క్యాట్ కొట్టేస్తున్నారు

* అత్యధికులు ఎంపికయ్యే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్
* ఎక్కువమంది విజేతలు బీటెక్ విద్యార్థులు
* ఇంజినీరింగ్‌కు మేనేజ్‌మెంట్ తోడైతే ఉజ్వల భవిత

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, జేఎన్‌టీయూ: ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)లో హైదరాబాద్ విద్యార్థులు భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుంటున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోని వారే కాకుండా నగరంలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఐఐఎంల్లో చదివేందుకు పోటీ పడుతుండటంతో కొన్నేళ్లుగా అత్యధిక పర్సంటైల్ సాధించిన నగరాల్లో హైదరాబాద్ మొదటి నాలుగైదు స్థానాల్లో నిలుస్తోంది. ఈసారి స్థానం ఎంత అన్నది ఇప్పుడే తెలియకున్నా దాదాపు 100 మందికి తగ్గకుండా నగర విద్యార్థులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒక్క జేఎన్‌టీయూహెచ్ నుంచి 10 మందికిపైగా మంచి పర్సంటైల్ సాధించిన వారు ఉండటం విశేషం.
దేశవ్యాప్తంగా 99 నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన క్యాట్‌కు ఈసారి లక్షా 68 వేల మంది హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ఉండొచ్చని నిపుణులు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు నగరాలు, తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు కరీంనగర్‌లో నవంబరులో పరీక్ష నిర్వహించారు. దేశంలో ఎక్కువమంది న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్, పుణె నుంచే హాజరవుతున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే 5 వేల మంది ఉంటారని చెబుతున్నారు. గత ఏడాది ఐఐఎం అధికారులు గణాంకాలను విడుదల చేశారు. ఆ ప్రకారం ప్రకారం 99, ఆపైన పర్సంటైల్ పొందిన విద్యార్థుల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నుంచి 105 మంది 99 పర్సంటైల్‌కు మించి సాధించడం విశేషం.
* ఉన్నతోద్యోగాలే లక్ష్యంగా...
క్యాట్ పరీక్షలు రాస్తున్న వారిలో అత్యధికులు ఇంజినీరింగ్ చదివిన వారే ఉంటున్నారు. ముఖ్యంగా ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న వారు క్యాట్‌లో కూడా మంచి స్కోర్ దక్కించుకుంటున్నారు. వారే మళ్లీ ఐఐఎంలో చేరుతున్నారు. ఉదాహరణకు ఈసారి 16 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా ఐఐటీ ముంబాయి నుంచి ముగ్గురు, ఖరగ్‌పూర్ నుంచి ఇద్దరు ఉన్నారు. ముంబయి ఐఐటీలోని ముగ్గురులో ఒకరు అనురాగ్‌రెడ్డి. నల్గొండ జిల్లాకు చెందిన ఇతను హైదరాబాద్‌లోనే ఇంటర్ చదివాడు. ఇంజినీరింగ్‌కు మేనేజ్‌మెంట్ విద్య తోడైతే ఏదైనా కంపెనీకి సీఈఓగా పనిచేయవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఐఐఎంలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది ఇలా...
99 పర్సంటైల్‌కు మించి సాధించిన వారు
* ముంబయి 180
* న్యూదిల్లీ 168
* బెంగళూరు 157
* హైదరాబాద్ 105
* కోల్‌కతా 92
* చెన్నై 85
* ఐఐఎంలో చదవాలనే... - డి.శ్రావ్య, బీటెక్ చివరి సంవత్సరం, సీఎస్ఈ, జేఎన్‌టీయూ.
ప్రాంగణ నియామకాల్లో తొలి రౌండ్‌లోనే నేను డిలైట్ కంపెనీకి ఎంపికయ్యాను. ఏడాదికి రూ.5.5 లక్షల వార్షిక వేతనం ఇస్తామని చెప్పారు. బీటెక్‌లో 80శాతం మార్కుల ఉత్తీర్ణత ఉంది. అయినా ఐఐఎంలో ఫైనాన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం ఉద్యోగం కన్నా ఉన్నత విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే క్యాట్ పరీక్షకు ఓ సంస్థలో ఆరు నెలల పాటు తర్ఫీదు తీసుకున్నా. ఫలితాల్లో 95 శాతానికిపైగా పర్సంటైల్ వచ్చింది. త్వరలోనే నా కల సాకారమవుతుందని ఆశిస్తున్నా.
* ఎంబీఏ తర్వాతే కొలువు.. - జి.శ్వేత, సీఎస్ఈ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, కూకట్‌పల్లి.
బీటెక్‌లో 86 శాతం మార్కుల ఉత్తీర్ణత ఉంది. ఉద్యోగం కావాలంటే ఏదో ఒక కంపెనీ నిర్వహించిన ప్రాంగణనియామకాలకు హాజరయ్యేదాన్ని. కాని నాకు ఎంబీఏ చదవాలని ఉంది. అదీ ఐఐఎంలో ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ పూర్తిచేసిన తర్వాత కొలువు గురించి ఆలోచిస్తా. నాకు 95కు మించి పర్సంటైల్ వచ్చినందున ఐఐఎంల్లో సీటు వస్తుందని ఆశిస్తున్నా. అందుకోసం 6నెలల పాటు ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నా. క్యాట్‌లో మంచి స్కోర్ సాధించిన నా మిత్రురాళ్లతో కలిసి బృంద చర్చ, ముఖాముఖీలకు సిద్ధమవుతున్నా.

Posted on 17-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning