ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 'ఐఎస్‌బీ' పాఠాలు

* పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

* ఈ ఏడాది వెయ్యి మందికి అవకాశం

* నెలాఖరుకు ఎంపికలు పూర్తి

* మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ నిపుణులతో తర్ఫీదు

 • ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం మాని, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేసేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థుల్లో ఆసక్తి గలవారిని గుర్తించి, మేనేజ్‌మెంట్‌ విద్యలోనూ వారికి కొంత ప్రావీణ్యత కల్పించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థల నిపుణులు మరింత అవగాహన కల్పించనున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (జేకేసీ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) అమర్‌నాథ్‌ రెడ్డి, ఐఎస్‌బీలో ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అరుణారెడ్డి 'ఈనాడు'కు అందించిన వివరాలు ఇవీ.. రాష్ట్రంలో ఏటా 2 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధిస్తున్నా, చాలా తక్కువ మందిలోనే ఉద్యోగ నైపుణ్యం ఉంటోంది. ప్రావీణ్యం, వినూత్న ఆలోచనలు గల విద్యార్థులు ప్రాంగణ ఎంపికలకు హాజరై, ఏదో ఒక సంస్థలో ఉపాధి పొందుతున్నారు. కానీ తమ ఆలోచనలతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేయాలనుకునేవారు అతి తక్కువగా ఉంటున్నారు. ఆర్థిక వనరుల కొరత, సంస్థను ఎలా స్థాపించాలి, వ్యాపారంలో ఎలా ముందుకెళ్లాలి, మార్కెటింగ్‌ చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన లేకపోవడం వంటివి వీరికి అవరోధంగా నిలుస్తున్నాయి. ఇలాంటి అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు జేకేసీ చొరవతో ఐఎస్‌బీ ముందుకొచ్చింది.

  రెండేళ్ల పాటు శిక్షణ

  ఇంజినీరింగ్‌ 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఈ మేనేజ్‌మెంట్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 20 కళాశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, బిట్స్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి, వాసవి, సీబీఐటీ కళాశాలలతో పాటు విశాఖపట్నంలోని గీతం, తాడేపల్లిగూడెంలోని శశి, విజయవాడ సిద్ధార్థ, తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, చిత్తూరులో శ్రీవిద్యా నికేతన్‌, అనంతపూర్‌ జేఎన్‌టీయూ వంటి సంస్థలను ఐఎస్‌బీ ఎంపిక చేసింది. ఆయా విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల ప్రాతిపదికగా వీటిని ఎంపిక చేశారు. ఒక్కో కళాశాలలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు ఎంపికలు పూర్తవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే 60% విద్యాసంస్థలను ఎంపిక చేసినా మున్ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అవకాశం కల్పించనున్నారు.
  * ఇంజినీరింగ్‌ మొదటి, రెండు సంవత్సరాల్లో మంచి మార్కులు సాధించడంతో పాటు సంస్థ/పరిశ్రమను స్థాపించాలనే ఉత్సాహం గల విద్యార్థులతో వ్యాసాల వంటివి రాయించి, వారి అభిరుచి, ఆసక్తిని పరిశీలించాకే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  * వినూత్న ఆలోచనను ఉత్పత్తిగా మార్చేందుకు ఏం చేయాలి? విపణిలో అవకాశాలు, ఆర్థిక సాయం చేసే వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, బ్యాంకులకు ప్రాజెక్టు నివేదిక సమర్పణ, వ్యాపార అంచనాలు, లాభనష్టాల బేరీజు వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
  * ఆన్‌లైన్‌లో, శాటిలైట్‌ ద్వారా నిపుణులతో శిక్షణ ఇస్తారు. 6 వారాలు - 2 నెలలకోసారి విద్యార్థులకు ఐఎస్‌బీలో తరగతులు కూడా ఉంటాయి
  * ఆయా కళాశాలల్లో సాంకేతిక అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేసేందుకు ట్రిపుల్‌ఐటీ, శ్రీనిధి, బిట్స్‌, వరంగల్‌ నిట్‌లను నోడల్‌ కళాశాలలుగా ఎంపిక చేశారు.
  * తాజా సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు.
  తొలి బృందం 2015 జులైలో..
  ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపిక చేయనున్న 1,000 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు 2015 జులైలో ఉత్తీర్ణులవుతారు. వీరు తమ ఆలోచనలను, వ్యాపార నమూనాలను ప్రదర్శిస్తారు. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో పాటు మెరుగైన ఆలోచనలకు ప్రభుత్వం తరఫునా ఆర్థిక సాయం అందించాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే, ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందుతారని విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning