ఐటీకి సరికొత్త జోరు

* అనుకూల పరిస్థితులు ఎన్నో!
* మూడో క్లస్టర్‌గా ఆదిభట్ల
* 18% వృద్ధిరేటు అంచనా

ఈనాడు - హైదరాబాద్‌: కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌ ఐటీ రంగం సరికొత్త పుంతలు తొక్కనుంది. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధనకు కేంద్రం కానుంది. ఉత్పత్తులను అభివృద్ధి చేసే మరిన్ని కొత్త కంపెనీలు ప్రాణం పోసుకోనున్నాయి. పరిశ్రమ, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా), ప్రభుత్వ సమష్టి కృషి రానున్న కాలంలో ఐటీ ఉత్పత్తుల అభివృద్ధికి దేశంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అనేక అనుకూల పరిస్థితులు ఉండడమే ఇందుకు కారణం. నాలుగైదు వారాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, పరిశోధనకే పెద్ద పీట వేసే అవకాశం ఉందని.. 2015లో ఈ విధానం హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మంచి వూపు ఇవ్వగలదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని పరిస్థితులు హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రపంచ స్థాయి నిర్వహణ విద్యాను అందించడానికి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), బిట్స్‌ పిలానీ ప్రాంగణం వంటి ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధిలో దాదాపు 26 ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అనుభవం ఉన్న నిపుణులకు, కొత్త ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కొదవలేదు. అన్నింటికి మించి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంది. పక్కన ఉన్న చెన్నైతో పోల్చినా చదరపు అడుగు కార్యాలయ స్థలానికి చెల్లిస్తున్న అద్దె హైదరాబాద్‌లో తక్కువగా ఉంది. ఇవి 2015లోనే కాక వచ్చే అయిదారేళ్ల కాలంలో ఐటీ పరిశ్రమను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు దోహదం చేయనున్నాయి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలుగా విడిపోయినప్పటికీ.. గత ఏడాదిలో ఆ ప్రభావం ఐటీ పరిశ్రమపై కనిపించలేదు. ప్రతి నెల కంపెనీలు ప్రాంగణ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తూనే వచ్చాయి. ఐటీ పరిశ్రమలో ప్రాంగణ విస్తరణలు ఆదాయాలు పెరుగుదల, కొత్త ఉద్యోగాల లభ్యతను సూచిస్తుంది. పరిశ్రమ వృద్ధిరేటు కన్నా ఇక్కడి వృద్ధిరేటు ఎక్కువగానే ఉందని, ఇది వచ్చే ఏడాదిలో కూడా కొనసాగగలదని అంచనా. 18-20 శాతం మధ్య వృద్ధిరేటు నమోదు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకూ హైటెక్‌ సిటీ, గచ్చీబౌలి ప్రాంతాలు ఐటీ క్లస్టర్లుగా ఉన్నాయని.. వచ్చే ఏడాది, ఆతర్వాతి కాలంలో ఆదిభట్ల మూడో ఐటీ క్లస్టర్‌గా ఎదగనుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు గట్టి పునాది వేయడానికి నాస్‌కామ్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పరిశ్రమకు అనుకూలమైన ఐటీ విధానాన్ని రూపొందించింది. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కొత్త ఐటీ కంపెనీలు రావచ్చని.. మున్ముందు ఇది వేగం పుంజుకోగలదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
2014లో విస్తరణ పరంపర: అనేక కంపెనీలు గత ఏడాది విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. గచ్చీబౌలీలోని వేవ్‌రాక్‌ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 7,000 మంది ఐటీ నిపుణులు కూర్చుని పని చేయడానికి అవసరమైన కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులో రెండో దశకు టిష్‌మన్‌ స్పేయర్‌ శ్రీకారం చుట్టింది. ఇందుకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తోంది. వేవ్‌రాక్‌ ప్రాజెక్టుపై టిష్‌మన్‌ స్పేయర్‌ మొత్తం రూ.1050 కోట్ల పెట్టుబడిపెట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. వేలమంది ఐటీ నిపుణులు కూర్చుని పని చేయడానికి వీలవుతుంది. గచ్చీబౌలీలోని ప్రాంగణాన్ని రూ.500 కోట్లతో విస్తరిస్తున్నట్లు కాగ్నిజెంట్‌ ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన హైదరాబాద్‌ ప్రాంగణంలో ప్రస్తుతం దాదాపు 18 వేల మంది పని చేస్తున్నారు. విస్తరణ పనులు పూర్తయితే మరో 8,000 మంది నిపుణులు పని చేయడానికి సదుపాయం లభిస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో పెద్ద, సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గూగుల్‌కు మార్గం సుగమం అయింది. మైక్రోసాఫ్ట్‌ సైతం హైదరాబాద్‌లోని కార్యకలాపాల విస్తరణపై సుముఖత వ్యక్తం చేసింది. ఆదిభట్లలో దాదాపు 25,000 మంది నిపుణులు పనిచేయడానికి వీలైన ప్రాంగణాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సిద్ధం చేస్తోంది. 2015లోనూ ఐటీ కంపెనీల విస్తరణలను కొనసాగే వీలుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త టెక్నాలజీలు..: క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా విశ్లేషణ వంటి కొత్త సంకేతిక పరిజ్ఞానాలు 2015లో మరింత వేళ్లూనుకోనున్నాయి. వీటితోపాటు 3డీ ప్రింటింగ్‌కు ఆదరణ పెరగొచ్చు. కంపెనీలు ఐటీ ద్వారా ఆటోమేషన్‌ను పెంచుకోవడానికి మొగ్గు చూపొచ్చు. డిజిటల్‌ ఇండియా ప్రభావంతో దేశీయంగా ఐటీపై వ్యయం పెరిగే వీలుంది.

Posted on 30-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning