కొత్త కంపెనీలు కోకొల్లలు..

* సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధి కోసమే
* మారుతున్న భారత ఐటీ ముఖచిత్రం
* అనుకూల పరిణామాలే కారణం
* 2.5 లక్షల మందికి ఉపాధి!

ఈనాడు హైదరాబాద్‌: దేశీయ సాఫ్ట్‌వేర్‌ రంగంలో సరికొత్త శకం ప్రారంభమవుతోంది. ఉత్పత్తుల అభివృద్ధి కంపెనీలు భారీగా రానున్నాయి. గత అయిదారేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ చేసిన కృషి ఫలించి సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్త ఉత్పత్తులను అభివృద్ధికి కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడానికి నవతరం ఉరకలు వేస్తోంది. కొన్ని కంపెనీలు విజయం సాధించడంతో దాన్ని స్పూర్తిదాయకంగా తీసుకుని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు కోట్ల పారితోషికాలను వదులుకుని ఐటీ రంగంలో వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌లు, కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తున్నాయని.. ఒక ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి అనుభవం ఉన్న కంపెనీల అధిపతులు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు ఎంతగానో సహాయ, సహకారాలు అందిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. అందువల్లే గత కొద్ది సంవత్సరాల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధిలో ఎంతో పురోగతి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధిపై దాదాపు 3,500 కొత్త కంపెనీలు (స్టార్టప్‌లు) కసరత్తు చేస్తున్నాయని తెలిపారు.
ఇ-కామర్స్‌ విప్లవం
ఇ-కామర్స్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, దుస్తుల నుంచి చిల్లర సరకుల వరకూ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ట్యాక్సీ బుకింగ్‌ వంటి సేవల రంగంలో సైతం ఇ-కామర్స్‌ వేగంగా విస్తరిస్తోంది. దీంతో చిన్న, చిన్న వ్యాపార సంస్థల నుంచి భారీ కార్పొరేట్‌ కంపెనీల వరకూ తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. సంప్రదాయ పంపిణీ వ్యవస్థ నుంచి ఆన్‌లైన్‌ విక్రయాలకు మొగ్గు చూపుతున్నాయి. ఇదే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉత్పత్తుల అభివృద్ధికి కొత్త కంపెనీలను స్థాపించడానికి ఔత్సాహికులను పురిగొల్పుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇ-కామర్స్‌ ఉత్పత్తుల అభివృద్ధిపై స్టార్టప్‌లు దృష్టి కేంద్రీకరిస్తున్నాయని వివరిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌లు అత్యధికంగా 3,000 పైగా ఉన్నాయి. వచ్చే ఆరేళ్లలో (2020 నాటికి) వీటి సంఖ్య 11,500కు చేరగలదని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. ఈ కంపెనీలు మొత్తం 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వీలుంది. ఇందులో కొన్ని కంపెనీల ఉత్పత్తులు విజయం సాధించినా.. ఆ కంపెనీలు ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదుగుతాయి. ఇ-కామర్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్‌ యాస్‌ ఎ సర్వీస్‌ (ఎస్‌ఏఏఎస్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మొబిలిటీ, డేటా విశ్లేషణపై కొత్త కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో సందడి ఎక్కువే
ఐటీ రంగంలో విస్తృత అనుభవం కలిగిన నిపుణులు, పరిశ్రమ వేళ్ళూనుకోవడం, గత కొద్దేళ్లుగా పరిశ్రమ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేసే ధోరణి ఎక్కువగానే ఉందని, అయితే ఇంకా పెరగాలని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ రమేశ్‌ లోకనాథన్‌ తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి, పుణేలు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధి చేసే కొత్త కంపెనీలకు కేంద్రాలు ఉన్నాయి. 90% స్టార్టప్‌లు ఇక్కడే ఉన్నాయి. కొత్త కంపెనీలకు ప్రారంభంలో మద్దతు అందించడానికి 80కి పైగా బిజినెస్‌ ఇంక్యుబేటర్లు వివిధ విద్యా సంస్థలు, కంపెనీల్లో పని చేస్తున్నాయి. అయిదేళ్లలో ప్రాణం పోసుకున్న కంపెనీలు, ఆలోచనల్లో వించర్‌ కేపిటల్‌, ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌లు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అంచనా.
విదేశాలకు కూడా..: కొంత మంది ఔత్సాహికులు నిధులు మరింత సులభంగా లభించే అమెరికా, సింగపూర్‌ వంటి దేశాలకు వెళ్లి తమ ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్నారు. సమీప భవిష్యత్తులో కొత్త సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధికి కంపెనీల మధ్య మరిన్ని సహకారాలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా, అమెరికా, యూరప్‌ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయగలవని అంటున్నారు.

Posted on 02-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning