ఉద్యోగ సంసిద్ధత ఏ బాటలో?

బీటెక్‌ నాలుగో సంవత్సరంలో ఉన్న ప్రతి అభ్యర్థీ తమ కళాశాలలో ప్రాంగణ నియామకాలు జరగాలనీ, కళాశాల యాజమాన్యం చొరవ తీసుకుని సంస్థలను తమ కళాశాలకు ఆహ్వానించాలనీ కోరుకోవడం సహజం. అయితే ప్రముఖ సంస్థలు అన్ని కళాశాలలకూ వెళ్లవు. అటువంటి సంస్థలు కళాశాలలకు వెళ్లి ప్రాంగణ నియామకాలు జరపాలంటే ఆయా కళాశాలలు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి.ప్రామాణికమైన విద్యా బోధనా పద్ధతులు, యాజమాన్యం, శిక్షణ సిబ్బంది, విద్యార్థుల సమష్టికృషిపై ఈ ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. ఉద్యోగాలకు కావాల్సిన వివిధ అంశాల్లో శిక్షణకు సంబంధించిన వనరులను సమకూర్చాలి. శిక్షణ సిబ్బంది పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగపర్వంలో తమ విద్యార్థులు సఫలమవడానికి కావాల్సిన అంశాల్లో కూడా శిక్షణనివ్వాలి. విద్యార్థులు కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలి.
నియామకాలు: సంస్థలు
చాలావరకు వాణిజ్య సంస్థలు ప్రాంగణ నియామకాలకు ప్రాధాన్యమిస్తుంటాయి. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఇచ్చి, శిక్షణనిచ్చి ఆపై బాధ్యతలను అప్పగిస్తుంటాయి. ఈ శిక్షణ కాలం 3-6 నెలల కాలం పాటు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ శిక్షణ కాలం ఒకటి/ ఒకటిన్నర సంవత్సరాల వరకు కూడా కొనసాగవచ్చు.
ఒక సర్వే ఫలితాల ప్రకారం పెద్ద సంస్థలు ప్రతి కొత్త అభ్యర్థి శిక్షణ నిమిత్తం రూ. 60,000- 80,000 వరకూ వెచ్చిస్తున్నట్లు అంచనా. ఈ ధనం వారికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవహార పరిజ్ఞానం (బిహేవియరల్‌ స్కిల్స్‌), భాషాప్రయోగ సామర్థ్యం (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) వంటి అంశాలపై వెచ్చిస్తున్నారు.
రెండో, మూడో శ్రేణి కళాశాలల విద్యార్థులు పెద్ద సంస్థలు నిర్వహించే ప్రాంగణేతర నియామకాల్లో పాల్గొనాలంటే వారు చదివిన కళాశాలలకు కొన్ని నియమిత అర్హతలుండాలి.
పెద్ద సంస్థలది ఈ పరిస్థితి అయితే, మధ్యతరగతి సంస్థల పరిస్థితి వేరుగా ఉంది. ఈ సంస్థలు నియమించుకున్న అభ్యర్థుల శిక్షణ కోసం ఎక్కువ సమయం కానీ, ధనం కానీ వెచ్చించడానికి సుముఖంగా లేవు. రెండు- మూడు నెలల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉన్న అభ్యర్థులవైపు మొగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా ఈ తరహా సంస్థలు ప్రాంగణేతర నియామకాలవైపే మొగ్గు చూపుతున్నాయి.
చాలా సంస్థలు ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల్లో తాము నియమించుకున్న అభ్యర్థుల ఉత్పాదతను పెంచే దిశలో వారి అనుత్పాదక సమయాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నాయి. అంటే, వీరి శిక్షణ కాలాన్ని తగ్గించి వేస్తున్నాయి. ఇంజినీరింగ్‌తోపాటు ఇతరత్రా శిక్షణ పొందిన వారివైపు మొగ్గు చూపుతున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకుని లాభాల దిశలో ప్రయాణించడానికి ఈ సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
అంటే ఇటువంటి సంస్థలో అవకాశానికి కేవలం బీటెక్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థి కన్నా బీటెక్‌తోపాటు ప్రత్యేక శిక్షణ కలిగి ఏదేని అర్హత సంపాదించుకున్న అభ్యర్థికి అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగానికి బీటెక్‌తోపాటు జావా వంటి కోర్సులో అదనపు అర్హత ఉన్నవారికి అవకాశం ఎక్కువ. అలాగే ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్‌తోపాటు వీఎల్‌ఎస్‌ఐ వంటి కోర్సులో అదనపు అర్హత కలిగిన వారికి అవకాశాలు ఎక్కువ.
శిక్షణ సంస్థల ఆవశ్యకత
వ్యాపార సంస్థలకు ఉద్యోగ సంసిద్ధులుగా ఉన్న అభ్యర్థులు కావాలి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థులను పరీక్షలకు మాత్రమే సిద్ధపరిచే పద్ధతులను అవలంబిస్తున్నాయి. దీనివల్ల విద్యావ్యవస్థ- పరిశ్రమల మధ్య సరైన అనుసంధానం లేక కళాశాలల నుంచి వస్తున్న విద్యార్థులు ఉద్యోగ సంసిద్ధులుగా ఉండడం లేదు. కొన్ని కళాశాలలు ప్లేస్‌మెంట్‌ అధికారులను నియమించుకున్నా, వారి ప్రధాన దృష్టి విద్యార్థి ఉద్యోగం పొందేందుకు అవసరమైన మెలకువలను నేర్పడానికే పరిమితం.
వీటితోపాటు విద్యార్థులకు తమ రంగంలో క్షేత్రస్థాయిలో మౌలికాంశాల్లో తగిన తర్ఫీదునిచ్చే ప్రణాళికలు దాదాపుగా మృగ్యమనే చెప్పాలి. ఉద్యోగం పొందిన తరువాత కూడా తమ విద్యార్థి సఫలమయ్యే విధంగా సాంకేతిక మెలకువలు, ప్రవర్తనా మెలకువలు నేర్పించడంలో వెనుకబడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను ఉద్యోగ సంసిద్ధులుగా చేయడానికి ప్రత్యేక దృష్టిసారించే శిక్షణ సంస్థలు విద్యార్థులకు అందుబాటులో వచ్చాయి. ప్రధానంగా ఈ సంస్థలు పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే నూతన ఉత్పత్తులు, సేవలలో తర్ఫీదునిస్తున్నాయి.
2013లో అమెరికాలో ఉద్యోగుల ఉత్పాదకతపై శిక్షణ కార్యక్రమాల ప్రభావం, తద్వారా ఆయా సంస్థల శిక్షణ, అభివృద్ధి స్థాయులపై చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వాటిలో ముఖ్యమైన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉద్యోగి శిక్షణ కోసం వెచ్చింపు: సాంకేతికంగా ఎంతో పరిణతి చెందిన అమెరికాలో కూడా పరిపక్వమొందిన అగ్రగామి సంస్థలు తమ ఉద్యోగుల ప్రావీణ్యాభివృద్ధి (స్కిల్‌ అప్‌గ్రెడేషన్‌) కోసం ఇంతకు ముందుకంటే దాదాపు 34% ఎక్కువ వెచ్చిస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలు కలిగి, ఎక్కువ ప్రభావాన్ని చూపే శిక్షణ సంస్థలు ఉద్యోగుల ప్రతిభను పెంపొందించే విధంగా శిక్షణ నియమావళిని నిర్ణయించుకుంటున్నాయి. సంస్థల్లో మావన వనరుల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.
సామాజిక శిక్షణకు వెచ్చింపు: సాంప్రదాయిక శిక్షణతోపాటు చర్చావేదికలు (డిస్కషన్‌ ఫోరం), బ్లాగులు వంటి సామాజిక ఫోరమ్‌ల ద్వారా శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉద్యోగుల సామర్థ్యాలు ఎక్కువయ్యాయని తేలింది. దీనివల్ల అగ్రగామి సంస్థలు తమ ఉద్యోగుల ఈ మాధ్యమంలో శిక్షణ కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా ఎంప్లాయీ నెట్‌వర్క్స్‌ స్థాపిస్తున్నాయి. ఆ రంగంలో నిష్ణాతులనూ, ఆరంభిక ఉద్యోగులనూ ఒకే తాటిపైకి తెచ్చి వారిమధ్య చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రకంగా కొత్త విషయాలను నవీన పద్ధతుల్లో నేర్చుకోవడానికి ఆస్కారం కలిగిస్తున్నాయి.
శిక్షణ, అభివృద్ధి సంస్థల పాత్ర: ఈ నివేదిక ప్రకారం శిక్షణ, అభివృద్ధి సంస్థల పాత్ర క్రమేణా పునర్నిర్వచనానికి లోనవుతున్నది. వాటిని 'పని నేర్పే కేంద్రాల స్థాయి'కి కాకుండా శిక్షణ, అభివృద్ధి పథానికి దిశానిర్దేశకాలుగా, దోహదకారులుగా పరిగణిస్తున్నారు. ఈ సంస్థలు సాంకేతిక రంగాల్లోని మార్పులనూ, వ్యాపార రంగాల్లో జరుగుతున్న అభివృద్ధినీ ఆకళింపు చేసుకుని స్వయం ప్రకాశకాలుగా, తదనుగుణంగా సామర్థ్యాలను పెంచుకుని సంస్థల ఉద్యోగులకు మార్గదర్శనం చేయాలి.
ఎలా సంసిద్ధులవ్వాలి?
నివేదికలోని అంశాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఉద్యోగం సంపాదించుకోవడం ఒక ఎత్తయితే, అందులో అంచెలంచెలుగా ఎదగడం మరో ఎత్తు. నాస్‌కాం వంటి నివేదికల ప్రకారం రెండో, మూడో శ్రేణి కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే ముందుగా వారికి శిక్షణ అవసరం. కేవలం ఇంజినీరింగ్‌ డిగ్రీతో కనీసం గౌరవప్రదమైన కొలువు రావడం కష్టమే. కాబట్టి ఇంజినీరింగ్‌ విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవ్వవు. తమ సామర్థ్యాలూ, నైపుణ్యాలూ పెంచుకునేలా ప్రణాళిక చేసుకుని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.
కళాశాలలో ఉండగానే తమకు బాగా ఆసక్తి కలిగించే సబ్జెక్టుల్లో కనీసం రెండు ప్రాజెక్టులు చేసి ఉండాలి. ఈ ప్రాజెక్టులు విద్యార్థులు తాము పాఠ్యాంశాల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు పరచవచ్చో తెలుస్తుంది. దీనివల్ల వృత్తి జీవితంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు అన్నదానిపై మౌలికమైన అనుభవం కలుగుతుంది. పైగా సబ్జెక్టుల్లోని మౌలికాంశాలపై మంచి పట్టు సాధించవచ్చు. ఇంటర్వ్యూల్లో సహజ ప్రతిభ కనబరచవచ్చు.
తమ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణల గురించి, అందులో ఉన్న ఉద్యోగావకాశాల గురించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో, బ్లాగుల్లో వచ్చే కథనాలు, నివేదికలను, వార్తలను క్షుణ్ణంగా చదవాలి. ఒకవేళ ఈ రంగం ఆసక్తి కలిగించేదైతే, దీనికి కావాల్సిన శిక్షణను గుర్తించి నాణ్యమైన, అగ్రగామి సంస్థలను గుర్తించాలి.
పైన గుర్తించిన రంగంలోనే తమ ప్రతిభకు అద్దం పట్టే ప్రాజెక్టు వంటి సృజనాత్మక ఆప్‌లను చేయాలి. దీనివల్ల సబ్జెక్టు గురించి తెలియడమే కాకుండా, దాన్నెలా ఉపయోగించవచ్చు అన్నది కూడా తెలుస్తుంది. ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
స్నేహితులతో, అధ్యాపకులతో పరస్పర సంబంధాలు ఏర్పరచుకుని ఉంటే భావ వ్యక్తీకరణ ప్రక్రియ సులువుగా అలవడుతుంది. తమ ఆలోచనలనూ, అభిప్రాయాలనూ స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో తెలియజెప్పే సామర్థ్యం పెరుగుతుంది.
సర్టిఫికేషన్‌ కోర్సులు చేస్తే ఇంకా మంచిది. దీనివల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందే అవకాశాలు బాగా మెరుగవుతాయి. కోర్సు చేయడం ఖర్చుగా కాకుండా భవిష్యత్తుకూ, అభివృద్ధికీ పెట్టుబడిగా చూడాలి.
ఇంజినీరింగ్‌ చేస్తున్నపుడే ఈ కోర్సులను చేసి, ఉద్యోగావకాశాలను మెరుగు పరచుకోవాలేగానీ తర్వాత నేర్చుకుందామనుకోవడం పొరపాటు. దీనివల్ల బీటెక్‌ ముగించిన నిరుద్యోగుల జనాభా లెక్కల్లోకి చేరిపోయే ప్రమాదం ఉంది.
ఉద్యోగంలో చేరినా కొన్నేళ్ల అనుభవం తర్వాత కొత్త కోర్సుల్లో చేరి, మళ్లీ మెరుగైన ఉద్యోగాలు అందిపుచ్చుకుని అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నవారిని ఆదర్శంగా తీసుకోవాలి.

Posted on 16 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning