అదనపు కోర్సులు... కొలువుకు మార్గాలు

* సర్టిఫికేషన్‌ కోర్సులతో నైపుణ్యాలు
* ఇంజినీరింగ్‌, ఎంబీఏ, బీ ఫార్మసీ విద్యార్థులకు ప్రయోజనం

ఇంజినీరింగ్‌.. బీ ఫార్మసీ.. ఎంబీఏ.. కోర్సు ఏదైనా పట్టభద్రులం అయిపోయాం. ఇక ఉద్యోగం పొందడమే ఆలస్యం అని భావిస్తే తప్పులోకాలేసినట్లే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులనే ప్రముఖ కంపెనీల కొలువులు వరిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థుల్లో అదనపు పరిజ్ఞానాన్ని బహుళజాతి సంస్థలు కోరుకుంటున్నాయి. ఈక్రమంలో అకడమిక్‌ డిగ్రీతో పాటు సర్టిఫికేషన్‌ కోర్సులు చేస్తే అదనపు సాంకేతికతను అందిపుచ్చుకుని కొలువు సాధించడం సులువువతుందని నిపుణులు అంటున్నారు.
నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 41 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా ఏటా సుమారు 10వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టాతో బయటకి వస్తున్నారు. వివిధ కళాశాలల ద్వారా సుమారు ఆరువేల మంది బీ ఫార్మసీ, ఎంబీఏ డిగ్రీలు పొందేవారు ఉన్నారు. వారందరీలో కేవలం 10 శాతంలోపే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ప్రధానంగా వివిధ బహుళజాతి కంపెనీలు కొన్ని కళాశాలల్లోనే ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి. కంపెనీల ప్రాధాన్యతలను అనుసరించి అనుకున్న స్థాయిలో ప్రతిభ గల విద్యార్థులుంటేనే నియామకాలు చేపడుతున్నాయి. మారుతున్న పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యాలు ప్రదర్శించే వారికే పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో కొలువు సాధించని విద్యార్థులు మరింత నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
యువతలో'నై'పుణ్యాలు..నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పట్టు సాధించే అంశాలను ఒడిసిపట్టాలి. భాషా, సామార్థ్యం, విషయ పరిజ్ఞానం, సానుకూల దృక్పథం వంటి నైపుణ్యాలను విధిగా పెంపొందించుకోవాలి. వాటికి అదనంగా వివిధ సర్టిఫికేషన్‌ కోర్సులను నేర్చుకుంటే ఉద్యోగాలకు ఎంపికవడం సులభం అవుతుంది.
వీరికి ఎంతో ప్రయోజనం..
ఇంజినీరింగ్‌ మూడో ఏడాది విద్యార్థులతో పాటు ఆఖరి సంవత్సరం విద్యార్థులు సరికొత్త అంశాలపై శిక్షణ తీసుకుంటే మంచిది. ప్రాంగణ ఎంపికల్లో నియామకాలు రాకపోయినా ఆఫ్‌ క్యాంపస్‌ల్లోనైనా కొలువును పట్టే అవకాశాలుంటాయి. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తయిన విద్యార్థులు వివిధ అంశాల్లో ఏడాది లేదా ఏడాదిన్నర కోర్సులను పూర్తి చేసి అదనపు పరిజ్ఞానాన్ని పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆయా విభాగాల్లో కొన్ని కోర్సులు..
ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాంకేతిక విజ్ఞానంలో తాజా పరిణామాలు, వివిధ సంస్థలు నిర్వహణలో అనుసరిస్తున్న కొత్త విధానాలపై అవగాహనపెంచుకొని. అన్ని రంగాలకు సాంకేతికత, సాప్ట్‌వేర్‌ వ్యాపించడంతో ఆయా రంగాలకు సంబంధించిన నూతన సాప్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం మేలంటున్నారు నల్గొండ పరిధిలోని చర్లపల్లి నిట్స్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఎ.జానకిరాంరెడ్డి. దాదాపు మూడు నుంచి ఆరు నెలల కాలపరిమితి గత కొత్తకోర్సుల వల్ల సరికొత్త అంశాలపై పట్టు సాధించవచ్చు. అకడమిక్‌తో పాటు పూర్తయిన సర్టిఫికేట్‌ కోర్సు అదనపు అర్హతగానే కాకుండా ఇతర అభ్యర్థుల కన్నా కొన్ని అంశాల్లోమెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగు పడేందుకు కోర్సులు దోహదం చేస్తాయి.
* సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్టాడ్‌ ప్రొ(స్ట్రక్చరల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ డిజైన్‌ సాప్ట్‌వేర్‌) కోర్సు చేయవచ్చు. ఆటోక్యాడ్‌, బిల్డింగ్‌ డిజైనింగ్‌, ఇంటీరియల్‌ డిజైనింగ్‌, కన్‌స్ట్రక్చన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులు ఉపయోకరం.
* మెకానికల్‌ విభాగంలో క్యాడ్‌కమ్‌, టూల్‌ డిజైన్‌, పైపింగ్‌ ఇంజినీరింగ్‌,నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌, (ఎన్‌డీటీ), క్యాటియా, ప్రొ.ఇ,కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌(క్యాడ్‌) కోర్సుల్లో శిక్షణ మంచిది.
* ఈసీఈలో సిస్కో- సర్టిపైడ్‌ నెట్‌వర్కింగ్‌ అసోసియోట్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌- కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా, నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌ఎఫ్‌ ఇంజినీరింగ్‌, ఆప్టికల్‌ పైబర్‌ కేబుల్‌ ఇంజినీరింగ్‌,క్త్జెలింగ్స్‌, ఎఫ్‌పీజీఏ బోర్డులు, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ డిజైన్‌, ఇ-క్యాడ్‌ కామ్‌, మైక్రోవేవ్‌ తదితర కోర్సులు చేయవచ్చు.
* సీఎస్‌ఈలో సీ, సీ ప్లస్‌ప్లస్‌, జావా, హెచ్‌టీఎంఎల్‌, డాట్‌ నెట్‌, శాప్‌, ఒరాకిల్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌, పీహెచ్‌పీ,ఆండ్రాయిడ్‌, సిస్కో తదితర కోర్సులు
* ఈఈఈ విభాగంలో పవర్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, పవర్‌ ఆడిట్‌, వీఎల్‌ఎస్‌ఐ, కంట్రోల్‌ సిస్టిమ్స్‌ తదితర కోర్సులు ఉన్నాయి.
ఇతర డిగ్రీల్లో...
* బీ ఫార్మసీ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఫార్మాసిస్టు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, టెక్నీషియన్‌గా కొలువులు పొందవచ్చు. అయినా డ్రగ్‌రెగ్యులేటరీ ఎఫైర్స్‌ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంటు, ఫార్మాకోవిజిలెన్స్‌ వంటి సర్టిఫికేట్‌ కోర్సుల్లో శిక్షణ వల్ల అదనపు పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు.
* ఎంబీఏ తర్వాత మరింత నైపుణ్యం అవసరమైన పక్షంలో డిప్లమా ఇన్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ వంటి కోర్సులు చేయవచ్చు. ఎంచుకున్న రంగంపై ఆసక్తిని అనుసరించి డిప్లమాఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ ఎకనామిక్స్‌, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ వైపు దృష్టి సారించవచ్చు.
సర్టిఫికేషన్‌ కోర్సులతో ప్రయోజనం: హైమావతి, ఈసీఈ హెచ్‌వోడీ
కొన్ని సంస్థలు సరికొత్త, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న విద్యార్థుల కోసం ఏడాది పొడవునా అన్వేషిస్తున్నాయి.ప్రాంగణ ఎంపికలే కాకుండా ప్రాంగణేతర ఎంపికలనూ నిర్వహిస్తాయి. అందుకే కంపెనీల ప్రాధాన్యతను బట్టి స్వల్ప కాలవ్యవధి గల సర్టిఫికేషన్‌ కోర్సులు అభ్యసించడం వల్ల సంబంధిత అకడమిక్‌ అంశాలతో పాటు అదనపు అంశాలపై ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టు సాధించవచ్చు. ఉద్యోగ ఎంపికల్లో ఆత్మ విశ్వాసం పెరిగి సత్తా చాటవచ్చు. తడబాటును అధిగమించి కొలువుదీరవచ్చు.
ఉపాధి అవకాశాల మెరుగు..: దీప్తి, ఈఈఈ హెచ్‌వోడి
ఒక ప్రణాళిక ప్రకారం సర్టిఫికేట్‌ కోర్సులు చేయడం వల్ల వివిధ పాఠ్యాంశాల్లో లోతైన విశ్లేషణ ఒనగూరుతుంది. సదస్సులకు హాజరవుతూ, వివిధ జర్నల్స్‌ను చదువుతూ విజ్ఞానాన్ని విద్యార్థులు సముపార్జించాలి. దీంతో కంపెనీలు మార్కుల ఆధారంగా కాకుండా సబ్జెక్టుపై పట్టును గమనించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. నైపుణ్యాలను పెంపొందించుకునే దిశగా ఎంబీఏ విద్యార్థులు సైతం వివిధ సర్టిఫికేట్‌ కోర్సులు చేయడం ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తుంది.

Posted on 02 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning