నియామకాల్లో మెలకువలివిగో!

ప్రాంగణ నియామకాలు కొన్ని ప్రసిద్ధ కళాశాలల్లోనే జరుగుతాయి. మరి ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఏం చేయాలి? ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కానివారికి ప్రత్యామ్నాయమేమిటి? ఇలాంటివారు నిరుత్సాహపడకుండా ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో పాల్గొనవచ్చు. ప్రతిభ సాధించి ఉద్యోగాలు సాధించవచ్చు!

ఉద్యోగ నియామకాలు ప్రధానంగా కళాశాల ప్రాంగణాల్లో (ఆన్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌) జరుగుతుంటాయి. వీటిలో అనుకున్న స్థాయిలో, అనుకున్న రీతిలో సరైన విద్యార్థులు దొరకని పక్షంలో సంస్థలు ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ (ప్రాంగణేతర నియామకాలు) నిర్వహిస్తాయి. కొన్నిసార్లు అధిక అవసరాల వల్లనో, ప్రత్యేక సంఖ్యలో ప్రాజెక్టులు రావడం వల్లనో మరిన్ని సంఖ్యలో ఉద్యోగాలను ఈ పద్ధతిలో భర్తీ చేస్తాయి. నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఎటువంటి కళాశాలలో ఉన్నా అవకాశాలు ఇవ్వడానికి సంస్థలు వెనకాడడంలేదు. టయర్‌ -2, టయర్‌ -3 కళాశాలలకు ఇదో చక్కని అవకాశం. ప్రాంగణేతర నియామకాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కోసారి సంస్థలు తమ సంస్థ పరిసరాల్లోనే వీటిని జరపవచ్చు. తమ దృష్టిలో ఉన్న కళాశాలలను అధికారులు సంప్రదించి వాటిలో చదివే విద్యార్థులను పిలిచి రాత పరీక్షలూ, మౌఖిక పరీక్షలూ నిర్వహిస్తాయి.
పూల్‌ క్యాంపస్‌ డ్రైవ్‌: సంస్థలు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసుకునే పక్షంలో ఈ పద్ధతిని అనుసరిస్తాయి. కంపెనీల అధికారులు తమ దృష్టిలో ఉన్న కళాశాలలను సంప్రదించి ఆయా కళాశాలల విద్యార్థులను ఏదో ఒక కళాశాలకు పిలిచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే 'పూల్‌ క్యాంపస్‌ డ్రైవ్‌'. ఒక్కోసారి కళాశాల అర్హతను బట్టీ, విద్యార్థుల నైపుణ్యాలను బట్టీ కొన్ని కళాశాలలను మాత్రమే ఈ పూల్‌ డ్రైవ్‌లో అనుమతిస్తారు.
ఏజెన్సీ/ కన్సల్టెంట్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌: మరికొన్ని సార్లు కొంతమంది ఏజెన్సీలు/ కన్సల్టెంట్‌ సంస్థలతో ఒప్పందం పెట్టుకుని జాయింట్‌ క్యాంపస్‌ డ్రైవ్‌/ పూల్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ను నిర్వహిస్తారు.
వాక్‌ ఇన్‌ డ్రైవ్‌: కొన్ని సందర్భాల్లో సంస్థలు సంవత్సరం పొడవునా సరైన నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రతి నెల/ కొన్ని వారాలు ప్రత్యేకంగా ఒకరోజు వాక్‌ ఇన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తారు. కళాశాల ప్రమేయం ఏం లేకుండానే విద్యార్థులు సంస్థలకు వెళ్లి ఆ డ్రైవ్‌లో పాల్గొంటారు. సామాన్యంగా ఈ డ్రైవ్‌లు కోర్‌ సంస్థల్లో ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో కోర్‌ నైపుణ్యాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తారు.
జేకేసీ (జవహర్‌ విజ్ఞానకేంద్రం): సంస్థలు జేకేసీ ద్వారా కూడా కొన్ని క్యాంపస్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తాయి. కంపెనీలు ఆశించే అర్హతలను బట్టి విద్యార్థులు కళాశాల ద్వారా ఇటువంటి ప్రాంగణేతర నియామకాల్లో పాల్గొనవచ్చు.
సంస్థ వెబ్‌సైట్‌: మరికొన్ని సంస్థలు వారి వెబ్‌సైట్‌లో ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ గురించి వివరాలు ఇచ్చి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాయి.
* కొన్నిసార్లు ఈ ప్రాంగణేతర నియామకాలు కళాశాల సత్తా, నాణ్యత నిరూపించుకోవడానికి చక్కని సాధనం. ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారా ఒక కళాశాల విద్యార్థులు ఎక్కువశాతం ఎంపిక అయినట్లయితే ఆ కళాశాల పేరును తర్వాతి సంవత్సరపు ఆన్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో నమోదు చేసుకునే వీలుంది. అందువల్ల కళాశాలలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. నియామక సంస్థలతో తరచూ మాట్లాడుతూ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లు ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోవాలి. ప్రతి సంస్థకూ ఒక ప్రత్యేక పరీక్ష, మౌఖిక పరీక్ష విధానం ఉంటాయి. ఆ విధానం ప్రకారం విద్యార్థులను తయారుచేయాలి.
1. ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఎక్కడ జరుగుతున్నాయో గమనిస్తుండాలి. కొన్ని సందర్భాల్లో వేరే కళాశాలలో, ఒక్కోసారి ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని నిర్వహిస్తారు. మిత్రుల ద్వారా, సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా, కళాశాల ద్వారా తెలుసుకుని... ఎక్కడ జరిగినా సంకోచం లేకుండా పాల్గొనాలి. అనేక సందర్భాల్లో గత సంవత్సరం పాసైన ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ, ఉద్యోగం దొరకనివారికీ కూడా ఈ డ్రైవ్స్‌ నిర్వహించడం గమనార్హం.
2. వివిధ సంస్థలు ఆశించే నైపుణ్యాలను మెరుగుపరచుకుని సిద్ధంగా ఉండాలి. బ్రాంచి ఏదైనా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఏదైనా ఎక్కువ సంస్థలు పక్షపాతం లేకుండా అన్ని బ్రాంచీలవారూ పాల్గొనడానికి అనుమతిస్తాయి. కొన్ని సంస్థల్లో పరీక్షకు అర్హత సంపాదించాలంటే కనీస, నిర్ణీత మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలయితే తప్పనిసరిగా కోడింగ్‌ ప్రోగ్రామింగ్‌ మీద ప్రశ్నలడుగుతాయి. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలోనే ఇలాంటి కనీస అర్హతలు, నైపుణ్యాలు తెలుసుకుంటే ఈ తరహా నియామకాల్లో విజయం సాధించగలుగుతారు.
3. సకాలంలో దరఖాస్తు చేసుకోవటం చాలా ముఖ్యం. సంస్థల వెబ్‌సైట్లు తరచూ గమనిస్తూ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగానే తమకు ఆసక్తి ఉన్న సంస్థల సైట్లను పరిశీలిస్తూ సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ సంస్థ సంబంధిత వ్యక్తులకు మెయిల్‌ ద్వారా కూడా దరఖాస్తు పంపుకోవచ్చు. సంబంధిత అధికారుల మెయిల్‌ చిరునామా కనుక్కొని వారిని సంప్రదించే ప్రయత్నం చేయాలి.
4. కోడింగ్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం మెరుగ్గా ఉండాలి. 90% విద్యార్థులు కోడింగ్‌ ప్రోగ్రామింగ్‌ మీద అవగాహన, పట్టు లేకుండానే ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు కోడింగ్‌ పరిజ్ఞానం పరీక్ష ద్వారా, మౌఖికపరీక్ష ద్వారా పరీక్షిస్తారని తెలిసినా సంసిద్ధంగా లేక అవకాశాలు చేజార్చుకుంటున్నారు. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకు కావాల్సిన అర్హతలూ, నైపుణ్యాలూ భిన్నంగా ఉంటాయని గుర్తించాలి.
5. ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ టెస్ట్‌లలో మెరుగైన మార్కులు తెచ్చుకోవాలి. ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ పుస్తకాలు, ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ పుస్తకాలు, ఆన్‌లైన్‌లో ఆప్టిట్యూడ్‌, మేథమేటిక్స్‌, వెర్బల్‌ సాధన చేయగల సాధనాలు విజయానికి దోహదపడతాయి. పరీక్ష ఉన్నపుడు మాత్రమే కాకుండా మూడో సంవత్సరంలోనే ఇలాంటి పరీక్షలకు తగిన రీతిలో సన్నద్ధమై సిద్ధంగా ఉండాలి. సమస్య సాధన, పజిల్స్‌ అంశాలకు సంస్థలు ప్రాముఖ్యం ఇస్తున్నాయి.
6.బృందచర్చలో తరచూ పాల్గొంటూ ఉండాలి. ఈ మధ్య కాలంలో సంస్థలు అనర్హుల వడపోత కోసం బృందచర్చ పద్ధతిని అనుసరిస్తున్నాయి. అందరిముందూ భయం లేకుండా సంబంధిత అంశాలను మాట్లాడాలంటే ఒక్కరోజులో కష్టం కాబట్టి తగినంత తయారీ అవసరం. ఇచ్చిన అంశం మీద అవగాహన, భావప్రసార నైపుణ్యాలు, చెప్పాలనుకున్నది నిర్ణీత సమయంలో స్పష్టంగా చెప్పడం ప్రధానం. కొన్ని సంస్థలు కేస్‌స్టడీ రూపంలో, టీం బిల్డింగ్‌ పద్ధతిలో కూడా అభ్యర్థుల్లోని సాఫ్ట్‌స్కిల్స్‌ను పరీక్షిస్తుంటాయి.
7. చదివే బ్రాంచి మీద చులకన భావం ప్రదర్శించకూడదు. 'మీరు ఎందుకు ఈ బ్రాంచీ తీసుకున్నారు? ఏ సబ్జెక్టు అంటే మీకు ఇష్టం? ఎందుకు మీ కోర్‌ సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ వచ్చాయి?' అనే ప్రశ్నలకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానమివ్వాలి. కోర్‌/ మీ బ్రాంచి ప్రాథమిక అంశాల్లో చక్కగా తయారవ్వాలి. ఎక్కువ శాతం విద్యార్థులు తమ మెయిన్‌ బ్రాంచిలో కోర్‌ సబ్జెక్టుమీద అవగాహన, పట్టు లేకుండా మౌఖికపరీక్షకు వెళ్తారు. దీంతో కోర్‌లో అడిగితే సమాధానాలు సరిగా చెప్పలేరు. ఏదో డిగ్రీ పాస్‌ అవ్వడానికో, తప్పనిసరై తమ కోర్‌ సబ్జెక్టు చదవాల్సి వచ్చిందనో చెపుతూ ఇంటర్వ్యూ చేసేవారిని నిరుత్సాహపరుస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు తమ కోర్‌ సబ్జెక్టు/ బ్రాంచీలను తక్కువ చేయకుండా సమయోచితంగా సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి.
8. సంస్థలు ప్రాజెక్టు పనిమీద ధ్యాస పెడుతూ ప్రశ్నలు సంధిస్తుంటాయి. విద్యార్థుల ప్రాక్టికల్‌ నైపుణ్యాన్నీ, సబ్జెక్టు మీద పట్టునూ ప్రాజెక్టు ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తాయి. చేసిన ప్రాజెక్టును చక్కగా వివరించడం, ఈ ప్రాజెక్టు వల్ల ఏం నేర్చుకున్నారు, ఎలా ఉపయోగపడుతుంది అన్నవి స్పష్టంగా రెజ్యూమెలో రాయడం, రాసినదాన్ని వివరించే స్థితిలో ఉండటం ముఖ్యం. చేసిన ప్రాజెక్టు ఇష్టంతో ఎంచుకుని ఉండాలి. ప్రాజెక్టు గురించి అడిగినపుడు 'కోర్సులో భాగంగా ప్రాజెక్టు చేయాలి కాబట్టి పూర్తిచేసిన'ట్టు చెప్పే మొక్కుబడి జవాబులు విజయానికి నిరోధకాలవుతాయి.

Posted on 12-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning