ఇంజినీరింగ్‌ కళాశాలల 'మార్పిడి' మోసం

* పోలీసులకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారుల ఫిర్యాదు
* పలు కళాశాలల తనిఖీ.. కేసుల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌, కోదాడ పట్టణం - న్యూస్‌టుడే: బోధనా రుసుముల కోసం అడ్డదారులు తొక్కుతున్న కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల బాగోతం బట్టబయలైంది. జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీల్లో అవి అడ్డంగా దొరికిపోయాయి. డబ్బిచ్చి బోగస్‌ అధ్యాపకులను నియమించుకొని విశ్వవిద్యాలయ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు చూపించడం, వారే మరో కళాశాలలోనూ కనిపించడంతో వ్యవహారం బయటపడింది. వర్సిటీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి జనవరి 8న రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు కళాశాలలను తనిఖీ చేశారు
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సౌకర్యాలతో పాటు అవసరమైన, అర్హులైన అధ్యాపకులు లేరని జేఎన్‌టీయూహెచ్‌ మొత్తం 174 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవటం, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవటం గతంలో జరిగింది. తర్వాత వాటి యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశంతో కౌన్సెలింగ్‌కు షరతులతో అనుమతించడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అన్ని కళాశాలలను ఐఐటీ హైదరాబాద్‌, బిట్స్‌ హైదరాబాద్‌ నిపుణులతో కూడిన కమిటీలతో మళ్లీ తనిఖీ చేశారు.అంతకు ముందు కళాశాల యాజమాన్యాలు తమ సంస్థలో ఉన్న సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలు విశ్వవిద్యాలయానికి పంపాయి. అయితే నిపుణుల కమిటీ తనిఖీ అనంతరం వర్సిటీలోని స్టాండింగ్‌ కమిటీ పరిశీలనలో ఒకే అధ్యాపకుడు రెండు మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారని రిజిస్ట్రార్‌ ఎన్‌వీ రమణారావు ఘట్‌కేసర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిబంధలను పాటించినట్లు చూపేందుకు, ఆ ప్రకారం జేఎన్‌టీయూహెచ్‌ నుంచి అనుబంధ గుర్తింపు పొందేందుకు కావాలనే యాజమాన్యాలు ఈ అవకతవకలకు పాల్పడాయని ప్రస్తావించారు. చివరకు విద్యార్థులను చేర్చుకొని ప్రభుత్వం నుంచి బోధనా రుసుములను పొందడమే వారి ఉద్దేశమన్నారు. రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో ఈనెల 7న పోలీసులు 420, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఘట్‌కేసర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం; నల్గొండ జిల్లాలోని కోదాడ, చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి.. ఖమ్మం జిల్లాలో పలు కళాశాలల్లో గురువారం తనిఖీలు జరిపారు. సిబ్బంది, విద్యార్థుల హాజరుపట్టికలు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* దళారుల ద్వారా అధ్యాపకుల తాత్కాలిక నియామకం
అధ్యాపకులను, ఇతర సిబ్బందిని దళారుల ద్వారా తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. అందుకు యాజమాన్యాలు డబ్బులు చెల్లించాయి. అందులో ఒక దళారి పేరు నవీన్‌ అని రిజిస్టార్ర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనిఖీలు సాఫీగా ముగిసేలా చేసుకొని అనుబంధ గుర్తింపు పొందటమే కాక విద్యార్థులను, ప్రభుత్వాన్ని మోసం చేశారని రిజిస్ట్రార్‌ ఆరోపించారు.
* రంగారెడ్డి జిల్లాలో తనిఖీ చేసిన కళాశాలలు...
1. కృష్ణమూర్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌
2. ప్రిన్స్‌టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ
3. సిద్ధార్ధ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
4. కైట్‌ కళాశాల
5. బండారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- చేవెళ్ల
6. విద్యా వికాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- చేవెళ్ల
7. సెయింట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల- ఇబ్రహీంపట్నం
8. జవహర్‌లాల్‌నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఇబ్రహీంపట్నం
9. అర్జున్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, హయత్‌నగర్‌
* నల్గొండ జిల్లా పరిధిలో..
10. శ్రీ శారదా ఇంజినీరింగ్‌ కళాశాల - భువనగిరి
11. తూడి నర్సింహ కళాశాల - బీబీనగర్‌
12. కిట్స్‌ - కోదాడ
13. అశోకా ఇంజినీరింగ్‌ కళాశాల- చౌటుప్పల్‌
* ఖమ్మం జిల్లాలో..
14. ఆడమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల- పాల్వంచ
* మరిన్ని కళాశాలలపై గురి?
నకిలీ బోధన సిబ్బంది, అరకొర సదుపాయాలుండీ తప్పుడు సమాచారంతో మోసంచేసిన మరికొన్ని కళాశాలలపైనా జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కొరడా ఝుళిపించటానికి సిద్ధమవుతోంది. ''ప్రస్తుతం కచ్చితమైన సమాచారం ఉన్న కళాశాలలపైనే చర్యకు దిగాం. ఇంకొన్ని కాలేజీలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. వాటి పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అరకొర సౌకర్యాలు, నకిలీ సిబ్బంది గురించి తెలిస్తే ఎవరైనా జేఎన్‌టీయూహెచ్‌కు సమాచారం అందించవచ్చు. నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం'' అని సాంకేతిక విద్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ''పదిమంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారు. అన్నిచోట్లా ఒకర్నే సిబ్బందిగా చూపిస్తూ మోసం చేస్తున్నారు'' అని మరో అధికారి అన్నారు.

Posted on 09-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning