సింగరేణిలో 2164 కొత్త కొలువులు!

* 10 నుంచి నియామక ప్రకటనలు
* జూన్‌లోగా భర్తీ ప్రక్రియ పూర్తి
* మొత్తం 5500 ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంస్థ
* తెలంగాణలో తొలి కొలువుల మేళా
ఈనాడు, హైదరాబాద్, గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణిలో మొత్తం 5500 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఫిబ్రవరి 2న ప్రకటించింది. అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ జూన్‌లోగా భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించడంతో పాటు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఖాళీల భర్తీ ఇలా...
* మెకానిక్ మొదలుకుని ఎగ్జిక్యూటివ్‌ల దాకా వివిధ రకాల ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నారు. 5500 ఉద్యోగాల్లో 2164 మందిని బయటి నుంచి తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. వీటికి ఫిబ్రవరి 10 నుంచి ప్రకటనలు జారీకానున్నాయి. ఇందులో 1127 ఉద్యోగాలు మైనింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులతో భర్తీ చేస్తారు.
* ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, గని సూపర్‌వైజర్, జూనియర్ అసిస్టెంటు విభాగాల్లో 771 ఖాళీలను భర్తీ చేస్తారు.
* పారామెడికల్, సాంకేతిక సిబ్బంది వంటి మరో 266 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది.
* ఇవి కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు కేటాయించిన ఉద్యోగాల విభాగంలో కూడా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 2004 మార్చి వరకూ ఈ విభాగంలో 2744 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు వీరిలో 753 మందికే ఉద్యోగాలిచ్చారు. మిగిలిన 1991 మందికి వచ్చే ఆగస్టులోగా నియామక పత్రాలు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.
* సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు అదనపు అర్హతలుంటే వారి అర్హతకు తగిన పోస్టుల్లో భర్తీకి మరో ప్రకటన జారీకానుంది. వీటిని 'సంస్థ అంతర్గత ఉద్యోగాల భర్తీ' పేరుతో పిలుస్తారు. ఈ కోటాలో మరో 564 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. జూనియర్ అసిస్టెంటు, సంక్షేమ అధికారి, ఈఅండ్ఎం ఇంజినీర్, సైంటిఫిక్ అధికారి తదితర పోస్టులను ఈ కోటాలో భర్తీ చేస్తారు.
* సింగరేణిలో దాదాపు 57 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ. ఉద్యోగుల సగటు వయస్సు 47 ఏళ్లుగా అధికారులు గుర్తించారు. యువరక్తం రాకతో సింగరేణిలో ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.

Posted on 03 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning