హైదరాబాద్‌లో గూగుల్‌కు ఇక శాశ్వత ప్రాంగ‌ణం

* 8 ఎకరాలు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
* దక్షిణాసియాలో పెద్ద ప్రాంగణమిదే!
* జనవరి మూడో వారంలో అవగాహన ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రపథంలో నిలిపే మరో ప్రక్రియకు తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేసింది. అంతర్జాల దిగ్గజం గూగుల్‌కు దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసింది. గూగుల్‌ సంస్థ కోరినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఎనిమిదెకరాల భూమిని కేటాయించడానికి అవసరమైన కసరత్తును దాదాపు పూర్తి చేసింది. జనవరి మూడో వారంలో తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. గతంలో ఓ ముఖ్యమైన సంస్థకు ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేసి గూగుల్‌కు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. పది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులతో గూగుల్‌ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పదెకరాల భూమిని 15 రోజులో అప్పగించాలని గూగుల్‌ ప్రతినిధులు కోరారు. నెలరోజుల్లో భూమిని అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రక్రియను ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుతం అద్దె వసతిలో ఉన్న హైదరాబాద్‌లోని గూగుల్‌ సంస్థలో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. శాశ్వతమైన సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు అనేక సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఐటీలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపే ప్రక్రియకు ఇది మరింత దోహదపడనుంది. కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా ఉన్న గూగుల్‌ సంస్థకు 40 దేశాల్లోని 70 నగరాల్లో ప్రాంగణాలు ఉన్నాయి. 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలో 20 ఎకరాల భూమిని గూగుల్‌కు కేటాయించింది. ఈ భూమి వివాదాల్లో చిక్కుకోవడంతో గూగుల్‌ సంస్థకు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. దీనిపై దృష్టి సారించిన మంత్రి కె.తారకరామారావు గూగుల్‌ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు. వివాదాల్లేని పదెకరాల భూమిని ఇస్తే శాశ్వత ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో తమకు కేటాయించిన భూమిని ఓ సంస్థ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ భూమిని గూగుల్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Posted on 24-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning