కృషి + సాధన = క్యాట్‌ గెలుపు!

అన్ని సందర్భాల్లోనూ విజయం సులువుగా, తొలిసారే దక్కకపోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా ఆశించిన స్థాయిని అందుకోనపుడు నిరాశతో ప్రయత్నాన్నే విరమించుకుంటే? సత్ఫలితాన్ని దూరం చేసుకున్నట్టే. తన నాలుగో ప్రయత్నంలో క్యాట్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన ఉత్తమ్‌ తన కలను నిజం చేసుకున్న తీరును స్వయంగా చెపుతున్నాడు...

పేరు: అనుముల ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రత్యేకత: క్యాట్ లో 100 పర్సంటైల్
స్వస్థలం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ
ఐఐటీ జేఈఈ 2008 ర్యాంకు: 202 ర్యాంకు
డిగ్రీ: 2012లో మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్   ఇంజినీరింగ్
మెయిల్: reddy.uttamkumar@gmail.com

ఐఐఎం ప్రవేశ పరీక్ష కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)ను దేశవ్యాప్తంగా 1.68 లక్షలమంది రాశారు. వీరిలో 100 పర్సంటైల్‌ 16 మందికి వచ్చింది. వాళ్ళలో నాకూ స్థానం లభించటం ఆనందాన్నిస్తోంది. కిందటి సంవత్సరంతో పోలిస్తే 100 పర్సంటైల్‌ తెచ్చుకున్నవాళ్ళ సంఖ్య రెట్టింపయింది. అప్పటితో పోలిస్తే... పరీక్ష విధానం కూడా మారింది.
ఐఐటీ- మద్రాస్‌లో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నపుడు ఎంబీఏపై ఆసక్తి ఏర్పడింది. 'టైమ్‌' సంస్థలో శిక్షణ కోసం చేరాను. వారాంతాల్లో తరగతులకు వెళ్తూ అక్కడి నమూనా పరీక్షలను రాస్తుండేవాణ్ణి.
క్యాట్‌లో రెండు సెక్షన్లుంటాయి. మొదటిదానిలో ఉండే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నాకు పెద్దగా కష్టమనిపించలేదు- గణితం మొదటినుంచీ నాకు బాగానే వచ్చు కాబట్టి. దీంతో మొదటి సెక్షన్‌ పెద్దగా సిద్ధమవ్వాల్సిన అవసరం రాలేదు. నమూనా పరీక్షల్లో కూడా ఈ విభాగాన్ని బాగా రాస్తుండేవాణ్ణి.
ఇక వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ రెండో సెక్షన్‌లో ఉన్నాయి. లాజికల్‌ రీజనింగ్‌ పెద్ద కష్టం అనిపించలేదు కానీ వెర్బల్‌ ఎబిలిటీతో కొంత ఇబ్బంది పడ్డాను. మొదటిసారి క్యాట్‌ రాసినపుడు ఇదంత బాగా రాయలేకపోయాను. దాంతో రెండో సెక్షన్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఓవరాల్‌ పర్సంటైల్‌ సరిగా రాలేదు.
పరీక్షాపద్ధతి మారింది
2014లో క్యాట్‌ విధానం మార్చారు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. మొదటి నుంచీ కొంచెం వేగంగా లెక్కలు చేస్తుండేవాణ్ణి. కాబట్టి ఈ ఫార్మాట్‌ నాకు కొంచెం ఉపయోగపడింది. నమూనా పరీక్షల ద్వారా కొత్త పద్ధతికి అలవాటుపడ్డాను.
నా పదజాలం, వ్యాకరణ పరిజ్ఞానం పెంచుకోవటానికి 'ద హిందూ' పేపర్‌ను ప్రతిరోజూ చదవటం ప్రారంభించాను. ఇంగ్లిష్‌ పుస్తకాలు... ముఖ్యంగా నవలలు కూడా మొదలుపెట్టాను. గ్రామర్‌పై పట్టు పెంచుకోవాలని English grammar for dummies by Geraldine Woods చదివాను. నా ఆంగ్ల జ్ఞానం మెరుగవ్వటానికి ఇవన్నీ దోహదపడ్డాయి.
ఇదంతా ఒక్కరోజులో సాధ్యం కాలేదు. సమయం వెచ్చించి కృషి చేయటం వల్లనే జరిగింది. వెర్బల్‌ ఎబిలిటీలో మెరుగుదల, సహజంగానే గణితం బాగా వచ్చివుండటం.. ఈ కారణాల వల్లనే ఈ ఏడాది ఎక్కువ మార్కులు సాధించానని భావిస్తున్నాను.
100 పర్సంటైల్‌ వచ్చిందని తెలిసినపుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే... మొదటిసారి పరీక్ష రాశాక నేను సాధించాలని కలగన్నది అదే! 2011లో మొదటిసారి క్యాట్‌ రాశాను. 2012, 13లలో కూడా ఈ పరీక్షకు హాజరయ్యాను. అవి ప్రాక్టీస్‌ టెస్టులుగా ఉపయోగపడ్డాయి. 2013లో మార్కులు బాగానే వచ్చినా ఇంటర్వ్యూ సరిగా చేయలేకపోయాను. మొత్తానికి నా నాలుగో ప్రయత్నంలో 266.61/300 మార్కులతో అనుకున్న లక్ష్యం- 100 పర్సంటైల్‌ సాధించగలిగాను! 'తర్వాత ఏమిటి?' అంటారా! ఐఐఎం అహ్మదాబాద్‌, కోల్‌కతా... వీటిలో ఏదో ఒకదానిలో చేరాలనుకుంటున్నాను.

చేసే పొరపాట్లు
క్యాట్‌ అభ్యర్థులు తరచూ చేసే పొరపాట్ల గురించి చెప్పాలంటే... కొన్ని అంశాలకు బాగా సిద్ధమై, మిగతావాటిని అంతగా పట్టించుకోకపోవటం. ఇది సరికాదు. అన్ని అంశాలపై బాగా పట్టు పెంచుకోవాలి. పరీక్షలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. ప్రాక్టీసు టెస్టుల ద్వారా ఇది మెరుగయ్యేలా జాగ్రత్తపడాలి.
ఫలానా తీరులో చదివితేనే మార్కులు బాగా వస్తాయి- అని క్యాట్‌ విషయంలో చెప్పలేం. అభ్యర్థులు తాము ఏ విభాగంలో బాగా రాయగలుగుతున్నారు, వేటిలో అంత సమర్థంగా రాయటం లేదు అనేది పరిశీలించుకోవాలి. పట్టులేని అంశాలపై దృష్టి పెట్టి కృషి చేసి, లోటుపాట్లు సవరించుకోవాలి.
వెర్బల్‌ ఎబిలిటీ సమస్యగా అనిపిస్తే- విస్తృతంగా చదవటం చాలా సహాయపడుతుంది. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో వెనకబడివుంటే కేవలం ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) నేర్చుకుంటే చాలు. ఎంత వీలైతే అంత సాధన చేయాలి. ఇదెప్పుడూ మంచిదే!
క్యాట్‌ రాయబోయే అభ్యర్థులకు నా సూచన: నమూనా పరీక్షలు బాగా రాసి ఎక్కువ సాధన చేయండి. కొత్త విధానంలో కచ్చితంగానూ, వేగంగానూ జవాబులు గుర్తించటం చాలా అవసరం. ఎప్పుడూ నిరాశను దగ్గరకు చేరనివ్వొద్దు; ప్రయత్నం విరమించవద్దు!

Posted on 02-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning