అత్యధిక వేతనం ఐటీలోనే

* గంటకు రూ.342
* చివరి స్థానం విద్యా రంగానిది
* మాన్‌స్టర్‌ 'వేతన సూచీ' వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌: ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు అందరూ ఆలోచించేది వేతనం గురించే. వివిధ రంగాల్లో వేతనాలను పరిశీలిస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అత్యధిక వేతనాలను పొందుతున్నారు. విద్యా రంగంలో ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. మధ్యస్థ వేతనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఐటీ, విద్యా రంగానికి మధ్య 45 శాతం వ్యత్యాసం ఉంది. ఐటీ ఉద్యోగుల వేతనంలో సగం మాత్రమే విద్యా రంగంలోని ఉద్యోగులకు లభిస్తోందని ఆన్‌లైన్‌ కేరీర్‌, నియామక సొల్యూషన్ల సంస్థ మాన్‌స్టర్‌ విడుదల చేసిన 'మాన్‌స్టర్‌ వేతన సూచీ' తేటతెల్లం చేస్తోంది. ఐటీ కంపెనీలు సగటున గంటకు రూ.341.8 చెల్లిస్తుంటే, విద్యా రంగంలో ఇది రూ.186.5 మాత్రమే. అయితే ఐటీ రంగంలోనూ లింగ వివక్ష తప్పడం లేదు. ఈ రంగంలో పురుషుల కన్నా మహిళలు సగటున 34 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఐటీ ఉద్యోగుల్లో 61 శాతం మంది తమ జీవితం సంతృప్తికరంగానే సాగిపోతోందని వెల్లడించారు.
మహిళలు అధికంగా ఉండడం వల్లే..
ఇతర రంగాలతో పోలిస్తే విద్యా రంగంలో మహిళలు అధికంగా ఉండడం వల్లే ఈ రంగంలో మధ్యస్థ వేతనం అత్యంత తక్కువగా ఉంది. విద్యా రంగంలో పురుషుల కంటే మహిళలు సగటున 18 శాతం తక్కువ వేతనాన్ని పొందుతున్నారు. విద్యా, పరిశోధన రంగంలో జర్మనీలో పురుషుల కంటే మహిళలు 33 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. భారత విద్యా రంగంలో పని చేస్తున్న 60 శాతం మంది ఉద్యోగులు సంతృప్తికరంగా ఉన్నారు.
ఐటీ తర్వాత ఫైనాన్సే..: వేతనాల్లో ఐటీ తర్వాత ఫైనాన్స్‌ రంగం నిలిచింది. ఈ రంగంలో మధ్యస్థ స్థూల వేతనం గంటకు రూ.291 ఉంది. పురుషులతో పోలిస్తే ఈ రంగంలో మహిళలు పొందుతున్న వేతనం 19 శాతం మాత్రమే తక్కువ. 58.8 శాతం మంది తమ జీవితంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యస్థ వేతనం ఔషధ రంగంలో గంటకు రూ.157.5, మోటార్‌ వాహనాల రంగంలో రూ.264.6 ఉంది. తయారీ రంగంలో ప్రాథమిక విద్య లేని ఉద్యోగులకు గంటకు రూ.77 మాత్రమే లభిస్తోంది. ఇందులోనూ పురుషులు, మహిళలకు మధ్య వేతన వ్యత్యాసం 32 శాతం ఉంది. వివిధ రంగాల్లోని ఉద్యోగులు తాము పొందుతున్న వేతనాలు, అనుభవం తదితర అంశాలను ఇతర రంగాల్లో అమలవుతున్న వేతనాలు, ఇతర అంశాలతో పోల్చుకోవడానికి తమ వేతన సూచీ ఉపయోపడుతుందని మాన్‌స్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (భారత్‌/మధ్యప్రాచ్య) సంజయ్‌ మోదీ తెలిపారు.

Posted on 21-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning