గూగుల్‌ను ఎలా మెప్పించానంటే..

* 'న్యూస్‌టుడే'తో అనుభూతులను పంచుకున్న స్పందన
వరంగల్ (పోచమ్మమైదాన్‌, న్యూస్‌టుడే): గూగుల్‌... ఫేస్‌బుక్‌- విశ్వజనీనమైన ఈ రెండింటికీ ప్రత్యేక పరిచయం ఏమీ అక్కర్లేదు. ఈ రెండు సంస్థలు ఈ ఏడాది సెప్టెంబరులో మన ఓరుగల్లు అమ్మాయి... వరంగల్‌ బ్యాంక్‌కాలనీకి చెందిన స్పందనకి ఉపకార వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చాయంటే ఎంత అరుదైన విషయం! గూగుల్‌ ఉపకారవేతనానికి నాడు ప్రపంచవ్యాప్తంగా 27 మంది ఎంపికైతే అందులో స్పందన చోటు దక్కించుకుంది. ఫేస్‌బుక్‌ ఉపకారవేతనానికి విశ్వవ్యాప్తంగా ఎంపికైన 25 మందిలో స్పందన ఒకరు. గూగుల్‌ సంస్థ టోక్యోకు ఆహ్వానించి ఒక లక్ష రూపాయలు ఇవ్వగా... ఫేస్‌బుక్‌ సంస్థ అమెరికాలో జరిగిన సదస్సులకు తీసుకెళ్లింది. ఈ రెండు సంస్థలు ఇలా తమ ఉపకారవేతనం ద్వారా అందించిన ప్రోత్సాహం మరవకముందే మరో గొప్ప అవకాశాన్ని స్పందన చేజిక్కించుకుంది. ఆమె గూగుల్‌లో ఉద్యోగిని కాబోతోందనేది తాజా అంశం. సంస్థ నియమాల దృష్ట్యా జీతభత్యాల వివరాలను వెల్లడించలేనని అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన విధానం గురించి చెప్పడానికైతే అభ్యంతరం లేదని అంటూ ఆ వివరాలను 'న్యూస్‌టుడే'తో పంచుకున్నారు.
* నాలుగు కంపెనీలతో ఇంటర్వ్యూలు చేశా..
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాలుగు కంపెనీలు నన్ను ఇంటర్వ్యూ చేశాయి. నాలుగింటిలోనూ అవకాశం వచ్చింది. నేను గూగుల్‌నే ఎంచుకున్నా. ఎందుకంటే గూగుల్‌లో పనిచేయడం ఒక మంచి సవాలు. మన పనితనాన్ని మెరుగుపర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అందులో చేరడానికే సిద్ధమయ్యా. గూగుల్‌ సంస్థలో ఉద్యోగం లభించాలంటే ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష రాయాలి. తర్వాత దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నేను ఇంత క్రితమే గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఉపకారవేతనాలకు ఎంపికవడంతో గూగుల్‌ సంస్థ వారు థ్రిల్‌ అయి ఆన్‌లైన్‌ పరీక్ష నుంచి నన్ను మినహాయించారు. దీంతో నేరుగా మూడు రౌండ్ల ఇంటర్వ్యూకి హాజరై తుదకు విజయం సాధించా. ముందుగా టెలిఫోన్‌ ఇంటర్వ్యూ చేశారు. టెక్నికల్‌ డేటా స్ట్రక్చర్‌, మిషన్‌ లర్నింగ్‌పై ప్రశ్నలు అడిగారు. చివరగా హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆకాడమిక్‌ వివరాలు, ప్రాజెక్ట్‌పై ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడిగారు. నేను విజయం సాధించడాన్ని బట్టీ నాకు అనిపించిందేమిటంటే ప్రశ్న అడగగానే ఠక్కున సమాధానం చెప్పడం ముఖ్యం కాదు. ప్రశ్నకు సమాధానం ఏవిధంగా చెప్తున్నామో... సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నామో కీలకంగా గమనిస్తారని అర్థమైంది. ఆలోచనా విధానానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారనిపించింది. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సమయం కూడా ఇచ్చారు. ప్రస్తుతం నేను చెన్నై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూప్‌లో ఎంటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు చివరి సంవత్సరం చేస్తున్నా. 2015లో చదువు పూర్తి కాగానే అమెరికాలోని మౌన్‌టెన్‌వ్యూలో గూగుల్‌ సంస్థలో విధుల్లో చేరతా.
* చిన్నప్పటి నుంచి ప్రతిభ ప్రదర్శన
చదువులో స్పందనరాజ్‌ చిన్నప్పటి నుంచి ప్రతిభను ప్రదర్శించేదని ఆమె తల్లి తండ్రులు రాజేశ్వర్‌, జ్యోతి తెలిపారు. 'నేను గణితం అధ్యాపకుడిని కావడంతోనో ఎందుకో గానీ ఆమె ప్రాథమిక విద్య నుంచి గణితంపై మంచి పట్టు సాధించింది' అన్నారు రాజేశ్వర్‌. 7వ తరగతిలోనే పదవ తరగతి లెక్కల్ని చేసేదని వివరించారు. ఒయాసిస్‌ పాఠశాలలో పదవ తరగతి చదివి 572 మార్కులు సాధించి జిల్లాలో రెండో ర్యాంకర్‌గా నిలిచిందన్నారు. నారాయణలో ఇంటర్‌ చేసి ప్రతిభ కనబరిచిందన్నారు.
* పరిశోధనలపై ఆసక్తి...
2015లో గూగుల్‌లో ఉద్యోగంలో చేరాక విధులు నిర్వహిస్తూనే పీహెచ్‌డీ చేస్తానని స్పందన తెలిపారు. మిషన్‌ లర్నింగ్‌లో పీహెచ్‌డీ చేస్తానన్నారు. ఐఐటీలో ప్రాజెక్ట్స్‌ చేశానని, సదస్సులకు హాజరయ్యానని తెలిపారు. పాఠశాల స్థాయిలో థియరీ, సైన్స్‌ నేర్చుకుంటామని కానీ ఐఐటీలో కాన్సెప్ట్స్‌ నేర్చుకుంటామని వివరించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె 'మన వారు విదేశాల్లో ఉన్నా అక్కడ కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలతో పాటు భారతదేశానికి ఉపయోగపడుతుంది' అని అన్నారు. చదువుకున్న విద్యను నిజ జీవితంలో అమలుచేయాలన్నారు. అనుభవాలు... అనుభూతుల నుంచి నేటి విద్యార్థులకు ఏం చెబుతారని అడిగితే 'విద్యార్థులు లక్ష్యం వైపు దూసుకెళ్లాలి. యువత పరిశోధనల వైపు దృష్టిసారించాలి. ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయిలోనే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఏదశలోనూ ఆపకుండా నిరంతరం కృషిచేస్తేనే విజయం సాధ్యమవుతుంది. చిన్న చిన్న సమస్యలకు భయపడి వెనక్కి వెళ్లొద్దు. ఏ సమయంలోను ఒత్తిడికి లోనుకాకుండా ముందుకెళ్లాలి. పాజిటివ్‌ థింకింగ్‌ చాలా ముఖ్యం' అని స్పందన వివరించారు.

Posted on 24-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning