కోడింగ్ వీరుల కోసం... గూగుల్ కోడ్‌జామ్‌

కోడింగ్‌లో ప్రతిభావంతుల‌ను గుర్తించి, వారిని ప్రోత్సహించే ల‌క్ష్యంతో ఏర్పాటుచేసిందే గూగుల్ కోడ్‌జామ్‌. ప్రథ‌మ స్థానంలో నిల్చిన‌వారికి 15000 (రూ. 9 ల‌క్షలు) యూఎస్ డాల‌ర్లు, ద్వితీయ స్థానం పొందితే 2000, మూడో స్థానం ద‌క్కించుకుంటే వెయ్యి, తుది ద‌శ‌కు చేరుకున్న ప్రతి ఒక్కరికీ వంద‌ యూఎస్ డాల‌ర్ల‌ను అంద‌జేస్తారు. వివిధ వ‌డ‌పోత‌ల ద్వారా ఫైన‌ల్ పోటీల‌కు 26 మందిని ఎంపిక‌చేస్తారు. తుది ప‌రీక్ష గూగుల్ కేంద్ర కార్యాల‌యంలో నిర్వహిస్తారు. ఫైన‌ల్ పోటీల్లో పాల్గొన‌డానిక‌య్యే ఖ‌ర్చుల‌న్నీ గూగుల్ సంస్థే భ‌రిస్తుంది. ఈ కోడ్‌జామ్ గురించి మ‌రింత వివ‌రంగా. ..
క‌నీసం 18 ఏళ్లు నిండిన‌వారే కోడ్‌జామ్ ప‌రీక్షకు అర్హులు. సాధార‌ణంగా కోడ్‌జామ్ ప్రక‌ట‌న మార్చిలో వెల‌వ‌డుతుంది. అర్హత ప‌రీక్షను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. దీన్నే క్వాలిఫికేష‌న్ రౌండ్ అంటారు. ఈ రౌండ్‌లో క‌నీస పాయింట్లు సాధించిన‌వారే రౌండ్ వ‌న్‌కు ఎంపిక‌వుతారు. రౌండ్ వ‌న్‌లో స‌బ్ రౌండ్లు ఎ,బి,సి ఉంటాయి. ఒక్కో రౌండ్ వ్యవ‌ధి 2 గంట‌ల 30 నిమిషాలు. ఈ ద‌శ‌లో అభ్యర్థులు ఏదైనా స‌బ్ రౌండ్‌లో టాప్ 1000లోపు నిలిస్తేనే రౌండ్ 2 కి చేరుకుంటారు. అంటే మొత్తం 3000 మందిని రౌండ్ 2లోకి తీసుకుంటారు. ఇక్కడ నుంచి రౌండ్ 3లోకి 500 మందిని మాత్రమే ఎంపిక‌చేస్తారు. రౌండ్ 3 నుంచి అడ్వాన్స్ ద‌శ‌కు ఉన్నత ప్రతిభ క‌న‌బ‌ర్చిన 26 మందిని తీసుకుంటారు. ఫైన‌ల్ రౌండ్ ఆగ‌స్ట్ నెల‌లో గూగుల్ కార్యాల‌యంలో నిర్వహిస్తారు. ఈ ద‌శ‌కు ఎంపికైతే గూగుల్ కార్యాల‌యానికి చేరుకోవ‌డానికి విమాన టిక్కెట్లు, భోజ‌నం, ప్రయాణం, వ‌స‌తి ఖ‌ర్చుల‌న్నీ ఆ సంస్థే భ‌రిస్తుంది.
ప్రశ్నలిలా...
ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ఈ ప‌రీక్షల్లో అల్గారిథ‌మిక్ స‌మ‌స్యలు అడుగుతారు. ఇవి ఒక‌టి లేదా సిరీస్ రూపంలో ఉండొచ్చు. స‌మ‌స్యల‌కు ఇన్‌పుట్స్ ఇస్తారు. ఇవి పెద్దవిగా లేదా చిన్నవిగా ఉండొచ్చు. అడిగిన ఇన్‌పుట్స్‌ను కంటెస్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప్రతి ఇన్‌పుట్‌నూ సాధించ‌డానికి నిర్ణీత వ్యవ‌ధి ఉంటుంది. ఆలోగా దాన్ని పూర్తిచేయాలి. ఫైల్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయ‌గానే టైమ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. అభ్యర్థులు క‌చ్చిత‌మైన అవుట్‌పుట్ ఫైల్‌ని స‌మ‌ర్పించాలి. ఆ ఫైల్ రాబ‌ట్టడానికి అవ‌స‌ర‌మైన సోర్స్ కోడ్‌ను కూడా ఇవ్వగ‌ల‌గాలి. లేదంటే ఆ స‌మ‌స్యను ఎలా ప‌రిష్కరించారో వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. సాధార‌ణంగా చిన్న ఇన్‌పుట్ కోసం 4 నిమిషాలు, పెద్ద ఇన్‌పుట్ కోసం 8 నిమిషాల వ్యవ‌ధి ఉంటుంది. ఇత‌ర ఇన్‌పుట్స్ కోసం ప్రత్యేక స‌మ‌యం కూడా ఇవ్వొచ్చు.
స్మాల్ ఇన్‌పుట్స్‌
స‌మాధానంగా ఇచ్చిన కోడింగ్ స‌మాచారం స‌రైన‌దా కాదా గూగుల్ నిర్ణయిస్తుంది. అవుట్‌పుట్ ఫైల్‌, సోర్స్ కోడ్ ఫైల్ ఈ రెండూ క‌లిపి నాలుగు నిమిషాల్లో అభ్యర్థులు ఇవ్వలేక‌పోయినా, ఒక‌వేళ ఇచ్చిన అవుట్ పుట్ స‌రైన‌ది కాద‌ని గూగుల్ నిర్ధారించినా, ఆ స‌మ‌స్యను ఆ రౌండ్‌లో మిగిలి ఉన్న స‌మ‌యంలో ప‌రిష్కరించాలి. అయితే ఈ సారి కొత్త ఇన్‌పుట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
లార్జ్ ఇన్‌పుట్స్‌
ఒక లార్జ్ ఇన్‌పుట్‌ని ఒక ప్రయ‌త్నంలో మాత్రమే సాధించేలా రూపొందించారు. విఫ‌ల‌మైతే రెండోసారి ప్రయ‌త్నించడం కుద‌ర‌దు. ఇచ్చిన 8 నిమిషాల వ్యవ‌ధిలో ప‌లు ర‌కాల అవుట్‌పుట్లను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. అయితే ఆఖ‌రులో ఇచ్చిన అవుట్‌పుట్‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఆ రౌండ్ ముగిసిన వెంట‌నే మీరిచ్చిన అవుట్ పుట్ స‌రైన‌దా, కాదో గూగుల్ గుర్తిస్తుంది. అవుట్‌పుట్ ఫైల్స్‌ను గూగుల్ తెలిపిన ఫార్మాట్‌లోనే స‌మ‌ర్పించాలి. సోర్స్‌కోడ్ ఫైళ్లను ప్లెయిన్ టెక్స్ట్ లేదా జిప్డ్ ప్లెయిన్ టెక్స్ట్ విధానంలో స‌మ‌ర్పించ‌వ‌చ్చు. అయితే ఫైల్ ప‌రిమాణం వంద కేబీ కంటే ఎక్కువ‌ కాకూడ‌దు. సోర్స్ కోడ్ మొత్తం ప‌రిమాణం స‌మ‌ర్పించేట‌ప్పటికి ఒక ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడ‌దు. రౌండ్ వ్యవ‌ధి ముగిసిన త‌ర్వాత సోర్స్‌కోడ్స్ స‌మ‌ర్పించ‌డం కుద‌ర‌దు. ఆ రౌండ్ వ్యవ‌ధిలో త‌ప్పు సోర్స్‌కోడ్‌ను అవుట్‌పుట్‌గా స‌మ‌ర్పించామ‌ని గుర్తిస్తే ఆ విష‌యాన్ని ఆస్క్ ఎ క్వశ్చన్ లింక్ ద్వారా గూగుల్ నిర్ణేత‌ల‌కు తెలియ‌జేయ‌వ‌చ్చు.
స్కోర్ లెక్కింపు ఇలా...
పాయింట్స్‌: ప్ర‌తి స‌మ‌స్యకూ కొన్ని నిర్ణీత పాయింట్స్ ఉంటాయి. చిన్న ఇన్‌పుట్ స‌మ‌స్యకు 10 పాయింట్లు, పెద్ద ఇన్‌పుట్ స‌మ‌స్యకు 15 పాయింట్లు ఉండ‌వ‌చ్చు.
ర్యాంకింగ్‌: పోటీలో పాల్గొన్న అభ్యర్థుల‌కు వారు సాధించిన పాయింట్ల ద్వారా ర్యాంకింగ్ నిర్ణయిస్తారు.
తేలికైన ప్రశ్నల‌కు త‌క్కువ పాయింట్లు, కాస్త క‌ఠిన‌మైన ప్రశ్నల‌కు కొంచెం ఎక్కువ పాయింట్లు ఉంటాయి. అభ్యర్థులు అక్కడున్న ప్రశ్నల్లో న‌చ్చిన వాటికి ఎవ‌రి ప్రాధాన్యం ప్రకారం వారు స‌మాధానాలు రాసుకోవ‌చ్చు. సీ ++, జావా ఇలా అభ్యర్థులు వారికి న‌చ్చిన ప్రొగ్రామింగ్ భాష‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. అయితే ఈ పోటీల్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది సీ ++ నే ఉప‌యోగిస్తున్నారు. ఆ త‌ర్వాత స్థానం జావాదే.
పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్: https://code.google.com/codejam

Posted on 17-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning