కొలువుల కల.. సాధ్యమిలా!

* ఐఐటీ బొంబాయి విద్యార్థి జీతం ఏడాదికి రెండుకోట్లు...
* పశ్చిమ గోదావరి కుర్రాడి వేతనం కోటి...
* ఇరవై నిండిన అమ్మాయి సంపాదన ఎనభై లక్షలు...

ఎక్కడ చూసినా ప్రాంగణ నియామకాల్లో దుమ్ము రేపుతున్న కుర్రకారు వార్తలే... కొలువుల మేళాలో ఈ జోరేంటి? ఇంతకీ అభ్యర్థులేం కనికట్టు చేశారు? కంపెనీలను ఎలా ఆకట్టుకోగలిగారు? కొందరు విజేతలను కలిసింది ఈతరం. వాళ్ల అనుభవాలు క్రోడీకరించింది... విద్య, మానసిక నిపుణులతో చర్చించింది... వారి విలువైన సూచనలను ప్రోది చేసింది...
నిన్నటి దాకా పాకెట్‌మనీ కోసం అమ్మానాన్నలపై ఆధారపడ్డ యువత. ఇప్పుడు లక్షల సంపాదన. అదీ కాలేజీ నుంచి అడుగు బయట పెట్టకుండానే! కొలువు కావాలంటూ కంపెనీ మెట్లు ఎక్కకుండానే! సాటి వారు ఈర్ష్యపడేలా... కొన్ని కంపెనీల సీఈవోల జీతాలనే తలదన్నేలా సాధించిన విజయం వెనక ఉన్న రహస్యమేంటీ? ఇతర విద్యార్థులకు భిన్నంగా వీరిలో మెరిసిన నైపుణ్యాలేంటీ? వీళ్లేమైనా అదనపు పుస్తకాలు చదివారా? పుస్తకాల పురుగులైపోయినట్టు చదువు తప్ప వేరే లోకం లేనట్టు పాఠాలు రుబ్బేశారా? ఇలా ఎన్నెన్నో సందేహాలు మిగతా విద్యార్థుల్లో తలెత్తడం సహజం. ఇక్కడే చాలా మంది విద్యార్థులు 'ఆ... వాళ్లంతా టాపర్స్‌ బాస్‌! మనకంత సీన్‌ లేదు' అనుకుని సమాధాన పడిపోతూ ఉంటారు. అంతేతప్ప తమలో ఉండే లోపాల్ని సరిదిద్దుకునే దిశలో కానీ, విజేతల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించి అలవరచుకునే దిశలో కానీ ఆలోచించరు.
నిజానికి భారీ ప్యాకేజీలు అందుకున్న వాళ్లలో ఎక్కువ మంది ఐఐటీ, ఎన్‌ఐటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల చదువరులే. అరుదుగా ఐఐఐటీ, ఇతర కాలేజీల్లోనూ కోటి జీతం కొట్టిన ఘనులున్నారు. ఇక్కడే ప్రతిభ కొద్దిమందికే పరిమితమా అనే సందేహం రాక మానదు. పోనీ అలాగే అనుకున్నా అలాంటి విద్యాసంస్థల్లో చదివిన అందరికీ ఇలాంటి ప్యాకేజీలు రాలేదేం? అసలు అలాంటి ప్రాంగణాల్లో చేరారంటేనే ప్రతిభావంతుల కింద లెక్క. మరి వారిలో కూడా అనేక మందికి ఇంతటి అవకాశాలు దొరకలేదేం?
ఇదే ప్రశ్నను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణ నియామకాల విభాగం డైరెక్టర్‌ అచలపతి ముందుంచింది 'ఈతరం'. ఆయన అభిప్రాయం ప్రకారం చూస్తే, 'భారీ ప్యాకేజీలు అందుకునే వారంతా పుస్తకాల పురుగుల్లా చదివేశారనుకోనక్కర్లేదు. వాళ్లూ మిగతా విద్యార్థుల్లాంటి వాళ్లే. అయితే వారు చదివే తరహా మాత్రం భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. సబ్జెక్ట్‌ను బట్టీ పట్టడం కన్నా, కాన్సెప్ట్‌ను అర్థం చేసుకునేందుకు వీళ్లు ప్రయత్నిస్తారు. ఆ తపనే ప్రాంగణ నియామకాల్లో వారిని ముందుండేలా చేస్తుంది. చదువు పట్ల ఆ ఓరియంటేషన్‌ను అలవరచుకుంటే ఏ విద్యార్థి అయినా మరిన్ని అవకాశాలు అందుకోవడం సాధ్యమే' అంటూ విశ్లేషించారు.
మరి అలాంటి దృక్పథాన్ని అలవరచుకోవాలంటే ఏం చేయాలి? ఈ సందేహాన్ని మానసిన నిపుణుడు వీరేందర్‌ దృష్టికి తెచ్చినప్పుడు, 'విజేతల్లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం సమయపాలన. వాళ్లూ మామూలు విద్యార్థుల్లాగా సెల్‌ఫోన్లు, టీవీలు, సినిమాలు, సరదాలు వదులుకోరు. కానీ దేనికి ఎంత కాలాన్ని వెచ్చించాలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. దేని ప్రభావానికీ పూర్తిగా లోనయిపోయి అది చదువుకునే సమయాన్ని హరించకుండా చూసుకుంటారు' అని వివరించారు.
ఐఐటీ, ఎన్‌ఐటీల విద్యార్థులకు భారీ ప్యాకేజీలు అందుతాయనేది వాస్తవమే అయినా, ఆ తర్వాత స్థాయిల్లోకి వచ్చే అనేక సాంకేతిక విద్యా సంస్థలు, కాలేజీలకూ అనేక కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం వస్తుంటాయి. అవి చేపట్టే పరీక్షల్లో రాణించాలన్నా విద్యార్థులు చదువుతో పాటు తను చదువుతున్న అంశంపై అవగాహన, లోతైన పరిశీలనలను పెంపొందించుకోవాలని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అభిప్రాయ పడ్డారు.
ఇంతకీ భారీ ప్యాకేజీలు అందుకున్న విజేతలు ఏమంటున్నారు? అదేమాట ఒరాకిల్‌ నుంచి 80 లక్షల వేతనానికి ఎంపికైన నజీర్‌బాబాని అడిగితే 'ఐఐటీ, ఎన్‌ఐటీల్లోనైనా సత్తా చూపినవాళ్లకే అందలం. ఈ రకంగా చూస్తే తమ ఎంపిక సబబే అనుకుంటాయి కంపెనీలు' అంటాడు. మరోవైపు త్రిబుల్‌ ఐటీ, ఇతర పేరున్న కాలేజీ విద్యార్థులూ మంచి జీతాలు అందుకుంటున్నారు. భారీ ఆఫర్లిస్తున్న కంపెనీల్లో ఐటీ, సాఫ్ట్‌వేర్‌దే ముందంజ. తర్వాత ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇతర రంగాలున్నాయి. అందులోనూ గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో లాంటి పెద్ద కంపెనీలదే సింహభాగం. అభ్యర్థుల్లో వాళ్లేం చూస్తున్నారు అంటే విజేతలందరూ చెప్పేది ఒకేమాట. కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌లపై పట్టుండాలనే. దాంతోపాటు ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్‌ చేయగల నేర్పు, పనిలో వేగం కూడా సంస్థలు ఆశిస్తున్నాయి. ఆ దిశగా ప్రతి విద్యార్థి ముందు నుంచే సిద్ధం కావడం మంచిదని వీళ్లు సూచిస్తున్నారు. కోటికి అటుఇటుగా ప్యాకేజీ అందుకున్న పృథ్వీతేజ్‌, హరీశ్‌చంద్రల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. 'భారీ వేతనాలిచ్చే కంపెనీలన్నీ విదేశాలకు చెందినవే. డాలర్లలో లెక్కేస్తే ఇది సగటు వేతనం కన్నా కొంచెమే ఎక్కువ' అంటారు.


గూగుల్‌ ట్రెండ్‌
ప్రస్తుతం అధిక వేతనాలు కొందరికే పరిమితమవుతున్నాయి. సాధారణ కాలేజీల్లో చదివే ప్రతిభ ఉన్న విద్యార్థుల మాటేంటనేది చాలామంది ప్రశ్న. దీనికి సమాధానంగా గూగుల్‌ ఓ కొత్త ట్రెండ్‌కి తెర తీసింది. సంస్థ నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షకి దేశవ్యాప్తంగా ఏ కాలేజీ విద్యార్థులైనా హాజరు కావొచ్చు. ఇందులో ప్రతిభ చూపినవాళ్లకి మరో దఫా పరీక్ష పెట్టి ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు. వీరికీ అధిక వేతనాలే.
గ్రామీణులకు అవకాశం
నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దొరికితే ఏ కంపెనీ వదలదు. ఎంత జీతమైనా ఇస్తుంది. ప్రాంగణ నియామకాల్లో కొన్ని కంపెనీలు కేవలం సబ్జెక్టే చూస్తుంటే, ఇంకొన్ని మెరిట్‌కీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్లాస్‌రూమ్‌లో టీచర్లు చెప్పిన పాఠాలతోపాటు బయట కోర్సులు నేర్చుకుంటే సంస్థల్ని మెప్పించే పరిజ్ఞానం సాధించొచ్చు. కోర్సులో భాగంగా చేసే ప్రాజెక్ట్‌వర్క్‌, ఇంటర్న్‌షిప్‌లో చూపే పనితనం ఎంపికలో కీలకమవుతాయి. ఆంగ్ల భాషపై పట్టులేకున్నా టెక్నికల్‌ స్కిల్స్‌ బాగుంటే గ్రామీణ విద్యార్థులు సైతం భారీ ప్యాకేజీలు అందుకునే అవకాశముంది.
-కె.వి.అచలపతి: డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లేస్‌మెంట్‌ సర్వీసెస్‌: ఓయూ
విజేతల లక్షణమిదే
సమాజంలో ఎలా ఆర్థిక అంతరాలున్నాయో విద్యార్థులు, ఉద్యోగార్థుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిభ, కంపెనీలను ఆకర్షించే విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. సహజంగా కాలేజీల్లో ప్రవేశించే విద్యార్థులకు ఒక్కసారిగా విపరీతమైన స్వేచ్చ వచ్చిపడుతుంటుంది. దీంతో రకరకాల ఆకర్షణలు తమవైపు లాగుతుంటాయి. కెరీర్‌పై స్పష్టమైన లక్ష్యంతో ఉన్నవారు ఈ ఉచ్చులో పడిపోరు. అనుక్షణం దాన్నే మననం చేసుకుంటారు. దీంతోపాటు వీళ్లు కేవలం టెక్ట్స్‌ పుస్తకాలకే పరిమితం కారు. తమకు సంబంధించిన సమాచారం ఎక్కడున్నా అందిపుచ్చుకుంటారు. క్లాసులో ఎంత నేర్చుకుంటారో బయటా అంతే సముపార్జిస్తారు. అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. చురుగ్గా స్పందిస్తారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. ఈ అంతర్గత లక్షణాలను కంపెనీలు తప్పకుండా గమనిస్తాయి.
- డా.సి.వీరేందర్‌, సైకాలజిస్ట్‌
భరోసా కల్పించాలి
మార్కుల శాతం బాగుండి, ఏ పనైనా సమర్థంగా చేయగలడు అని భరోసా కల్పించగలిగితే సంస్థలు ఎంత జీతమైనా ఇస్తాయి. టెక్నికల్‌ రౌండ్‌లో అప్పటికప్పుడే ఓ సమస్య ఇచ్చి దానికి అల్గరిథమ్‌ రాయమంటారు. ఏ లాంగ్వేజ్‌ వాడితే తొందరగా పరిష్కరించగలమో వివరించమంటారు. హెచ్‌.ఆర్‌. టెస్ట్‌ నామమాత్రమే.
- నసీర్‌బాబా (ఒరాకిల్‌- రూ.80 లక్షలు)
సబ్జెక్ట్‌పై పట్టు
ఐటీ కంపెనీలను మెప్పించాలంటే లోతైన సబ్జెక్ట్‌, కోడింగ్‌పై పట్టు ఉండాలి. ప్రోగ్రామింగ్‌ ఎంత బాగుంది, ఎంత వేగంగా చేయగలరో చూస్తారు. తమ సంస్థకు అనుగుణంగా నైపుణ్యాలు ఉన్నాయా లేదో పరిశీలిస్తారు. కొన్ని కంపెనీలైతే థియరీలు, కాన్సెప్ట్‌లు పరిశీలిస్తాయి.
- హరీశ్‌చంద్ర (సిస్కో- రూ.56లక్షలు)
ఇంటర్న్‌షిప్‌ కీలకం
ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ నాది. సబ్జెక్టుపై పట్టు ఉంటే ఎవరైనా కంపెనీలను ఆకట్టుకోగలరనడానికి నేనే ఉదాహరణ. కుటుంబ నేపథ్యం ఏదైనా, ఎక్కడి నుంచి వచ్చామన్నది చూడరు. అకడమిక్‌ కెరీర్‌ ఉద్యోగ ఎంపికలో కీలకమవుతుంది. ఇంటర్న్‌షిప్‌ సమయంలో మనకు తెలియకుండానే మనని గమనిస్తుంటారు. ప్రతిభ అంచనా వేస్తారు. నచ్చితే భారీ వేతనమే.
-పృథ్వీతేజ (శాంసంగ్‌- రూ. కోటి)

Posted on 20-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning