ప్రాంగణ నియామకాల్లో మేటి.. ట్రిపుల్‌ఐటీ

* ఐఐటీలకు దీటుగా నిలుస్తున్న యువత
* భారీ వేతనాలతో బహుళజాతి సంస్థల ఆహ్వానం
* దూసుకెళుతున్న విద్యార్థులు
* పరిశోధన ఆధారిత విద్యే కారణం

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ... క్లుప్తంగా ట్రిపుల్‌ఐటీ. ఐఐటీ, ఎన్‌ఐటీల మాదిరిగా అందరికీ అంతగా తెలియని విద్యాసంస్థ. ఈసారి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలతో పోటీగా భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఈ సంస్థ విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఫలితం...ఇప్పుడు అందరి దృష్టిని ట్రిపుల్‌ఐటీ ఆకర్షిస్తోంది. మొత్తం 11 మందికి రూ.1.40 కోట్ల చొప్పున వేతనాలిచ్చేందుకు గూగుల్‌, ఫేస్‌బుక్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. ఏమిటీ ట్రిపుల్‌ఐటీ గొప్పతనం.. విద్యార్థుల సత్తా వెనక విజయ రహస్యమేంటి...పరిశీలిద్దాం...
దాదాపు దశాబ్దంన్నర క్రితం ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతుండటాన్ని గమనించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐటీకి ప్రత్యేకంగా విద్యాసంస్థలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇక్కడ ఐటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యార్థులను తయారు చేయాలన్నది లక్ష్యం. హైదరాబాద్‌తో పాటు అలహాబాద్‌, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో ట్రిపుల్‌ఐటీని నెలకొల్పారు. నగరంలోని గచ్చిబౌలిలో 1998లో ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కోసం 66 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ట్రిపుల్‌ఐటీకి కేటాయించారు. ఇది డీమ్డ్‌ విశ్వవిద్యాలయం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత యూజీసీ గుర్తింపు లభించింది. ఇప్పుడు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా పేరుపొందింది. బోర్డు ఛైర్మన్‌గా కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రఖ్యాతి గాంచిన కార్నెగీ మిలన్‌ విశ్వవిద్యాలయం(సీఎంయూ)లో ఆచార్యుడుగా ఉన్న తెలుగు వ్యక్తి రాజ్‌రెడ్డిని నియమించారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. సంస్థ ప్రారంభం నుంచి గతేడాది వరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి అయిన ఆచార్య రాజీవ్‌ సంఘాల్‌ ఇక్కడ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సిలబస్‌ను రూపొందించారు. ప్రస్తుతం పీజే నారాయణన్‌ సంచాలకుడిగా ఉన్నారు.
బీటెక్‌లోనే పరిశోధన ప్రారంభం
ఈ సంస్థ స్థాపించడం వెనక ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ నుంచే పరిశోధనాధారిత చదువును అందించడం. దానివల్ల విద్యార్థులు పరిశోధన వైపు మరలుతారన్నది ఉద్దేశం. అందుకే అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ అయిన మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (నాలుగేళ్లు బీటెక్‌, ఒక ఏడాది ఎంఎస్‌)కోర్సుతోపాటు సాధారణ బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులున్నాయి. అయితే కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన కోర్సులు మాత్రమే ఉంటాయి. జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్‌ విద్యాసంస్థల్లో ఇది దేశంలోనే ఓ ఉత్తమ సంస్థగా పేరుపొందింది. ఐటీపై ఆసక్తి ఉన్న వారికి దేశంలోని ఏ సంస్థ తమకు సాటి రాదని ఇక్కడి ఆచార్యులు గర్వంగా చెబుతుంటారు.
ఏమిటీ ప్రత్యేకత...
* పరిశ్రమలు కోరుకునే సిలబస్‌ ఇక్కడి కోర్సుల్లో ప్రవేశపెడతారు. దానిని మార్చుకునేందుకు వీలుంది.
* ఆచార్యులు వివిధ సంస్థల నుంచి పొందిన పరిశోధనా ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తారు.
* అంతర్జాతీయ విద్యాసంస్థలు, ఐఐటీలతో ఒప్పందాలు ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ స్థాయిలో ఏం జరుగుతోందో.. ఏ సాంకేతిక పరిజ్ఞానానికి డిమాండ్‌ ఉందో తెలుసుకుంటారు. ఆ ప్రకారం విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అందుకే మొబైల్‌ అప్లికేషన్స్‌, ఆండ్రాయిడ్‌ టెక్నాలజీ, బిగ్‌ డేటా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితరాలపై దృష్టి పెట్టారు.
* బీటెక్‌లో చేరిన నాటి నుంచి సృజనాత్మక ఆలోచన ఉండేలా ప్రోత్సహిస్తారు. కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలపై పూర్తి పట్టు ఉండేలా బోధిస్తున్నారు. కంపెనీలు సైతం బహుముఖ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
* ప్లేస్‌మెంట్‌ విభాగం ఆయా కంపెనీల సీఈఓలను ఆహ్వానించి విద్యార్థుల నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుంటోంది.
* రాష్ట్ర విశ్వవిద్యాలయాల మాదిరిగా అనుబంధ కళాశాలలు ఉండవు. అందువల్ల పూర్తి దృష్టి విద్యార్థులపై ఉంటుంది.
* సంస్థలోనే దక్షిణ భారత్‌లో పెద్దదైన ఇంక్యుబేటర్‌ కేంద్రం ఉంది. ఇక్కడ 60 స్టార్టప్‌ కంపెనీలున్నాయి. వాటిని ప్రారంభించిన వాటిల్లో కొందరు సీనియర్‌ విద్యార్థులు కూడా ఉన్నారు. వారితో విద్యార్థులు తరచూ మాట్లాడుతుంటారు.
* ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ట్రిపుల్‌ఐటీ భాగస్వామిగా ఉంది. ఉదాహరణకు ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే ఆయా విభాగాలను అప్రమత్తం చేయడం, బాధితులను గుర్తించే ప్రాజెక్టులో ఈ సంస్థ పాల్గొంటోంది. దీనికి జైకా నిధులిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులను విద్యార్థులు దగ్గరుండి చూడటం వల్ల మరింత అవగాహన పెంచుకుంటారు.
గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌లో హవా
ఏటా వేసవి కాలంలో గూగుల్‌ సంస్థ కంప్యూటర్‌ కోడ్‌పై ఫెలోషిప్‌లు అందిస్తుంది. దీనికోసం విద్యార్థులు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ఆలోచన ఎంపికైతే గూగుల్‌ ఫెలోషిప్‌ ఇస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు చేస్తారు. గత వేసవిలో ట్రిపుల్‌ఐటీ నుంచి 72 మంది ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ 51 మంది, ఐఐటీ బాంబే 15, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ) 12 మంది, ట్రిపుల్‌ఐటీ భువనేశ్వర్‌ నుంచి 11 మంది ఎంపికయ్యారు. దీన్ని బట్టి ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ముందున్నారని చెప్పొచ్చు. అందుకే ఈసారి గూగుల్‌ రూ.1.40 కోట్ల వార్షిక వేతనంతో అయిదుగురిని ఎంపిక చేసుకుంది.
పరిశ్రమలకు ఏం కావాలో తెలుసుకుంటాం
- టీవీ దేవీ ప్రసాద్‌, ప్లేస్‌మెంట్‌ విభాగాధిపతి
విశ్వవిద్యాలయం మొదటి నుంచి పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. ప్లేస్‌మెంట్‌ విభాగం తరుఫున పలుమార్లు ఆయా సంస్థల సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేశాం. మీ కంపెనీల్లో వినియోగిస్తున్న టెక్నాలజీ ఏమిటి.. ఇంకా మీకు ఏం కావాలి.. మా విద్యార్థుల నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నాం. ఫలితంగా ఇక్కడైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న వారు ఉంటారన్న పేరు వచ్చింది. క్రమేణా ఇప్పుడు సగటు వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ఇక్కడ తర్ఫీదు ఉండటంతో సర్వీస్‌ కంపెనీల్లో చేరడానికి ఇష్టపడరు. పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి తరహా కంపెనీల్లోనే విద్యార్థులు చేరతారు. ఫేస్‌బుక్‌ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ట్రిపుల్‌ఐటీకి మాత్రమే వచ్చిందంటే కారణం అదే. ఆయా కంపెనీలు సైతం ట్రిపుల్‌ఐటీని ఐఐటీకి సమానంగా చూస్తున్నామని ముందుగానే లేఖలు కూడా పంపిస్తారు. విద్యార్థులు చాలా మంది కంపెనీలను ఎంచుకునే ముందు వేతనాన్ని మాత్రమే చూడరు. అక్కడ ఉపయోగించే సాంకేతికత ఏమిటి.. భవిష్యత్తులో మరింత నేర్చుకొని ఎదిగేందుకు అవకాశం ఉందా.. అని చూస్తున్నారు. అందుకే కొందరు స్టార్టప్‌ కంపెనీలపైనా ఆసక్తి చూపుతున్నారు.
వీరి కోసం పలు సంస్థలు ఎదురుచూస్తాయి
- ఆచార్య వాసుదేవ వర్మ, సంచాలకుడు,
పరిశోధన, అభివృద్ధి విభాగం, ట్రిపుల్‌ఐటీ
ఇక్కడి మొదటి బ్యాచ్‌ నుంచి ప్రాంగణ నియామకాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడి వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్న తర్వాత వారి పని తీరు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని కంపెనీల ప్రతినిధులు పరిశీలిస్తుంటారు.అలా ట్రిపుల్‌ఐటీకి మంచి పేరొచ్చింది. అందుకే ఇక్కడి విద్యార్థుల కోసం ఏటా పలు కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. పరిశోధనాధారిత చదువు అంటే కొత్త సమస్యలకు పరిష్కారం కనుగొనడమే కదా..పరిష్కారం కనుగొనడం, దాన్ని సవాల్‌గా స్వీకరించడం లాంటి సంస్కృతి ఇక్కడ అలవడుతుంది. ఇక్కడ చేరిన తర్వాత ఒకరిని చూసి ఒకరు పోటీ పడతారు.
మార్గం చూపిస్తాం
- ప్రదీప్‌కుమార్‌, సీనియర్‌ ఆచార్యుడు
ఐఐటీలంత కాకున్నా ఇక్కడా తెలివైన విద్యార్థులే చేరతారు. కొందరు ఇక్కడ వాతావరణం కారణంగా మరింత ఎదుగుతారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ఇక్కడ ఆచార్యులు చూస్తారు. ఆచార్యులు అవకాశాలను, వాటిని అందుకునే మార్గాలను చెబుతారు. కష్టం ఎక్కువ విద్యార్థులదే. అందుకే ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలు ఇవ్వడంలో ఆ ఘనత అధిక శాతం విద్యార్థులకే ఇస్తాను. ప్రారంభంలోనే అధిక వేతనాలు తీసుకోవడం వల్ల తర్వాత ఎదుగుదల గురించి కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని కూడా విద్యార్థులు గమనించాలి.

Posted on 11-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning