ఈ ఏడాది ఏం చేశారో స‌మీక్షీంచుకోండి!

* ప్రణాళిక‌తో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టండి.

* కష్టపడితే కొత్త సంవత్సరంలో క‌ల‌ల‌ కొలువు సాధ్యమే.

* ఉద్యోగులు త‌మ ప‌నితీరును స‌మీక్షీంచుకోవాలి.

 • 2013.. అప్పుడే ముగింపునకు వచ్చేసింది. మరో రెండున్నర వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది ఎక్కువగా.. కొత్త సంవత్సరం గురించి ఆలోచిస్తుంటారు. 2014లో ఏం చేయాలో ప్రణాళికలు వేసుకొంటూ ఉంటారు. వాటిని ఎలా అమల చేయాలో వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఇదంతా మంచిదే. దీనికి ముందు ఉద్యోగులు, ఉద్యోగార్థులు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసుకోండి మరి!

  ఉద్యోగార్థులు

  ఈ ఏడాది ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడొద్దు. కొంచెం అదనంగా కష్టపడితే కొత్త సంవత్సరంలో కొలువు సాధ్యమే. ఈ ఏడాది పంపిన దరఖాస్తులు, హాజరైన ఇంటర్వ్యూలు, ఉద్యోగం కోసం రాసిన పరీక్షలను సమీక్షించుకోవాలి. ఎక్కడ ఎలాంటి తప్పులు చేశామో తెలుసుకుని అవి మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి. పొరపాట్లు మళ్లీ జరుగకుండా తగిన శిక్షణ పొందాలి. అభ్యాసం చేయాలి. రెజ్యూమెను ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ ఏడాది కొత్తగా సాధించిన నైపుణ్యాలు, పొందిన శిక్షణ వివరాలను జత చేయాలి. ఈ ఏడాది ఇప్పటిదాకా పంపిన దరఖాస్తులు అన్నింటికీ సమాధానాలు వచ్చాయో లేదో తనిఖీ చేసుకోవాలి. కొన్ని దరఖాస్తులకు సరైన సమాధానం రాకుంటే పంపిన దరఖాస్తు వివరాలను ఆయా సంస్థలకు తెలియజేయాలి. ఇప్పటిదాకా సమాధానం ఎందుకు రాలేదో అడిగి తెలుసుకోవాలి. దీని వల్ల అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఈ ఏడాది వచ్చిన కొత్త పోకడలను విశ్లేషించుకోవాలి. దీని వల్ల త్వరగా ఉద్యోగం సాధించేందుకు వీలుంటుంది.
  ఒకసారి ఈ ప్రశ్నలు వేసుకోండి
  * ఈ ఏడాది ఎలా పని చేశాను?
  * సాధించాలనుకొన్నది ఏంటి..?
  * చివరకు సాధించింది ఏంటి?
  * సంవత్సరం తర్వాత ఎలా ఉండాలి?
  * అందుకు ఏం చేయాలి?
  కొత్త సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో ఉద్యోగం సాధించేందుకు ఎక్కువ కృషి చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో కొత్తగా చదువు పూర్తయి బయటకు వచ్చిన విద్యార్థుల నుంచి పోటీ ఉండదు. ఆలా కాకుండా ఆలస్యం చేస్తే.. కొత్త వారితో పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడు అవకాశాలూ తగ్గే అవకాశం ఉంటుంది. తొలి ఆరు నెలల్లో ఉద్యోగం రాకుంటే మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన అత్యాధునిక అంశాలు, నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని వాటిని సాధించాలి. ఇది అదనపు అర్హతగా మారుతుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి.
  ఉద్యోగులు
  * సంవత్సరాంతంలో ముఖ్యంగా చేయాల్సింది ఈ ఏడాది ఎలా గడిచిందో సమీక్షించుకోవడం.
  * ఈ ఏడాది ఇప్పటిదాకా సాధించిన లక్ష్యాలు, పని చేసిన తీరుపై ఒక అంచనాకు రావాలి.
  * కొన్ని లక్ష్యాలను చేరుకోలేనపుడు, ఆశించిన ఫలితాలు రానపుడు.. ఆ ఫలితాలు సాధించడానికి ఎలా కష్టపడాలో ఆలోచించాలి
  * అసలు లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలి.
  * ఈ ఏడాది మీరు వృత్తిగతంగా సాధించిన విజయాలు, వాటికి సహకరించిన పరిస్థితులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
  * వృత్తిగత నివేదికలను ఒకసారి పరిశీలించాలి
  ఇదంతా పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది మీరు వృత్తిలో ఏ మేరకు పరిణితి సాధించారో తెలుస్తుంది. ఎక్కడ వైఫల్యం చెందుతున్నారో, సాధించాల్సిన అదనపు అర్హతలు, నైపుణ్యాలేంటో తెలుస్తాయి. వీటి ఆధారంగా కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రణాళిక చేసుకోవాలి. ఇలా గడిచిన రోజులను సమీక్షించుకొని కొత్త ప్రణాళికలు వేసుకొంటే అవి పూర్తిస్థాయిలో ఫలవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning