రూపొందించు... సాధించు...

* ఉద్యోగాలకు కీలకం ప్రాజెక్టు
* సొంతంగా తయారు చేస్తేనే పరిజ్ఞానం
* ఈసారి అమీర్‌పేట సంస్థలు వెలవెల

ఈనాడు, హైదరాబాద్, న్యూస్ టుడే, సనత్ నగర్: ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యం నాస్తి... ఎన్నో అధ్యయనాలు చెబుతున్న వాస్తవమిది. మార్కుల సంగతి పక్కనబెడితే చివరి సంవత్సరంలో ప్రధానమైన ప్రాజెక్టు ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతోంది. సొంత ఆలోచనతో... నిపుణుల మార్గదర్శకంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉద్యోగ నైపుణ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.50 లక్షల మందికిపైగా బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌లోకి ప్రవేశించారు. చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌లో తరగతులు జరగవు. ఆరు నెలల్లో కనీసం మూడు నెలల సమయం ప్రాజెక్టుకే కేటాయిస్తారు. అవగాహన లేని విద్యార్థులు దానిపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించరు. ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటి? వాటికి పరిష్కారం ఎలా? ప్రాజెక్టు ద్వారా సమస్యను ఎలా పరిష్కరించవచ్చు? అని ఆలోచన చేయడం లేదు. విభాగాధిపతితో మాట్లాడి సులభంగా అయ్యే ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. మిగతా బ్రాంచీల సంగతి పక్కనబెడితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బ్రాంచి విద్యార్థులు సీనియర్లు చేసిన వాటికి కొద్ది మార్పులు చేయడం... మరో కళాశాలలో మిత్రులు చేసే ప్రాజెక్టును చేపట్టడం... లేదా అధిక శాతం మంది అమీర్‌పేటలోని ఐటీ శిక్షణ సంస్థలను ఆశ్రయించడం చేస్తున్నారు.
* కళాశాలల్లోనే ఈసారి...
సాధారణంగా కొంతమంది విద్యార్థులు సొంతంగా అమీర్‌పేట వస్తుండగా కళాశాలల్లోని విభాగాధిపతులు ఆయా ఐటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలను బట్టి తమ సంస్థ నుంచి ఇంతమంది వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చి పంపుతున్నారు. శిక్షణకు రూ.3,500 - రూ.5 వేల వసూలు చేస్తుంటారు. కొన్ని కళాశాలలు మాత్రం ఆయా సంస్థల ప్రతినిధులను తమ కళాశాలకే వచ్చి 10 - 15 రోజులు శిక్షణ ఇచ్చేలా చేస్తుంటాయి. అయినా కనీసం 30 వేల మంది వరకు వస్తుంటారు. ఈసారి చాలా కళాశాలలు తమ సంస్థల్లోనే ప్రాజెక్టులు చేయిస్తున్నాయని శిక్షణా సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. పలు కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోవడం, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల యాజమాన్యాలే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాయని, వాటిలో కొంతవరకు యాజమాన్యాలు మిగుల్చుకుంటాయని చెబుతున్నారు. కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు సైతం ఆయా కళాశాలలకు వచ్చి ప్రాజెక్టులపై శిక్షణ ఇస్తున్నాయి.
* కొనుగోలు చేస్తే... అంతే సంగతులు
నగరంలోని పలు సంస్థలు ప్రాజెక్టులను విక్రయిస్తున్నాయి. విద్యార్థులు సైతం పని పూర్తయితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోని ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎంపికైన వారిని ప్రాజెక్టు గురించి ఏమీ అడగరు. ఎంపిక కాని వారు తర్వాత ఉద్యోగాల వేటలో పడాలి. అప్పుడు ప్రాజెక్టు గురించి వివరించమని అడుగుతారు. ఇంటర్వ్యూ చేసేది నిపుణులే కాబట్టి రెండు నిమిషాల్లోనే ప్రాజెక్టును నిజంగా చేశారా? కొనుగోలు చేశారా? అన్నది అంచనా వేస్తారు. నిజంగా ప్రాజెక్టు చేస్తే వారి అడిగే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. దానివల్ల ప్రాక్టికల్‌గా పరిజ్ఞానం బాగా ఉందన్న అంచనాకు వస్తారని, తద్వారా ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ సంస్థలకు వచ్చి శిక్షణ తీసుకున్నా చిత్తశుద్ధితో రెండు నెలలపాటు కృషి చేస్తే ప్రాజెక్టుపై పూర్తి పట్టు సంపాదించవచ్చని చెబుతున్నారు. 'విద్యార్థులు రావడానికి ఆరు నెలల ముందు నుంచి మా వద్ద ఉన్న నిపుణులు సమావేశమై ఏఏ అంశాలు, సమస్యలపై ప్రాజెక్టులు చేయవచ్చో ఒక జాబితా తయారు చేస్తారు. ప్రతి ఏటా వాటిని మారుస్తారు. అందుకు వివిధ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం కనుక్కొంటారు. అందువల్ల విద్యార్థి క్రమం తప్పకుండా తరగతులకు హాజరై ల్యాబ్‌లో సాధన చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది' అని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు.
* కళ తప్పిన ప్రాంతాలు
కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచి విద్యార్థులు చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌లోకి అడుగుపెట్టారంటే అధిక శాతం మంది గత కొద్ది సంవత్సరాలుగా అమీర్‌పేట వెళ్లారు. ఇక్కడ సుమారు 20 వరకు ఐటీ శిక్షణ సంస్థలు ప్రాజెక్టులపై శిక్షణ ఇస్తాయి. కొన్ని ప్రముఖ సంస్థలకు సుమారు ఆరేడు వేల మంది వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. అలా సుమారు ఒక్కో బ్యాచ్‌లో 1000 - 1,500 మంది వరకు ఉంటారు. నెల నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఉండేది. అలా ప్రతిఏటా 30 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. వారిలో క్రమం తప్పకుండా తరగతులకు వచ్చేవారు 70 శాతం మంది ఉంటే ల్యాబ్‌లకు వచ్చేవారు 20 - 30 శాతానికి మించరని సంస్థల ప్రతినిధులు చెబుతున్న మాట. హాజరు శాతం అలా ఉంటే ఈసారి ప్రాజెక్టుల కోసం వచ్చేవారు కనిపించకపోవడం శిక్షణ సంస్థల ప్రతినిధులను కలవరపరుస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతి ముగిసిన వెంటనే వచ్చేవారు. ఈసారి 10 రోజులు గడిచినా రాకపోవడంతో కారణాలపై ఆరా తీయడం ప్రారంభించారు.
* ప్రాజెక్టుపై అవగాహన తప్పనిసరి - గోపీచంద్, బీటెక్ ఫైనలియర్, మెహదీపట్నం.
ఇంజినీరింగ్ పూర్తి చేయాలంటే ఆయా సబ్జెక్టుల వారీగా ప్రాజెక్టులపై అవగాహన తప్పనిసరి. ఇందుకు సంబంధించి నగర పరిధిలోని కళాశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. కొందరు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సంబంధిత సబ్జెక్టులపై పట్టు కోల్పోతాం. ప్రాజెక్టుల కోసం ఆరు నెలల సమయం ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
* భారంగా భావించే కన్సల్టెన్సీలకు పరుగు - మెహిన్, బీటెక్ ఫైనలియర్, బోరబండ.
ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేయడంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం తప్పనిసరి. అయితే ప్రాజెక్టులను భారంగా భావించే కొందరు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తుంటారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వంటి సబ్జెక్టుల కోసం బయటివారిని ఆశ్రయిస్తుంటారు. వేలాది రూపాయలు ఖర్చు చేసే కంటే, సరైన ప్రణాళి, అవగాహనతో ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎంతో ఫలితాన్నిస్తుంది.
* భవిష్యత్తులోనూ చాలా ఉపయోగం - ఆచార్య కామాక్షి ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ విభాగం, జేఎన్‌టీయూహెచ్.
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో మూడో సంవత్సరంలో మినీ ప్రాజెక్టు ఉంటుంది. అప్పుడు చేసిన మినీ ప్రాజెక్టును మరికొంత అభివృద్ధి చేసేందుకు చివరి సంవత్సరంలో ప్రాజెక్టును వినియోగించుకోవచ్చు. అంటే సంవత్సరం ముందు నుంచే ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగం దక్కించుకోవడానికే కాదు... వచ్చిన తర్వాత ప్రాజెక్టు అనుభవం జీవితాంతం ఉపయోగపడుతుంది. విద్యార్థులు భవిష్యత్తులో ప్రాజెక్టు లీడర్లు, మేనేజర్లు అవుతారు. అప్పుడు బృందం పనితీరుపై నివేదిక రాయాలన్నా... అందరి నివేదికలను సంక్షిప్తంగా చేసి పంపాలన్నా ప్రాజెక్టు అనుభవం అక్కరకు వస్తుంది. కొన్ని కంపెనీలు మార్కులు తక్కువ వచ్చినా ప్రాక్టికల్ పరిజ్ఞానం బాగా ఉన్నవారిని ఎంపిక చేస్తాయి. అందువల్ల బాగా ఆలోచించి ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయటం కెరీర్‌కు దోహదపడుతుంది.

Posted on 28-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning