కోడింగ్‌ నైపుణ్యాల్లో మీది ఏ స్థాయి?

ఉత్తమశ్రేణి కళాశాలల్లో చదివే విద్యార్థులను ప్రసిద్ధ సంస్థలు అధిక వేతనాలతో నియమించుకుంటాయని మిగతా ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు నిరాశపడనక్కర్లేదు. ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించటం, ఇతర అంశాల్లో తగిన చొరవ చూపటం వల్ల వారు ఇలాంటి అవకాశాలను పొందగలుగుతారు!
ఈమధ్య కాలంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కోటికి పైగా వేతనాలు ఇస్తున్నారని వినే ఉంటారు. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో అప్పుడే పాసై వచ్చే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏటా రూ. 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయిల వేతనం ఇచ్చే సంస్థలు ఎన్నో ఉంటున్నాయి. అధిక వేతనాలు పొందేది ఎక్కువశాతం టయర్‌-1 కళాశాలల విద్యార్థులే అయినప్పటికీ మిగిలిన కళాశాలల వారూ ఇలాంటి ఘనత పొందుతూనే ఉన్నారు. ఏ కళాశాలలకు చెందినవారైనప్పటికీ ఇలాంటి వేతనాలు సాధించాలంటే ప్రోగ్రామింగ్‌పై ధ్యాస ఉంచి కోడింగ్‌ సాధన చేయగలిగివుండాలి!
ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో కోడింగ్‌/ ప్రోగ్రామింగ్‌కు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. ఆయా సంస్థలు పెట్టే రాత పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విద్యార్థి కోడింగ్‌ పరిజ్ఞానం మాత్రమే పరీక్షిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిజ్ఞానం లేకపోతే ఇటువంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకోవాలనుకోవడం కల్ల. చాలామంది కోడింగ్‌/ ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవాలని మొదలుపెడతారు. చాలావరకు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలోనే సీ ప్రోగ్రామింగ్‌ నేర్పిస్తారు. ఇది సరిగా అర్థం చేసుకోనపుడూ, కష్టతరంగా అనిపించినపుడూ నేర్చుకోవడం ఆపేస్తారు. కష్టంగా అనిపించినపుడు కూడా ఆపకుండా నేర్చుకునే ప్రయత్నం కొనసాగించేవారే విజయం సాధిస్తారు. చాలామంది విద్యార్థులు ఈ సమయంలో వదిలేస్తారు. అలా చేసినపుడు మిగిలిన రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం దుర్లభమవుతుంది.
ముఖ్యమైనవి మూడు: కోడింగ్‌ గురించి చదవడం, రాయడం, సాధన చేయడం అనేవి మూడు ముఖ్యాంశాలు. మొదట్లో ఎలా రాస్తున్నారని ఆలోచించకుండా కోడింగ్‌ రాయడం మొదలుపెట్టాలి. ప్రారంభంలో ఎలా రాస్తున్నారనే దానికన్నా సాధన చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. మెల్లగా అవగాహన వస్తుంది. ప్రోగ్రామింగ్‌ అన్నది ఏదో ఒక నెల కష్టపడితేనో లేక ఒక సంవత్సరం సాధన చేస్తేనో వచ్చేది కాదు. ఇంజినీరింగ్‌ నాలుగు సంవత్సరాల్లో చదివి, రాసి, సాధన చేస్తేనే ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడంలో పురోగతి సాధిస్తారు.
కొలువు సంపాదించాలంటే...: సంస్థలకు కావాల్సిన రీతిలో కోడింగ్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవటం ముఖ్యం. అప్పుడే ఫలానా కళాశాల అనేదానితో నిమిత్తం లేకుండా ఉన్నత సంస్థల్లో నాలుగో సంవత్సరంలోనే కొలువు సాధించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక- విద్యార్థులు ఇటువంటి మెరుగైన వేతనాలు ప్రాంగణ నియామకాల ద్వారా సంపాదించాలంటే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే సరైన పద్ధతిలో ముందడుగు వేయాలి. చాలామంది ప్రాంగణ నియామకాల కోసం ప్రయత్నాలు, ఆప్టిట్యూడ్‌/ కోర్‌ సబ్జెక్టులు, కోడింగ్‌, ఇంటర్వ్యూలకు కావాల్సిన మెలకువలు ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలోనో లేక ఆఖరి సంవత్సరంలోనో మొదలుపెడతారు. ఏదో ఒక ఉద్యోగం క్యాంపస్‌లో రాకపోతుందా అన్న అపోహతో ఉంటారు.
శ్రద్ధగా, పట్టుదలతో ఒక ఆశయంతో మొదటి సంవత్సరం నుంచే ఈ కింద చెప్పే విధానాలతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
* ఆసక్తి కలిగించే వెబ్‌సైట్లు: ఎక్కువ శాతం విద్యార్థులు కోడింగ్‌/ ప్రోగ్రామింగ్‌ తమ మొదటి సంవత్సరంలోనే నేర్చుకోవడం మొదలుపెడతారు. చాలావరకు ఏదో మొక్కుబడిగా నేర్చుకుంటుంటారు. కోడింగ్‌ ఎందుకు అవసరమో కూడా తెలియనివారు చాలామంది. దీనిపై ఆసక్తి కలిగేవిధంగా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎన్నో వెబ్‌సైట్లు దోహదపడతాయి. గీక్‌ ఫర్‌ గీక్స్‌, హకెర్‌ రాంక్‌, కోడ్‌ చెఫ్‌, టాప్‌ కోడెర్‌ లాంటి ఆన్‌లైన్‌ సైట్లు కోడింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో చక్కటి సాధనాలు.
ఇటువంటి సైట్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఉచితంగా నేర్చుకోవచ్చు. కొన్ని ఎక్కువ వేతనాలు ఇచ్చే సంస్థలు పైన చెప్పిన సైట్‌ల ద్వారా కోడింగ్‌ రాతపరీక్ష పెడుతుంటాయి. సరైన అవగాహన, పరీక్ష విధానం తెలిస్తే విజయం పొందే అవకాశాలు ఎక్కువ. అధికశాతం సంస్థలు కోడింగ్‌ పరిజ్ఞానం పరీక్షించేందుకు ఇటువంటి ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఎంపిక జరుపుతుంటాయి.
ఇవి పాటిస్తే మేలు
* బృందం ద్వారా నేర్చుకోవడం: విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఒక క్లబ్‌ ఏర్పరచుకుని కోడింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కాన్సెప్టులు నేర్చుకోవచ్చు. ఇతర విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లవచ్చు. కోడింగ్‌ మీద అవగాహన వచ్చే వరకు, ఆసక్తి కలిగే విధంగా వివిధ పద్ధతులతో నేర్చుకోవచ్చు. దీనివల్ల మధ్యలోనే నేర్చుకోవడం ఆపేయడం లాంటి ఆలోచనలను అరికట్టవచ్చు. ఒకరు రాసిన కోడ్‌ ఇంకొకరు పరిశీలించడం, పోటీతత్వంతో ఒకరు నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పించడం లాంటివి నాలుగు సంవత్సరాలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వైపు పరుగులు తీయడానికి దోహదపడతాయి.
* సంస్థల సాంకేతిక పోటీలో పాల్గొనడం: ఎక్కువ శాతం సంస్థలు విద్యార్థుల పరిజ్ఞానాన్ని కోడింగ్‌ పోటీల ద్వారా పరీక్షిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాలుగో సంవత్సరం విద్యార్థుల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు కూడా ఇస్తారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను తెలియజేయడానికీ ఉపయోగం. కొన్ని సంస్థలు ఏ కళాశాల నుంచి ఎక్కువ విద్యార్థులు ఇలాంటి టెక్నికల్‌ కాంపిటిషన్‌లో పాల్గొంటారో ఆ కళాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాంగణ నియామకాలకు వచ్చే అవకాశం లేకపోలేదు.
* టెక్నాలజీపై అవగాహన, పర్సనల్‌ బ్రాండింగ్‌: కొన్ని పేరున్న పెద్ద సంస్థల టెక్నాలజీ విభాగాల్లో రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం విద్యార్థులకు చక్కటి అవకాశాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు గూగుల్‌ సంస్థ 'గూగుల్‌ స్టూడెంట్‌ అంబాసిడర్‌'; మైక్రోసాఫ్ట్‌ సంస్థ 'మైక్రోసాఫ్ట్‌ స్టూడెంట్‌ పార్టనర్‌'. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ అంబాసిడర్‌/ పార్టనర్స్‌ ద్వారా కళాశాలలో ఇతర విద్యార్థులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి.
* ఇంటర్న్‌షిప్‌ సద్వినియోగం: కళాశాల యాజమాన్యం/ విశ్వవిద్యాలయం ప్రకారం చాలామంది విద్యార్థులు ప్రాజెక్టును కేవలం నిర్ణీత కాలంలో కొన్ని సందర్భాల్లో రెండు నెలలు/ ఆరు నెలలు చేస్తుంటారు. విద్యార్థులు సాంకేతిక పోటీ ద్వారానో, ప్రాక్టికల్‌ ప్రాజెక్టుల ద్వారానో, రియల్‌ టైం ప్రాజెక్టుల ఫాకల్టీ ద్వారానో రెండో సంవత్సరం నుంచే ప్రతిభ చూపగలిగితే సంస్థలు 'ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌' ఇచ్చే అవకాశం లేకపోలేదు. కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రత్యేక పరీక్షలు మూడో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించి ఎంపిక చేస్తాయి.
* కెరియర్‌ కౌన్సెలింగ్‌ విభాగం: మొదటి సంవత్సరం నుంచే విద్యార్థుల ఆసక్తికి తగ్గ, నైపుణ్యానికి తగ్గ అవకాశాలు ఎటువంటి రంగాల్లో ఉన్నాయో తెలియజెప్పి శిక్షణ, సన్నద్ధత చాలా అవసరం. ఇటువంటి కెరియర్‌ కౌన్సెలింగ్‌ విభాగం లేకపోవడం వల్ల సంస్థల గురించీ, సాంకేతికత గురించీ తెలిసే అవకాశమే లేకుండా పోతోంది. అసలు కొందరు విద్యార్థులైతే శిక్షణ ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండడం గమనార్హం.
* ఈ విభాగం విద్యార్థులే ప్రారంభించి, వారే నడపాలి. అపుడే కెరియర్‌ మీద అవగాహన, అవకాశాలు తెలిసి చక్కని శిక్షణ, ప్లేస్‌మెంట్‌ విభాగాన్ని నెలకొల్పవచ్చు. ఉన్నత కళాశాలల్లో శిక్షణ, ప్లేస్‌మెంట్‌ విభాగాలను విద్యార్థులే నడపడం గమనార్హం. అందుకు విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి కూడా కెరియర్‌ కౌన్సెలింగ్‌ విభాగంతో మొదలుపెట్టి శిక్షణ- ప్లేస్‌మెంట్‌ విభాగానికి దోహదపడే విధంగా ఉండాలి.
ఈ విధంగా మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు కష్టపడి సరైన మార్గంలో ప్రయాణించటం చాలా అవసరం. అప్పుడు ఎటువంటి విద్యార్థి అయినా కళాశాలతో సంబంధం లేకుండా మంచి సంస్థల్లో కొలువులు సాధించగలుగుతారు.

Posted on 02 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning