త్సరంలో బీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేయ‌బోతున్నవారు ముందు సంవ‌త్సరంలో ప‌రీక్ష రాయ‌డానికి అర్హత సాధిస్తారు. అంటే 2016లో బీటెక్ పూర్తిచేసుకోబోతున్న విద్యార్థులు 2015లో గూగుల్ అపాక్ ప‌రీక్ష రాసుకోవ‌చ్చు.
ఎందుకీ ప‌రీక్ష
కంప్యూట‌ర్ సైన్స్‌, దాని అనుబంధ విభాగాల్లో స‌మ‌ర్థులైన యువ‌త‌ను గుర్తించి, వారికి గూగుల్‌లో ఉద్యోగిగా అవ‌కాశం క‌ల్పించే ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిందే గూగుల్ అపాక్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్స్ టెస్ట్‌.
పాల్గొనాలంటే
గూగుల్ అపాక్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్స్ టెస్ట్ ప్రక‌ట‌న వెలువ‌డిన అనంత‌రం రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఆన్‌లైన్‌ ప‌రీక్షల‌కు సిద్ధప‌డాలి. 2015 అపాక్ ప‌రీక్షలు ముగిశాయి. మ‌ళ్లీ 2016 ఆగ‌స్ట్‌లో ప్రక‌ట‌న వెలువ‌డుతుంది.
ప‌రీక్ష ఎలా ఉంటుందంటే...
ప‌రీక్ష మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. నాలుగు రౌండ్లలో దీన్ని నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రౌండ్ ప‌రీక్ష ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. అభ్యర్థులు వారి సౌల‌భ్యాన్ని బ‌ట్టి న‌చ్చిన రౌండ్‌లో ప‌రీక్ష రాసుకోవ‌చ్చు. ఆస‌క్తి ఉంటే అన్ని రౌండ్లలోనూ ప‌రీక్ష రాసుకునే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా ఈ ప‌రీక్షలు ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల్లో నెల‌కొక‌టి చొప్పున ఉంటాయి.
ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
ప్రాథ‌మిక కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, అల్గోరిథం, ప్రొగ్రామింగ్ నైపుణ్యం ప‌రీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. ప్రాథ‌మికాంశాల‌పై అభ్యర్థులు బాగా దృష్టి సారించాలి. అలాగే కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం, ఆస‌క్తి రెండూ ఉండాలి. అభ్యర్థుల‌కు అవ‌గాహ‌న కోసం పాత‌ప్ర‌శ్నప‌త్రాల‌ను అపాక్ వెబ్‌సైట్లో ఉంచారు. వాటిని సాధ‌న చేయ‌డం ద్వారా ప‌రీక్ష గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవ‌డం వీల‌వుతుంది. ఎక్కువ ప్రశ్నలు మాత్రం ఫండ‌మెంట‌ల్స్‌పైనే ఉంటాయ‌ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. వాటిని క్షుణ్నంగా అధ్యయ‌నం చేస్తేనే విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. ప‌రీక్ష రాయాల‌నుకునే అభ్యర్థులు గూగుల్ కోడ్‌జామ్ ద్వారా సాధ‌న చేసుకోవ‌చ్చు.
ఎంపిక ఇలా..
రౌండ్ల వారీ ఒక్కో రౌండ్‌లో మెరుగైన ప్రతిభ చూపిన అభ్యర్థుల‌ను గూగుల్ కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూ నిమిత్తం ఎంపికచేస్తారు. ఎంత‌మందిని ఎంపిక చేయాలి, ఎన్ని మార్కులు వ‌చ్చేవారిని తీసుకోవాల‌నేది అభ్యర్థుల ప్రతిభ‌, గూగుల్ నిర్ణయం ప్రకారం ఉంటుంది.
పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్‌: https://code.google.com/codejam/apactest

Posted on 09-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning