'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!

మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది.. వచ్చే ఏడాది ఎలాగైనా ఉద్యోగం సాధించాల్సిందేనని భావిస్తుంటారు. మంచిదే. మరి వచ్చే ఏడాది తప్పకుండా కలల కొలువును సాధించాలంటే ఇప్పటి నుంచే పక్కాగా కసరత్తును ప్రారంభించాలి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే.. వచ్చే ఏడాది అయినా పదోన్నతులు లేకుంటే మంచి సంస్థల్లో కొలువులు రావాలని ఆశిస్తూ ఉంటారు. ఆ ఆశలు నెరవేరాలంటే వీరూ ఇప్పుడు సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ సమీక్ష ఎలా ఉండాలో.. నిరుద్యోగులు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం.
అసలు ఈ ఏడాది ఎందుకు ఉద్యోగం రాలేదు? కొలువును సాధించేందుకు ఎంత కష్టపడ్డాం? ఈ రెండు ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఆరా తీస్తే చాలు.. కొత్త సంవత్సరంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగైనట్టే. మూసధోరణిలో దరఖాస్తులు చేయడం, ముఖాముఖిలకు హాజరవడం కన్నా అసలు ఎక్కడ వెనుకబడి ఉన్నాం అనే అంశంపై కసరత్తు చేయాలి. మీతో పాటు మీ దరఖాస్తు చేసి ఉద్యోగం సాధించిన స్నేహితులు ఉంటే వారితో మీరు పోల్చి చూసుకొని.. అతనిలా ఉద్యోగం సాధించాలంటే మరేం చేయాలో ఆలోచించాలి. ఇలా చేయకుండా ఈ సంవత్సరంలాగానే కొత్త సంవత్సరంలోనూ ఉద్యోగాల కోసం అన్వేషిస్తే.. అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకోవడం కొంత కష్టం కావొచ్చు. అందువల్ల ఈ ఏడాది వైఫల్యాలు.. విజయాలను ఒకసారి సమీక్షించుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం. ఒకవేళ గతేడాది ఇలాగే సమీక్షించుకొని ప్రయత్నించినా.. ఉద్యోగం రాలేదంటే.. మీ సమీక్షలో అయినా సన్నద్ధతలో అయినా లోపముండాలి ముందు దాన్ని గుర్తించి సరిదిద్దుకోవాలి. అందుకోసం ఒకసారి ఇలా చేసి చూడండి.
* ఈ ఏడాది చేసిన దరఖాస్తులు వాటికి వచ్చిన స్పందనలను ఒక జాబితాగా రూపొందించుకోండి.
* ఇంటర్వ్యూలకు హాజరై ఉంటే వాటిని ఎలా ఎదుర్కొన్నారు.. వాటికి వచ్చిన స్పందనను ఒక చోట రాసుకోండి. తెలియకుంటే ఆయా సంస్థలను సంప్రదించి ఫలానా దరఖాస్తు, లేదా ఫలానా ఇంటర్వ్యూ సంగతి ఏమైందో కనుక్కొనేందుకు ఒకసారి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీరు గతంలో చేసిన లోపాలను తెలుసుకొని వాటి నుంచి బయటపడేందుకు కృషి చేయవచ్చు.
* ఎంచుకున్న రంగంలో కొత్తగా ఏం మార్పులు వచ్చాయో.. వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా మలచుకున్నారో ఒకసారి సమీక్షించుకోండి.
* ఆశించిన ఉద్యోగానికి సంబంధించి కొత్తగా ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా ఆరా తీయండి. మీలో నైపుణ్యం తక్కువగా ఉందనిపిస్తే.. పెంచుకొనేందుకు శిక్షణ తీసుకోండి.
కొత్తగా ఉద్యోగం కోసం కృషి చేస్తున్నవారు వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల లోపు ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి. ఈ సమయం దాటితే కళాశాలల్లో చదువు పూర్తి చేసి కొత్తగా వేల మంది విద్యార్థులు మీకు పోటీగా వచ్చే అవకాశ ముంటుంది. పైగా మొదటి మూడు నెలలలోపు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు పేర్కొంటున్నాయి. అందువల్ల మార్చిలోపే మంచి ఉద్యోగాన్ని సాధించడం లక్ష్యంగా కృషి చేయాలి.
ఉద్యోగం చేస్తున్నవారు..
ఈ ఏడాది ఏం సాధించాలనుకున్నారు.. ఇప్పటికి ఏం సాధించారు.. అనే అంశాన్ని సమీక్షించుకోవాలి. ప్రస్తుతం మీరు వృత్తిగతంగా ప్రయాణిస్తున్న మార్గం దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోగలదా.. చేరుకోలేకుంటే వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ప్రస్తుత మీ పనితీరు.. కొత్త సంవత్సరంలో మీ సంస్థ మీ నుంచి ఆశిస్తున్నది ఏంటో తెలుసుకోవాలి. సాంకేతిక విప్లవం వల్ల ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు ఎంచుకున్న రంగంలోనూ ఈ పాటికి ఎంతో కొంత మార్పులు వచ్చి ఉంటాయి. వాటిని ఏమేరకు అందిపుచ్చుకున్నారో సమీక్షించుకోండి. అందిపుచ్చుకోలేకుంటే ఎలాంటి నైపుణ్యాలను అదనంగా సాధించాలో ఆరా తీసి.. ఆ దిశగా శిక్షణ తీసుకోండి. ఇదంతా చేసిన తర్వాత మీరు ఈ ఏడాది ఏమేరకు రాణించారో ఒక అవగాహనకు వస్తారు. తర్వాత వచ్చే ఏడాది ఏం చేయాలో ఆలోచించుకుని ఆ వివరాలను ఒక జాబితాగా రూపొందించుకోవాలి. ఆ జాబితాలో పేర్కొన్న లక్ష్యాలను చేరుకొనేందుకు ఎలా కసరత్తు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించుకొని కొత్త సంవత్సరంలో ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమై ఉండాలి. ఈ ఏడాదికి సంబంధించిన వృత్తిగత నివేదికలు ఏవైనా ఉంటే వాటిని ఒకసారి సమీక్షించుకొని 2015లో మరింత సమర్థవంతంగా పని చేసేందుకు సిద్ధం కావాలి.

Posted on 16-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning