ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

* జూన్‌లోగా నైపుణ్యాభివృద్ధి వర్సిటీ ఏర్పాటు
* జూన్ 15 నాటికి 75% అధ్యాపక ఖాళీల భర్తీ
* ఏప్రిల్ నాటికి పాలకమండళ్ల ఏర్పాటు
* అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలో మార్పులు
* 'అప్రెంటీస్‌'కు ప్రాధాన్యం
* ఏపీ ఉన్నత విద్యాశాఖ భవిష్య కార్యాచరణ

ఈనాడు-హైదరాబాద్: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏపీ ఉన్నత విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయం ఏర్పాటు, విద్యా ప్రమాణాలు పెంపునకు.. కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు లభించేలా మారే పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక మార్పులకు ప్రాధాన్యం ఇస్తోంది. డిసెంబరు 18, 19 తేదీల్లో ఉపకులపతులతో సీఎం చంద్రబాబు జరిపిన ప్రత్యేక సమావేశాలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా శాఖ కార్యాచరణను తయారుచేసింది. దీని ప్రకారం..
* విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో 75% వాటిని జూన్ 15వ తేదీ నాటికి పూర్తిచేయాలి.
* విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పాలకమండళ్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు.
* ఏప్రిల్ 2015 నాటికి రాష్ట్రస్థాయిలో అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీ ఏర్పడనుంది.
* నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం 2015 జూన్ లోగా ఏర్పాటు. దీనికి అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో తప్పనిసరిగా ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు.
* కళాశాలలకు వాటి పనితీరు ప్రతిపాదికన శ్రేణులు కేటాయింపు. ప్రతి కళాశాల తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందేలా చర్యలు.
* ఇంజినీరింగ్ విద్యలో రెండు సంవత్సరాలకోసారి పాఠ్యప్రణాళికను మార్చనున్నారు. పీజీ, యూజీ కోర్సుల పాఠ్యప్రణాళికను మూడేళ్లకోసారి మార్చాలి. మారే పరిస్థితులకు అనుగుణంగా, పరిశ్రమల అవసరాలను పరిగణనలోనికి తీసుకుని ఈ మార్పులు జరగాలి.
* ఆన్‌లైన్‌లో ఒక సబ్జెక్టుకైనా పరీక్షలు జరగాలి. ఆన్‌లైన్ ద్వారా కోర్సులు, పరిశోధనా ప్రాజెక్టులకు క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థులకు ఉపాధిపట్ల ఆసక్తి ఉంటే 'గ్యాప్ ఇయర్' అవకాశాన్ని కల్పించాలి. అన్ని రకాల కళాశాలల్లో విలువలు-నైతికతపై కోర్సులు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
* ఇంజినీరింగ్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు పూర్తిచేసే వారికి 'అప్రెంటీస్' విధానం తప్పనిసరి. అయితే పరిశ్రమల అవసరాలకు, ఉద్యోగావకాశాల కల్పనకు అనుగుణంగా అప్రెంటీస్ విధానం ఉండాలన్నదే ఆలోచన. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆన్‌లైన్ విధానం అలవడేలా చర్యలు తీసుకుంటారు.
* విశ్వవిద్యాలయాల్లో స్మార్ట్ క్యాంపస్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. వైఫై వంటి అత్యాధునిక ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు.
* విశ్వవిద్యాలయాల్లో ఐచ్ఛిక ఆధారిత పరపతి (ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) విధానాన్ని అమలుచేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ప్రముఖ అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించి విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. స్నాతకోత్సవ వేడుకలనూ భారీగా జరిపి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి.
* విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు తరచూ పునశ్చరణ తరగతులు నిర్వహించాలి. ఆంధ్రా, ఎస్వీయూలోని అకడమిక్ స్టాఫ్ కళాశాలలను పటిష్ఠం చేయనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయిలో అకడమిక్ సంస్థ ఏర్పాటు చేయనున్నారు.
* సత్ఫలితాలు కనిపించేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలి.
       ఏపీ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నీలంసాహ్ని తయారుచేసిన ఈ కార్యచరణ ప్రణాళికలో ఏపీ ఉన్నత విద్యా మండలి, కళాశాల, సాంకేతిక విద్యా శాఖలు కీలక భాగస్వాములు కానున్నాయి. అలాగే విశ్వవిద్యాలయాల పాత్రకు ప్రాధాన్యం పెంచారు. పైన పేర్కొన్న బాధ్యతలను ఎవరెవరు చేపట్టాలన్న దానిపై కూడా ఉన్నత విద్యా శాఖ అవసరమైన సూచనలు చేసింది.

Posted on 30-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning