ఉద్యోగాన్వేష‌ణ‌లో తొలి అడుగు... జాగ్రత్తగా మెలుగు !

* తప్పుడు ధ్రువీకరణలతో చేటు

* క్షుణ్నంగా దర్యాప్తు చేయిస్తున్న సంస్థలు

* పోలీస్‌ కేసులూ నమోదు

* కన్సల్టెన్సీలతో పారా హుషార్‌

 • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు మోసగిస్తున్నాయి. శిక్షణ ఇస్తామని, ఉద్యోగానుభవం ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తామని, అవసరమైతే ఆదాయపు పన్ను చెల్లింపునకు నిదర్శనంగా భావించే ఫారం 16 కూడా అందిస్తామని నమ్మించి ఉద్యోగార్థులను ఆకర్షిస్తున్నాయి. వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుని నకిలీ పత్రాలు ఇస్తున్నాయి. వీటిని నమ్ముకుని, దిగ్గజ ఐటీ సంస్థలకు దరఖాస్తు చేసుకుంటే, అభ్యర్థులకు ఉద్యోగం రాకపోగా అవమానాలు ఎదురవుతున్నాయి. కళాశాలల్లో జరిగే ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాని వారే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు దిగ్గజ ఐటీ సంస్థల అధికారులు.. 'ఈనాడు బిజినెస్‌' అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
  ఇంజినీరింగ్‌, ఎంసీఏ వంటి కోర్సులు చేసి, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందలేని వారు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు సిద్ధం అవుతుంటారు. చదువు పూర్తయినవారు హైదరాబాద్‌ వచ్చి, ఏదో ఒక కోర్సు చేస్తూ.. ఏడాది, రెండేళ్లు గడుపుతున్నారు. ఏదైనా ఐటీ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరైతే '2-4 సంవత్సరాల అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిస్తాం' అనే మాటతో ఉసూరుమంటున్నారు. ఏ సంస్థా ఉద్యోగమే ఇవ్వకపోతే అనుభవం ఎక్కడినుంచి వస్తుందనే నిస్పృహ వారిని ఆవరిస్తోంది. తోటివారు ఉద్యోగాల్లో స్థిరపడటం, తాము ఇంకా ఖాళీగా ఉంటూ ఇంటినుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో 'శిక్షణతో సహా ఉద్యోగాలిస్తాం/ఇప్పిస్తాం' అంటూ వూదరగొట్టే మోసపూరిత కన్సల్టెన్సీ సంస్థల పట్ల వారు ఆకర్షితులవుతున్నారు.

  నగదు వసూలు చేస్తోంది ఇలా

  * ప్రాజెక్టులు ఉన్నాయని, అవసరమైన శిక్షణ ఇస్తామని, నేర్చుకున్నాక కొంతకాలం తమవద్దే పనిచేయడానికి భరోసాగా నిలిచేందుకు నగదు డిపాజిట్‌ చేయాలని కోరతారు. ఇందుకోసం ఆయా సంస్థలు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌/కన్సల్టెన్సీ అనే పేరిట చలామణి అవుతున్నాయి. వాస్తవానికి ఈ కేంద్రాల్లో చేసే ప్రాజెక్టులు ఏమీ ఉండవు. తూతూమంత్రంగా శిక్షణ ఇస్తూ, ఏదో ఒక పని చేయిస్తున్నారు.
  * ఉద్యోగానుభవం-వేతన ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని, బ్యాంకు ఖాతాతో పాటు ఆదాయపు పన్ను చెల్లించినట్లుగా ధ్రువీకరించే ఫారం 16 కూడా కావాల్సిన సంవత్సరాలకు తయారు చేసి ఇస్తామంటూ ప్రలోభ పెడుతుంటారు. ఇలా తమ వద్ద తీసుకున్న పత్రాలతో ఉద్యోగం పొందారంటూ, తమ డేటాబేస్‌లో ఉన్న వారి వివరాలు చూపెడతారు కూడా.
  * మరికొన్ని సంస్థలు ఉద్యోగం ఇచ్చామంటూ నమ్మించి, ఒక్కో అభ్యర్థి వద్ద కనీసం లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. అనంతరం 2-3 నెలలు వారిచ్చిన మొత్తంలోనే ప్రతినెలా రూ.10,000-12,000 అందించి, అనంతరం బిచాణా లేపేస్తున్నారు. ఇలాంటి సంస్థలు ఫర్నీచర్‌ ఉన్న కార్యాలయాలతో పాటు కంప్యూటర్లను కూడా నెలవారీ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాయి.

  కన్సల్టెన్సీలతో ఐటీ సంస్థల సంబంధం ఇలా..
  సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నమ్మకమైన కన్సల్టెన్సీ సంస్థలతోనే వ్యవహారాలు నెరపుతుంటాయి. ఇలాంటివి హైదరాబాద్‌లో 20 వరకు ఉంటాయి. ప్రాంగణ నియామకాల అనంతరం అవసరమైతే తాజా అభ్యర్థులను, ప్రాజెక్టుకు అనుగుణమైన విద్యా నైపుణ్యాలు కలిగిన అనుభవజ్ఞుల నియామకానికి ఈ కన్సల్టెన్సీల సాయాన్ని ఐటీ సంస్థలు తీసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో శాశ్వత నియామకం కోసం అభ్యర్థులను సూచించమని కోరుతున్నాయి. ఎక్కువ సందర్భాల్లో 'ప్రాజెక్టు పని అప్పగిస్తాం. అనుగుణంగా తగిన అర్హతలున్న అభ్యర్థులతో పూర్తి చేయించమని' కోరుతున్నాయి. ఇదే అదనుగా కొన్ని మోసపూరిత సంస్థలు బరితెగిస్తున్నాయి. 6 నెలల క్రితం నొయిడాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి దిగ్గజ సంస్థ కోసం నియామకాలు జరుపుతున్నానంటూ పేరొందిన ఇంజినీరింగ్‌ కళాశాల సహా 5 కళాశాలల ప్లేస్‌మెంట్‌ అధికారులను సంప్రదించాడు. వారికి నమ్మకం కలిగించి, ఇంటర్వ్యూలు నిర్వహించి 30 మంది వరకూ ఎంపికయినట్లు ప్రకటించాడు. అనంతరం ఒక్కో అభ్యర్థికి ఫోన్‌ చేసి, ఖర్చుల కింద రూ.50,000 వరకు ఇవ్వమనడంతో విషయం బయటకు వచ్చి, పోలీస్‌ కేసు నమోదైంది.
  నకిలీ ధ్రువీకరణలు ఇస్తూ..
  ఐటీ కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో మోసపూరిత కన్సల్టెన్సీలు అభ్యర్థులకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి పంపుతున్నాయి. ఇది గమనించిన కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
  * తొలుత ఫోన్‌ సంభాషణలోనే అభ్యర్థి చెప్పేది నిజమా/అబద్ధమా అనే అంశాన్ని మానవ వనరుల నిపుణులు కనిపెట్టేస్తుంటారు. ఈ ప్రక్రియ అధిగమించి, ఇంటర్వ్యూకు వెళ్లి, అక్కడా నెగ్గుకొస్తే, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆరంభం అవుతుంది. ఆ సమయంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రతినిధి సంబంధిత కన్సల్టెన్సీకి వెళ్లినా, ఫోన్‌లో సంప్రదించినా, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రకారం సదరు అభ్యర్థి గురించి మంచిగా చెబుతుంటారు. కనుక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు అంతటితో ఆగడం లేదు. అభ్యర్థి బ్యాంకు ఖాతాను కూడా పరిశీలిస్తున్నాయి. ప్రతి సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆన్‌లైన్‌లో వేతనాలు చెల్లిస్తుంటుంది. ప్రతినెలా బ్యాంకు లావాదేవీల్లో ఇవి తప్పనిసరిగా నమోదవుతాయి. ఆ బ్యాంకుకే వెళ్లి, సదరు ఖాతా గురించి ఆరా తీస్తున్నారు. ఇక్కడే ఎక్కువమంది దొరికిపోతున్నారు.
  * ఉద్యోగానుభవం కింద అంతకుముందు అభ్యర్థి పనిచేసినట్లు చూపిన సంస్థ ఎలాంటిదో కూడా పరిశీలిస్తున్నారు. ఆయా సంస్థలకు మానవ వనరుల విభాగం అధికారులు వెళ్లి, అది వాస్తవ కంపెనీ యేనా, ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా లేక ధ్రువీకరణలు ఇచ్చేందుకు నిర్వహిస్తున్నదా అనే విషయమై పరిశోధిస్తున్నారు. ప్రాజెక్టులు లేకుండా నకిలీ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకే నిర్వహిస్తున్న కంపెనీగా తేలితే బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నారు. అభ్యర్థిని పంపిన సదరు కన్సల్టెన్సీ పేరునూ ఇదేవిధంగా నమోదు చేస్తున్నారు. అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వడం లేదని తేల్చి చెబుతున్నారు. ఒకవేళ ముందుగానే ఉద్యోగంలో చేర్చుకున్నా, నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో పోలీస్‌ కేసులు పెడుతున్నారు.
  * అనుభవాని (సీనియారిటీ)కి అనుగుణంగా ఐటీ సంస్థల్లో వేతనాలు మారిపోతాయి. రెండేళ్ల అనుభవం ఉన్నవారు, నాలుగేళ్లుగా చూపితే, అధిక వేతనం ఆఫర్‌ పొందవచ్చు. అయితే ప్రాజెక్టులో చేరాక, ఖాతాదారుకు సంతృప్తి కలిగేలా పనిచేయలేకపోతే, నియమించుకున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థకూ తరవాత ప్రాజెక్టులు పొందడం కష్టం అవుతోంది. అందుకే తీవ్రమైన చర్యలకూ వెనుకాడటం లేదు.
  * అనంతరం సదరు కన్సల్టెన్సీ ద్వారా వచ్చినా, ఉద్యోగానుభవ ధ్రువీకరణ సంబంధిత మోసపూరిత సంస్థ నుంచి తెచ్చిన అభ్యర్థులను ఎంపికకే పరిగణనలోకి తీసుకోవడం లేదు.
  కాంట్రాక్టుపై పనిచేస్తే..
  సాఫ్ట్‌వేర్‌ సంస్థకు వచ్చిన ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కన్సల్టెన్సీ కొందరిని కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తుంటుంది. వీరి వేతనాల కింద సాఫ్ట్‌వేర్‌ సంస్థ నుంచి ఎంత తీసుకున్నదీ అభ్యర్థులకు తెలియదు. అభ్యర్థులతో తాము చేసుకున్న ఒప్పందం మేరకు, కన్సల్టెన్సీయే వారికి కొంతమొత్తం చెల్లిస్తుంది. ఈ విధానంలో ఉద్యోగి సదరు సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగి కాదు. కేవలం ఒప్పంద కార్మికుడిలానే పరిగణిస్తారు. ఏడాది-రెండేళ్లు పనిచేసినా, సదరు సంస్థ నుంచి 'ఉద్యోగానుభవం' ధ్రువీకరణ కానీ, వేతన ధ్రువీకరణ కానీ ఇవ్వరు.
  ధ్రువీకరించుకున్నాకే ఉద్యోగం ఇస్తున్నాం
  అభ్యర్థి విద్యార్హతలు, నేరచరిత్ర, గత ఉద్యోగానుభవం వంటి అంశాలన్నీ క్షుణ్నంగా తనిఖీ చేశాకే, ఆఫర్‌ లెటర్‌ ఇస్తున్నాం. మా సంస్థ ప్రతినిధులు వెళ్లి విచారించేవి కొన్ని ఉంటే, నమ్మకమైన ఏజెన్సీల ద్వారా కూడా పరిశీలింప చేస్తున్నాం. అనుభవజ్ఞులకు చేసే ఇంటర్వ్యూ బృందంలో పాలనాధికారితో పాటు, మానవ వనరుల అధికారి, టెక్నాలజీ నిపుణులు ఉంటారు. పలు విడతలుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. గతంలో పనిచేసిన సంస్థలో అందుకున్న ఆఖరి వేతన రశీదు అడుగుతాం. వాటిని అక్కడకు వెళ్లి పరిశీలింప చేస్తున్నాం.


  - వి.రాజన్న, టీసీఎస్‌ ప్రాంతీయాధిపతి
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning