కొత్త నియామకాల జోరు

* జనవరి-మార్చిలో మరింత జోరు
* మ్యాన్‌పవర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అంచనా

దిల్లీ: వచ్చే ఏడాది నియామకాలు అధికంగా ఉంటాయని మ్యాన్‌పవర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికాల్లో మరింత అధికంగా నియమాకాలు జరిపేందుకు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయని తెలిపింది. 42 దేశాలలో సర్వే నిర్వహించామని, 38 దేశాల్లో నియామకాలు ఆశాజనకంగా ఉన్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ తెలిపింది. నూతన నియామకాలపై వరుసగా 4వ త్రైమాసికంలోనూ దేశీయ సంస్థలు ఆశావహంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో నికర ఉపాధి కల్పన 45 శాతంగా ఉన్నందున, రాబోయే నెలల్లో నిరుద్యోగులు ముమ్మరంగా ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. ఉద్యోగ కల్పనకు ఆటంకంగా కలిగిస్తున్న కార్మిక చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు వ్యాపార వాతావరణాన్ని మెరుగు పరచడం నియామకాల పెరుగుదలకు ఉపకరిస్తుందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ ఏజీ రావు చెప్పారు. కొత్త కంపెనీల ప్రారంభంతో పాటు విదేశీ పెట్టుబడులు తరలి రానుండటం కలిసి వస్తుందన్నారు. రాబోయే 3 నెలల్లో టోకు, రిటైల్‌ రంగాల్లో నికర ఉద్యోగ కల్పన 46, 45 శాతంగా ఉంటుందన్నారు. భారత్‌తో పాటు తైవాన్‌, న్యూజిలాండ్‌లలో నియామక అవకాశాలు పటిష్టంగా ఉండగా, అమెరికా, బ్రిటన్‌లలో పరిస్థితి మెరుగవుతోంది. చైనా, బ్రెజిల్‌లోనూ సానుకూల పరిస్థితులే ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఉద్యోగాలు 14% పెరిగాయ్‌: నౌకరీ
ఈనాడు, హైదరాబాద్‌: గత నెల హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు రెండకెల్లో పెరిగాయి. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే నవంబరులో హైదరాబాద్‌లో నియామకాలు 14% పెరిగినట్లు నౌకరీ డాట్‌ కామ్‌ తెలిపింది. 'నౌకరీ జాబ్‌ స్పీక్‌' సూచీ ప్రకారం గత నెలలో ఐటీలో 7%, ఔషధ రంగంలో 25% ఉద్యోగావకాశాలు పెరిగినట్లు నౌకరీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ముఖ్య అమ్మకాల అధికారి వి.సురేశ్‌ తెలిపారు. నవంబరులో ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఔషధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఆకర్షణీయంగా పెరిగాయని.. వ్యాపారాలు బాగున్నందున ఈ ధోరణి కొనసాగుతుందన్నారు. ఐటీ ఆధారిత సేవల్లో 26 %, టెలికాం రంగంలో 43% ఉద్యోగావకాశాలు పెరిగాయి. బ్యాంకింగ్‌లో 34%, బీమాలో 20% అదనంగా ఉద్యోగాలు లభించాయి. ప్రధాన రంగాల్లో నిర్మాణం, ఇంజినీరింగ్‌ రంగంలో ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే నవంబరులో ఉద్యోగాలు ఒక శాతం తగ్గాయి.

Posted on 10-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning