అగ్రస్థాయికి 'నిట్‌' ప్రతిష్ఠ

* నాలుగు బీటెక్‌ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

వరంగల్ (నిట్‌ క్యాంపస్‌), న్యూస్‌టుడే: అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, కెనడా, రష్యా, సింగపూర్‌ లాంటి దేశాలలోని బీటెక్‌ కోర్సుల పట్టాతో ఓరుగల్లు ఎన్‌ఐటీ(నిట్‌) బీటెక్‌ కోర్సు పట్టా సమాన హోదా పొందనుంది.
దేశంలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సాంకేతిక విద్యా సంస్థలు అందిస్తున్న కోర్సులను 'నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌' (ఎన్‌బీఏ) సంస్థ క్షుణ్ణంగా తనిఖీ చేసి గుర్తింపును ప్రకటిస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ఇంజినీరింగ్‌ కోర్సులు అందిస్తున్న దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న 'వాషింగ్టన్‌ అకార్డ్‌' అనే సంస్థలో దేశానికి సభ్యత్వం లభించింది. 'వాషింగ్టన్‌ అకార్డ్‌' గురింపు పొందిన బీటెక్‌ కోర్సులకు ఆ సంస్థలోని అన్ని సభ్యదేశాలలో సమాన డిగ్రీగా పరిగణిస్తారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ నిట్‌ బీటెక్‌, ఎంటెక్‌ కోర్సుల గుర్తింపు కోసం ఎన్‌బీఏ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఇక్కడ బోధన, పరిశోధన,విద్యార్థి బృందం చేస్తున్న సమష్టి కృషిని ఇటీవల పరిశీలించిన ఎన్‌బీఏ బృందం తొలిదశలో నాలుగు బీటెక్‌ కోర్సులకు ఐదేళ్ల గుర్తింపును ఖరారు చేసినట్లు ప్రకటించింది. ఇంకేముందు మన నిట్‌ బీటెక్‌ కోర్సులకు అమెరికా, బ్రిటన్‌, రష్యాలాంటి అగ్రరాజ్యాలు అందిస్తున్న బీటెక్‌ కోర్సులకు సమాన హోదా లభించనుంది.
* ఎన్‌బీఏ ప్రస్థానం ఇలా...
దేశంలోని సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించేందుకు గాను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తనకు అనుబంధంగా 1994లో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) సంస్థను ప్రారంభించింది. 2010లో ఎన్‌బీఏ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఎదిగింది. అప్పటి నుంచి సాంకేతిక విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకుగాను తీసుకోవాల్సిన అంశాలపై కళాశాలలకు మార్గదర్శనం చేస్తోంది. ఎన్‌బీఏ సాంకేతిక విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న కోర్సులను పరిశీలించి రెండేళ్లు, ఐదేళ్లుపాటు గుర్తింపును ప్రకటిస్తుంది. ఇటీవల వాషింగ్టన్‌ అకార్డ్‌ సంస్థ ఎన్‌బీఏకు గుర్తింపు ఇవ్వడంతో ప్రస్తుతం బీటెక్‌ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
* 30 కోర్సులకు దరఖాస్తు
ఎన్‌బీఏ సంస్థ గుర్తింపు పొందడానికిగాను నిట్‌ 8 బీటెక్‌ కోర్సులు, 22 పీజీ కోర్సులకు దరఖాస్తు చేసింది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా నిట్‌ అందిస్తున్న నాలుగు యూజీ, ఐదు పీజీ కోర్సులలో ఎన్‌బీఏ బృందం పరిశీలించింది. మిగిలిన కోర్సులను పరిశీలించేందుకు ఎన్‌బీఏ బృందాలు నిట్‌ను సందర్శించనున్నాయి.
* పరిశీలించే అంశాలేమిటంటే..?
ఎన్‌బీఏ బృందం గుర్తింపు ఇచ్చేముందు ఆయా కళాశాలలు అందిస్తున్న కోర్సుల కరిక్యులమ్‌ ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఉందా లేదా, బోధనా సిబ్బంది విద్యార్హతలు, నైపుణ్యాలు, విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? ల్యాబ్‌, తరగతి గదులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదికను తయారు చేస్తుంది. అనంతరం మార్కులు వేస్తారు. 1000 మార్కులకుగాను 600 దాటితే బీటెక్‌ కోర్సుకు రెండేళ్లపాటు గుర్తింపు, 750 మార్కులు దాటితే ఐదేళ్లపాటు గుర్తింపును ఇస్తుంది.
* లాభాలు చాలా
ఎన్‌బీఏ గుర్తింపు లభించడం వల్ల వ్యక్తిగతంగా విద్యార్థులకు, అధ్యాపకులకు, సమష్టిగా నిట్‌కు ఎన్నో లాభాలు ఉంటాయి. గుర్తింపు లభించిన బీటెక్‌ కోర్సును వాషింగ్టన్‌ అకార్డ్‌లో సభ్యత్వం ఉన్న ప్రపంచంలోని అన్ని అగ్రదేశాల బీటెక్‌ కోర్సులతో తత్సమాన డిగ్రీగా పరిగణిస్తారు. నిట్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి వాషింగ్టన్‌ అకార్డ్‌లో సభ్య దేశానికి వెళ్లి అక్కడ ఒక సెమిస్టర్‌ చదువుకొనే అవకాశం ఉంది. అంతేకాదు అక్కడ సెమిస్టర్‌లో సాధించిన క్రెడిట్స్‌ను మళ్లీ వరంగల్‌ నిట్‌కు వచ్చిన తర్వాత కలుపుకొనే అవకాశం ఉంటుంది. అగ్రదేశాల ఇంజినీరింగ్‌ కోర్సులతో అకడమిక్‌ ఎక్స్ఛేంజ్‌ జరిగే అవకాశం ఉంటుంది. మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ తదితర బహుళజాతి ఐటీ కంపెనీలు నేరుగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రీసర్చ్‌ ఫండింగ్‌ ఏజెన్సీల నుంచి భారీగా నిధులు మంజూరు అవుతాయి. అంతిమంగా బోధన, పరిశోధన, అభివృద్ధి రంగాలు పురోగతి సాధించే అవకాశం ఉంది.
* గుర్తింపు అంత సులభం కాదు
ఎన్‌బీఏ గుర్తింపు రావడం అంత సులభంగా లభించదు. ఐఐటీ ఆపై స్థాయి సంస్థల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన విషయనిపుణులతో ఏర్పాటు చేసిన బృందం కళాశాలలు అందిస్తున్న కోర్సులను పరిశీలించి తయారు చేసిన నివేదికను అనేక దశలలో స్క్రీనింగ్‌ చేస్తుంది. ఎన్‌బీఏ బృందం ఇచ్చిన నివేదికను చివరగా వాషింగ్టన్‌ అకార్డ్‌ బృందం పరిశీలిస్తుంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలు అందిపుచ్చుకునేలా ఉన్న కరిక్యులమ్‌ అమలు చేస్తున్న కోర్సులకు మాత్రమే గుర్తింపును ఖరారు చేస్తుంది. అంతేకాదు ఒకవేళ ఆ స్థాయిని పాటించలేదని భావించినప్పుడు గుర్తింపును తిరస్కరించడంతోపాటు ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెబుతుంది.
* అన్నికోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు కోసం కృషి : నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య టి.శ్రీనివాసరావు
ప్రస్తుతం నిట్‌లోని సివిల్‌, మెకానికల్‌, ఈసీసీ, ఈఈఈ విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపును ఖరారు చేసింది. మరో ఐదు పీజీ కోర్సుల పరిశీలన పూర్తి అయింది. 8 యూజీ, 22 పీజీ కోర్సులకోసం ఎన్‌బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాం. మిగిలిన కోర్సుల్లో ఎన్‌బీఏ బృందాలు పరిశీలించేందుకు రానున్నాయి. అన్ని కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం. వరంగల్‌ నిట్‌ను అంతర్జాతీయ స్థాయి పరిశోధనాసంస్థగా రూపొందించేందుకు కృషి చేస్తున్నాం.

Posted on 06-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning