'ఎగిరి' గంతేశారు..!

* కసిగా కలిసికట్టుగా మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌కు రూపకల్పన
* సీబీఐటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
ఆలోచనల్లో చురుకుదనం.., ఆచరణలో వేగం.. ఇదే యువతరం నైజం అని నిరూపించారు సీబీఐటీ విద్యార్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టి అదిరిపోయే ఆవిష్కరణతో అందరి మన్ననలూ పొందారు. ఇంజినీరింగ్‌ చదువన్నాక ప్రాజెక్టు వర్కు ఉంటుంది.. ఆ క్రమంలో రోబోలు, రిమోట్‌తో ఎగిరే హెలికాప్టర్లు రూపొందించడం ఇప్పటి వరకూ చూశాం. కానీ గండిపేటలోని సీబీఐటీ విద్యార్థులు తేలికపాటి మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించి శభాష్‌ అనిపించారు. పెట్రోల్‌తో నడిచే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌కు వినియోగించవచ్చునని అంటున్నారు. హెలీప్యాడ్‌ అవసరం లేకుండా ఎగిరే ఈ బుల్లి విమానాన్ని వ్యవసాయానికీ ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. కార్పొరేట్‌ వ్యవసాయం.. పెద్ద కమతాలున్న చోట.. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు చల్లడానికి దీనిని వాడొచ్చని పేర్కొన్నారు.
మొత్తం 9 మంది బృందం...
సీబీఐటీలో ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌లో చివరి ఏడాది చదువుతున్న కౌషల్‌, సాయికిరణ్‌, అఖిల్‌ చంద్ర, అనురాగ్‌రెడ్డి, శ్యామరెడ్డి, సాయికుమార్‌, హిమబిందు, శ్రావ్య, సంయుక్త రాజీవ్‌ బృందంగా ఏర్పడ్డారు. కళాశాలలోని కొన్ని ఆవిష్కరణలను పరిశీలించారు. వీటికి భిన్నంగా చేయాలని రెండేళ్లు శ్రమించారు. వాజిద్‌ అనే మెకానిక్‌ను ఆశ్రయించారు. అతని షెడ్డును ఇందుకు వేదిక చేసుకున్నారు. కళాశాల విడిచిపెట్టిన వెంటనే షెడ్డులో సమావేశమవడం.. మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీలో నిమగ్నం కావడం వారికి నిత్య కృత్యమైంది. ఇందుకు కళాశాలలోని ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి సహాయాన్ని తీసుకున్నారు. ఇంతలో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన 'మేక్‌ ఇన్‌ ఇండియా' పిలుపు వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. కసిగా పని చేశారు. విజయం సాధించారు. ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ బరువు 150 కిలోలు. 450 కిలోల బరువును మోసే సామర్థ్యం ఉంది. ఇందుకోసం రూ.2.2 లక్షల ఖర్చయింది.
పట్టు వదలకుండా ప్రయత్నించాం: హిమబిందు
తరగతులు అయిపోయిన వెంటనే అందరం కలిసేవాళ్లం. ఒకటే చర్చ... ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలని. ఎప్పుడు చూసినా అదే ఆలోచన. ఇలా దాదాపు 8 నెలలు ఇదే పనిలో ఉన్నాం. 2014 అక్టోబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయోగించాం. మొదటిసారి విఫలమైంది. సమస్యలు గుర్తించాం. మళ్లీ జనవరిలో రెండోసారి ప్రయోగించి విజయం సాధించాం. 450 కిలోల బరువును ఈ బుల్లి విమానం మోయగలదు. ఇంకా దీనిని పూర్తి స్థాయిలో పనిచేసేలా రూపొందించాల్సి ఉంది. పైకి ఎగిరేలా చేయడంలో విజయవంతం అయ్యాం. ఇక వినియోగంపైనే దృష్టి పెట్టాం.
చిన్నప్పటి కల సాకారమైంది: కౌషల్‌
చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని కలలు కనేవాణ్ని. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు.. అంతా అయోమయం అనిపించింది. రానురాను పట్టు దొరికింది. మా కళాశాల ల్యాబ్‌లో ఇప్పటికే కొన్నిటింని కనిపెట్టారు. వాటిని అధ్యయనం చేశా. భిన్నంగా కొత్త ఆవిష్కరణ చేయాలనుకున్నా. సహచర విద్యార్థులు అఖిల్‌, సాయికిరణ్‌తో చర్చించా. సోలార్‌ వాహనాల తయారీపై దృష్టి మరలింది. రోడ్డు మీద నడిచేవి కాకుండా.. గాలిలో ఎగిరేవి రూపొందించాలనుకున్నాం. అలా వచ్చిన ఆలోచనల్లోందే మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. అనుకున్నదే తడవు దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరించాం. మరో ఆరుగురితో కలిసి బృందంగా ఏర్పడి అనుకన్నది సాధించాం.
మెకానిక్‌ షెడ్డే.. మెగా వేదిక: సాయికిరణ్‌
మా కళాశాల దగ్గర్లోని మెకానిక్‌ షెడ్డే మా ప్రయోగాలకు వేదిక. గద్దలా ఎగిరేలా దాన్ని రూపొందించాం. వర్షం వచ్చినా తడవకుండా ఉండే నల్లటి వస్త్రాన్ని రెక్కలుగా వినియోగించాం. స్కూటర్‌ టైర్లను వాడాం. మాతో పాటు ఎంతో సమయం వెచ్చించి, మా విజయంలో మెకానిక్‌ వాజిద్‌ ఓ భాగమయ్యారు.
గొప్ప అనుభూతికి లోనయ్యా: అఖిల్‌చంద్ర
ఈ ప్రాజెక్టును కార్యరూపంలో పెట్టినప్పటి నుంచి రోజురోజుకూ ఆసక్తి పెరిగింది. విమానాలు తయారు చేసే విధానాన్ని మొత్తం అధ్యయనం చేసేశాం. ఏ పరికరం ఎలా పని చేస్తుందో తెలుసుకునే శక్తి ఈ ప్రయోగం ద్వారా మాకు సమకూరింది. చిన్నప్పుడు విమానం చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు అలాంటిదే తయారు చేసి గొప్ప అనుభూతికి లోనయ్యా. నిరంతర ఆలోచన.. అధ్యయనం, శ్రమ మా విజయానికి కారణం. మెదక్‌ ఎస్పీ శ్రీనివాసులు మా ప్రయోగం గురించి తెలుసుకుని తన కార్యాలయానికి మమ్మల్ని పిలిపించుకొని అభినందించారు.
ఆలోచన చూసి ముచ్చటేసింది: వాజిద్‌, మెకానిక్‌
సీబీఐటీ విద్యార్థుల ఆలోచన చూస్తే ముచ్చటేసింది. కళాశాల విడిచిపెట్టగానే మెకానిక్‌ షెడ్డుకు వచ్చేసేవారు. వారి ఆసక్తి నాకు బాగా నచ్చింది. వారితో కలిసి పని చేయాలనిపించింది. నాకున్న పరిజ్ఞానానికి వారి సాంకేతిక నైపుణ్యం తోడైంది. అంతే మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ గాల్లోకి ఎగిరింది. కళాశాలలో ప్రయోగించినప్పుడు పిల్లలందరికీ నన్ను పరిచయం చేసి నా స్థాయిని పెంచేశారు.

Posted on 04 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning