ఇర‌వై ఏళ్లు నిండ‌క‌ముందే రూ.2 కోట్ల జీతం!

* ప్రాంగ‌ణ నియామ‌కాల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌
* ఫేస్‌బుక్‌ బంప‌ర్ ఆఫ‌ర్ సొంతం చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థిని ఆస్తా అగ‌ర్వాల్‌

ప‌ది, ఇర‌వై ల‌క్షలు..ఒక‌ప్పటి మాట‌ల‌య్యాయి. అర కోటి..అర‌వై ల‌క్షలు...మూణ్నాళ్ల ముచ్చట‌గా మిగిలాయి. కోటీ..కోటీ న‌ల‌భై మొన్నటి వ‌ర‌కు మారుమోగాయి. వీట‌న్నింటికీ బ్రేకులేసింది ఫేస్‌బుక్ వారి పాట‌. ఈ కంపెనీ ఐఐటీ బాంబే విద్యార్థిని ఆస్తా అగ‌ర్వాల్‌కు ఆఫ‌ర్ చేసిన రెండు కోట్ల ప‌ది ల‌క్షలు ఆల్ టైమ్ క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ రికార్డుగా నిలిచింది. తాజా నియామ‌కంతో రెండు ప‌దులు నిండ‌క‌ముందే రెండు కోట్ల మైలురాయికి చేరుకుని ఔరా అంటూ అంద‌రూ ఆశ్చర్యపోయేలా చేసింది మ‌న ఆస్తా.
పోటా పోటీగా నియామ‌కాలు...
డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి ఐఐటీల్లో ప్రాంగ‌ణ నియామ‌కాల హ‌డావిడి మొద‌లైంది. ప్రముఖ కంపెనీల‌న్నీ మెరిక‌ల్లాంటి విద్యార్థుల‌ను సొంతం చేసుకోవ‌డ‌మే లక్ష్యంగా ఐఐటీల గ‌డ‌ప తొక్కాయి. రెండు మూడు రోజుల్లోనే వీటి జోరు పెరిగింది. అనంత‌రం ఆక‌ర్షణీయ ప్యాకేజీతో ఆఫ‌ర్ లెట‌ర్లు హోరెత్తించాయి.. ప‌ర్వాలేద‌నిపిస్తే చాలు అర కోటికి త‌గ్గకుండా ఎంపిక ప‌త్రాలు అక్కడికక్కడే చేతికిస్తున్నాయి. అద్భుతం అనిపిస్తే కోటి వెచ్చించి కొనుక్కోవ‌డానికీ వెనుకాడ‌డం లేదు. కోడింగ్‌లో కేక పుట్టించే విద్యార్థుల‌నైతే రూ. కోటీ న‌ల‌భై ల‌క్ష‌లు. అన్ని విధాలా ఆణిముత్యమ‌ని భావిస్తే రెండు కోట్లకు పైగా వెచ్చించి ప్రతిభ‌కు ప‌ట్టాభిషేకం చేస్తున్నాయి. ఇలా విఖ్యాత కంపెనీలైన ఫేస్‌బుక్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, సిస్కో ఐఐటియ‌న్లను ఆకర్షించ‌డానికి టాప్ రేట్‌తో దూసుకుపోతున్నాయి. ఈ సంవ‌త్సరం ఐఐటీల నియామ‌కాల స‌ర‌ళి వేలంపాట‌ను త‌ల‌పించేలా చేసింది. అర కోటితో ఆరంభ‌మైన ఈ పాట ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రెండు కోట్ల ప‌ది ల‌క్షల వ‌ద్ద ఆల్‌టైమ్ రికార్డుతో నిలిచింది. రెండు ప‌దులు నిండ‌క‌ముందే రెండు కోట్ల రూపాయ‌ల జీతాన్ని అందుకునే అవ‌కాశం మ‌న ఐఐటీ న‌వ యువత‌రం సొంత‌మైంది.. తాజా నియామ‌కాల ద్వారా ఐఐటీల‌తోపాటు, సాంకేతిక విద్యలో భార‌తీయ విద్యార్థుల స‌త్తా మ‌రోసారి ప్రపంచానికి ప్రస్ఫుట‌మైంది.
2009లో ఫేస్‌బుక్ ఖాతా...
మొన్నటి వ‌ర‌కు ఆస్తా అగ‌ర్వాల్ ఒక సాధార‌ణ విద్యార్థిని. ఐఐటీ బాంబే ఆమె ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం అంద‌రినోటా ఆమే హాట్ టాపిక్‌. ఎందుకంటే ఫేస్‌బుక్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఏకంగా రెండు కోట్ల ప‌ది ల‌క్షల ఆఫ‌ర్‌తో అంద‌రూ ముక్కున వేలేసుకునేలా చేసింది. అంతేకాదు ఈ ఏడాది ఫేస్‌బుక్ ఇచ్చిన అన్ని ఆఫ‌ర్లలోనూ ఇదే అత్యధికం కావ‌డం విశేషం. అంద‌రిలాగే ఆస్తా కూడా 2009లో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచింది. భ‌విష్యత్తులో త‌న కెరీర్ ఫేస్‌బుక్‌తో బోణీ కొడుతుంద‌ని అప్పుడామె అస‌లు ఊహించ‌లేదు. అదికూడా రెండు కోట్లతో జాక్‌పాట్ కొడ‌తాన‌ని క‌ల‌లోనూ న‌మ్మలేదు. అలాగ‌ని అగ‌ర్వాల్ అల్లాట‌ప్పా విద్యార్థిని కూడా కాదు. అంత‌ర్జాతీయ సైన్స్ ఒలంపియాడ్ (2009)లో దేశం త‌ర‌ఫున పాల్గొన్న చ‌రిత్ర ఆమెది.
ఆస్తా..నేప‌థ్యమిదీ...
స‌మ్మర్ ఇంట‌ర్న్‌షిప్ కోసం ఆస్తా ఈ ఏడాది మేలో ఫేస్‌బుక్ కేంద్ర కార్యాల‌యం కాలిఫోర్నియాలో ప‌నిచేశారు. రెండు నెల‌ల పాటు ఆ సంస్థలో గ‌డిపారు. తాజాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేసే అవ‌కాశం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌ ఎనిమిదో సెమిస్టర్ చ‌దువుతున్నారు. వ‌చ్చే సంవ‌త్సరం అక్టోబ‌ర్‌లో ఫేస్‌బుక్‌లో చేరతారు. ఆస్తా రాజ‌స్థాన్ వాసి. వీరి నాన్నగారు రాజ‌స్థాన్ విద్యుత్ ప్రసార‌ణ్ నిగ‌మ్ లిమిటెడ్ (ఆర్‌వీపీఎన్ఎల్‌)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆస్తా కుటుంబం జైపూర్‌లో నివాసం ఉంటోంది. త‌ల్లిదండ్రుల‌కు ఇద్దరూ కుమార్తెలే. ఆస్తాయే చిన్నది. ఉన్నంత‌లో పిల్లలిద్దిరికీ మంచి విద్య అందించాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని ఆస్తా త‌ల్లి తెలిపారు. ఆస్తా అక్క ప‌విత్ర కూడా ఐఐటీ ఢిల్లీలో కెమిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఐఐటీ జేఈఈ (2011)లో ఆస్తా ఓపెన్ కేట‌గిరీలో అఖిల భార‌త స్థాయిలో 90వ ర్యాంకు సొంతం చేసుకుని ఐఐటీ బాంబే గ‌డ‌ప‌తొక్కారు. ఈమె సెయింట్ జేవియ‌ర్స్ స్కూల్ జైపూర్‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుకున్నారు. 2011 ప‌రీక్షల్లో 98 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించారు.
గూగుల్‌నీ కాదంది...
ప్రస్తుతం ఆస్తా డ‌బ్బు కోసం కాకుండా ఫేస్‌బుక్‌లో ఎప్పుడెప్పుడు చేరుతానా అని ఎదురుచూస్తోంది. అంతేకాదు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఆస్తాకు ఎర్ర తివాచీ ప‌రిచింది. అయితే దాన్ని ఆమె తిర‌స్కరించిన‌ట్టు ఆస్తా నాన్న అశోక్ అగ‌ర్వాల్‌ తెలిపారు. ఇంత‌కీ గూగుల్‌ని కాద‌నుకుని ఫేస్‌బుక్‌లో చేర‌డానికి ఆమె ఎందుకు అంగీక‌రించార‌నే సందేహం రావొచ్చు. ఇదే విష‌యాన్ని ఆస్తాని అడిగితే...గూగుల్‌తో పోల్చుకుంటే ఫేస్‌బుక్‌లో త‌క్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. దీన్ని నేను అనుకాలాంశంగా భావిస్తున్నాను. ఎందుకంటే మ‌న‌దైన ముద్ర వేయ‌డానికి ఇలాంటి చోట ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. అలాగే మ‌న ప్రతిభ చుట్టూ ఉన్నవారికే కాకుండా యాజ‌మాన్యానికి నేరుగా స్వల్ప వ్యవ‌ధిలోనే తెలుస్తుంది. వీట‌న్నింటికీ మించి అన‌తికాలంలోనే ఎదిగే అవ‌కాశాన్ని ద‌క్కించుకోవ‌డం సులువే అంటూ వివ‌రించారామె. అందుకే ఫేస్‌బుక్ ఆఫ‌ర్‌ చాలా సంతోషంగా ఉంద‌న్నారు.
స‌మ‌యం విలువ తెలిసింది...
ప్రస్తుతం స్టార్ట్అప్ హ‌వా కొన‌సాగుతోంది. ఏదైనా సాధించొచ్చు. కంపెనీల‌ను ఏ స్థాయికైనా తీసుకెళ్లొచ్చు. ఇదంతా మ‌నం ఎంచుకునేదానిపైనే ఆధార‌ప‌డి ఉంటుందని ఆత్మవిశ్వాసంతో ఆస్తా చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్‌లో ఇంట‌ర్న్‌షిప్ కోసం ప‌నిచేసిన‌ప్పుడు జూక‌ర్‌బ‌ర్గ్‌ని ప్రత్యేకంగా క‌లిసే అవ‌కాశం రాలేదు. కానీ కొన్నాళ్ల కింద‌ట ఒక‌వార్త చ‌దివిన‌ప్పుడు ఆయ‌న స‌మ‌యానికి ఎంత విలువిస్తారో అర్థమైంది. ఎప్పుడూ ఒకే రంగు టీ ష‌ర్ట్‌నే జూక‌ర్‌బ‌ర్గ్ వేసుకుంటార‌నేది వార్తా సారాంశం. ఒకేర‌కం టీ ష‌ర్ట్‌లు క‌నీసం ప‌దైనా ఆయ‌న ద‌గ్గర ఉంటాయి. అంటే బీరువా ముందు నిల్చుని ఈ రోజు ఏ ష‌ర్ట్ వేసుకోవాల‌ని ఆలోచించ‌డానికి స‌మ‌యాన్ని వృథా చేసుకోవాల్సిన ప‌ని లేదాయ‌న‌కు. ఈ వార్త న‌న్ను ఆలోచించేలా చేసింది. దీనిద్వారా స‌మ‌యం ఎంత విలువైందో తెలుసుకున్నాను. స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని చెప్పేవాళ్లంతా దీన్నుంచి నేర్చుకోవాల్సిందెంతో ఉంది. అన‌వ‌స‌ర విష‌యాల కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించిన‌వాళ్లే స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తుంటారంటోంది ఆస్తా.
ప్యాకేజీ వెనుక...
ఇర‌వై ఏళ్లు నిండ‌ని ఇంజినీరింగ్ విద్యార్థికి రెండు కోట్ల ప‌ది ల‌క్షల‌ ఆఫ‌ర్ క్షణాల్లో జ‌రిగిన నిర్ణయ‌మేమీ కాదు. ఎందుకంటే ఫేస్‌బుక్ సంస్థ విద్యార్థుల‌కు రెండు ర‌కాల ఆఫ‌ర్లు ప్రక‌టిస్తుంది. అవి ప్రీ ప్లేస్‌మెంట్‌, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌. ప్రీ ప్లేస్‌మెంట్ అంటే కొంత మంది విద్యార్థుల‌ను ప్రాజెక్ట్ వ‌ర్క్ (ఇంట‌ర్న్‌షిప్‌) నిమిత్తం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన‌వారు ఎఫ్‌బీ కేంద్ర కార్యాల‌యం కాలిఫోర్నియాలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ స‌మ‌యంలో వీరి ప‌నితీరు, ఆలోచ‌నా విధానం, న‌డ‌క‌, న‌డ‌త అన్నీ 360 డిగ్రీల కోణంలో ప‌రిశీలిస్తారు. వీళ్లుచేసే ప్రతి ప‌నీ సంస్థకు ఎరుకే. అయితే ఈ ప‌రిశీల‌న అంతా విద్యార్థికి తెలీకుండానే జ‌రిగిపోతుంది. అప్పుడే ఆ విద్యార్థి కోసం గ‌రిష్ఠంగా ఎంత వ‌ర‌కు వెచ్చించొచ్చో ఒక నిర్ణయం జ‌రిగిపోతుంది. ఆస్తాతోపాటు మ‌రో ఇద్దరు ప్రీ ప్లేస్‌మెంట్ ద్వారా, ఇంకో ఇద్దరు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ ద్వారా ఐఐటీ బాంబే నుంచి ఎంపిక‌య్యారు. అయితే వీరంద‌రికీ గ‌రిష్ఠంగా కోటీ న‌ల‌భై ల‌క్షల రూపాయ‌ల‌కే ఆ కంపెనీ ఆఫ‌ర్ ఇచ్చింది. సాధార‌ణంగా ఫేస్‌బుక్ ఎక్కువ‌గా ప్రీ ప్లేస్‌మెంట్ ద్వారానే అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల అభ్యర్థి విష‌యంలో కంపెనీ పొర‌బ‌డే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే రెండు నెల‌ల పాటు ఆ సంస్థ కార్యాల‌యంలో విద్యార్థి ఇంట‌ర్న్‌షిప్‌లో ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న‌ చేస్తారు. ఇందులో మ‌న ఆస్తా అన్ని విధాలా రాణించ‌డ‌మే రెండు కోట్ల వెనుక ర‌హ‌స్యం. తెలివితేట‌లు, క్రమ‌శిక్షణ‌, ప‌నిపై నిబ‌ద్ధత‌, ప‌ట్టుద‌ల ఆమె విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈమె తాజా ఎంపికకు యాదృచ్ఛిక‌మో, అదృష్టం క‌లిసి రావ‌డ‌మో కార‌ణం కాదు. ఇది వంద శాతం ఆమె విజ‌యం. ఆమె తెలివితేట‌ల‌కు ద‌క్కిన గౌర‌వం.

Posted on 11-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning