ఉద్యోగ సంకల్పం!

* లక్ష్యసాధనలో విద్యార్థులు
* ఆదర్శప్రాయంగా పటాన్‌చెరు గీతం విశ్వవిద్యాలయం

న్యూస్‌టుడే, పటాన్‌చెరు: చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం లభించినప్పుడే విద్యార్థికి ఎనలేని ఆనందం కలుగుతుంది. ఇందుకు తగ్గట్టుగా కళాశాల యాజమాన్యం కూడా ప్రత్యేకంగా శిక్షణ అందజేస్తోంది. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకోగానే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.
పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం విశ్వవిద్యాలయం ఉద్యోగాల ఎంపిక విషయంలో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇక్కడ దాదాపు 32 జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. 2014లో 340 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది నుంచి వారు జీతాలు భారీగానే అందుకోనున్నారు. రూ.3.5 లక్షల నుండి రూ.18 లక్షల వరకు జీతాలు తీసుకోనున్నారు. మొత్తం 830 మంది విద్యార్థులకు గానూ 300 మంది వివిధ రంగాల్లో స్థిరపడుతుండగా మిగిలిన 530 మంది విద్యార్థుల్లో 340 మందిని అదృష్టం వరించింది. మొదటి నుంచి ప్రత్యేక బోధన అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను ఉపన్యాసకులు నిర్వహించారు. ప్రతీ విషయాన్ని అర్థమయ్యే రీతిలో బోధించడం, విద్యార్థుల పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు సైతం లక్ష్యసాధనతో ముందుకు వెళ్లారు. ఉపన్యాసకులు చెప్పిన ప్రతీ విషయాన్ని వంటబట్టించుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అంశాలపై అవగాహన పెంచుకున్నారు. ముఖాముఖిలో పాల్గొనడం, బృంద చర్చలు, తదితర విభాగాల విషయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు తీసుకున్నారు. లక్ష్యసాధనలో ముందుకు సాగడంతో వారిని అదృష్టం తలుపుతట్టింది.వివిధ కార్పొరేట్‌ పరిశ్రమలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో పలువురు ఎంపికయ్యారు.
పట్టుదలతో ముందుకు సాగా..
- అర్చన, సీఎస్‌ఈ
చదుతుండగానే ప్రత్యేక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. అంతర్జాతీయ పరిశ్రమలో ఉద్యోగం సాధించాలని ముందుకుసాగా. రాత్రి పగలు అనేతేడా లేకుండా శ్రమించాను. అది వృథా కాలేదు. అమెజాన్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. అందులో ఎంపిక కావడం ఎంతో సంతృప్తిగా ఉంది. రూ.18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పించారు.
ఎంతో సంతోషం..
- సుశాంక్‌ , ఈఐఈ
గత నవంబరు 11న జరిగిన ప్రాంగణ ఎంపికల్లో రీబయోఫామ్స్‌ అనే పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. రూ.6లక్షల వార్షిక వేతనం ఇస్తామన్నారు. అనుకున్నదానికంటే ఎక్కువగానే వస్తోందన్న ఆనందం ఉంది. ప్రస్తుతం పరీక్షలు ముగియగానే ఉద్యోగంలో చేరతా. మా వాడు ప్రయోజకుడు అయ్యాడన్న భావన మా తల్లితండ్రుల్లో ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి.
నేను ఊహించలేదు..
- చంద్రకిరణ్‌, మెకానికల్‌
సహజంగా మెకానికల్‌ విభాగంలో చదువు పూర్తి చేసిన వారికి ఆశించినంత మేర జీతాలు ఉండవు. ఇక్కడ మాత్రం నిత్య ప్రక్రియ తరహాలో అవగాహన కల్పించారు.మాక్‌ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందుకు తగ్గట్టుగా సిద్ధమై వెళ్లాం. సాఫ్ట్‌వేర్‌ వారితో సమానంగా మేమూ ఉన్నామంటూ నిరూపించగలిగాం. బ్లూస్టార్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమ వారు రూ.4.75 లక్షల వార్షిక వేతనంతో నన్ను ఎంపిక చేశారు.
చదువుకు తగ్గ ఉద్యోగం
- శ్వేతాద్వివేది, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌
చదువుకు తగ్గ ఉద్యోగం లభించడమే అదృష్టంగా భావిస్తున్నా. టాటా అడ్వాన్స్‌డ్‌సిస్టమ్స్‌ పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. రూ.4లక్షల వేతనం ఇస్తామని ప్రకటించారు. హెలీక్యాప్టర్‌లకు సంబంధించిన పరిశ్రమ కావడం వల్ల చాలా సంతృప్తిగా ఉంది. గతంలో మూడు పరిశ్రమల్లో అవకాశాలు వచ్చినా చేరలేదు. తల్లితండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు.
చదువుతున్న సమయంలోనే..
-నెక్కలపూడి అరుణ్‌, సీఎస్‌ఈ
చదువుతున్నప్పుడే మంచి ఉద్యోగం కోసం కలలుగన్నా. అందుకోసం శ్రమించా. ఉపన్యాసకులు అందుకు అనుగుణంగా ఎంతో నాణ్యమైన శిక్షణ అందజేశారు. ముందస్తు ప్రణాళికతో వ్యవహరించా. సీఎటెక్నాలజీస్‌ పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. రూ.7.5లక్షలు జీతం ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల రంగంలో స్థిరపడాలన్నదే ఆకాంక్ష.
అంతర్జాతీయ పరిశ్రమలో..
- మూనిష్‌భార్గవ్‌, సీఎస్‌ఈ
అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే విద్యపై దృష్టి సారించా. ఇంటర్వ్యూల సమయంలో ఎదుర్కొనే వాటిని ముందుగానే అంచనా వేసుకున్నాను. వాటికి తగ్గట్టుగా సిద్ధమయ్యా. నాలుగు జాతీయ స్థాయి పరిశ్రమల్లో అవకాశాలు వచ్చాయి. అంతర్జాతీయస్థాయి పరిశ్రమ రాకకోసం ఎదురుచూశా. అమెజాన్‌ పరిశ్రమ వారు జరిపిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. వూహించని రీతిలో రూ.12లక్షల వార్షిక వేతనం ప్రకటించారు.
జవాబులో నిజాయతీ ఉండాలి
- భార్గవి, ఈసీఈ
నేను వెరిజాన్‌ అనే పరిశ్రమలో ఎంపికయ్యా.రూ.4.5 లక్షల జీతం ప్రకటించారు. పరిశ్రమ వారు నాలుగు రౌండ్లపాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో మనం చెప్పే జవాబులను నిశితంగా పరిశీలించారు. చెప్పే జవాబులో నిజాయితీపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
12 గంటలపాటు ముఖాముఖి
- శర్వాణి, ఐటీ
గీతంలో ఇచ్చిన మాక్‌ఇంటర్వ్యూకారణంగా 12 గంటలపాటు సుదీర్ఘంగా సమాధానాలు చెప్పగలిగా. ఫలితంగా సీఏటెక్నాలజీస్‌ పరిశ్రమలో ఎంపికయ్యా. రూ.4.5లక్షల జీతం ప్రకటించారు. దాదాపు 12 గంటలపాటు నిర్వహించిన ఇంటర్యూల్లో ధైర్యంగా నిలబడగలిగా. ఇలా చేయడం వల్ల చాలా సంతృప్తిగా ఉండటమే కాకుండా అనుభవం కూడా వచ్చింది.
ఆనందంగా గడిచింది..
-మౌనిక , ఈఈఈ
చదువుకు తగ్గ ఉద్యోగం లభించింది. చదువుతో పాటు ఉద్యోగం కూడా దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. గీతంలో చేరిన రెండోయేట నుంచే ఉద్యోగానికి కావాల్సిన అన్ని రకాల తర్ఫీదులు ఇచ్చారు. బృంద చర్చలతో పాటు ఉత్పత్తుల రంగంపై పట్టుసాధించడంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఆయా పరిశ్రమలకు చెందిన ప్రతినిధులను పిలిపించి ముఖాముఖి ఏ విధంగా నిర్వహిస్తారో ప్రత్యక్షంగా చూపించారు.
రెండేళ్లపాటు శిక్షణ
- వేణుకుమార్‌, డైరెక్టర్‌
చదువుకున్న ప్రతీ విద్యార్థి ఉద్యోగ నియామకాల్లో ఎంపిక కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా శిక్షణలు ఇప్పిస్తున్నాం. పరిశ్రమలకు చెందిన నిపుణులతో అభిప్రాయాలు వివరిస్తున్నాం. మాక్‌ ఇంటర్వూలు నిర్వహిస్తున్నాం. అందువల్లే విద్యార్థులు ఎక్కువగా ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారు.

Posted on 08-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning