జేఎన్‌టీయూకే లో 'టెక్నికల్‌ ఫెస్ట్‌'

* అద్భుతాలు ఆవిష్కరించిన విద్యార్థులు
న్యూస్‌టుడే, బాలాజీచెరువు (కాకినాడ): మేథస్సుకు వారు పదును పెట్టారు... కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేశారు. చమురు నిల్వలను ఎలా కనిపెట్టాలి? భూమి అంతర్భాగంలోనున్న ఆ నిల్వలను ఏ విధంగా వెలికి తీయాలి? ఈ సమయంలో ఎటువంటి అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి? అనే అంశాలకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిపుణులను అబ్బురపరిచారు. వారంతా ఈసీఈ, ఈఈఈ, పెట్రోలియం ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. కాకినాడ జేఎన్‌టీయూలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి నేషనల్‌ సింపోజియం టెక్‌జెస్ట్‌ టూకే 15లోనే వీటిని ఆవిష్కరించారు. వివిధ విభాగాలలో పేపర్‌... పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, క్విజ్‌, డిబేట్‌ వంటి ఎన్నో పోటీలు జరిగాయి. అన్నింటా వారు ప్రతిభ కనబర్చారు.
ఎన్నో ప్రాజెక్టులు
స్టీమ్‌ ఇంజక్షన్‌తో క్రూడాయిల్‌ పైకి...
జేఎన్‌టీయూకేలో బీటెక్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌ చదువుతున్న అర్షియ, సుస్మిత, దిలీప్‌, అనురాగ్‌, నితిన్‌, నీరజ కలిసి స్టీమ్‌ ఇంజక్షన్‌ ప్రాజెక్టును తయారు చేశారు. టెక్నికల్‌ ఫెస్ట్‌లో దీన్ని ప్రదర్శించారు. క్రూడాయిల్‌ భూమిలోపల చిక్కటి పదార్థంగా ఉంటుంది. దీన్ని పైకి తేవడానికి స్టీమ్‌ ఇంజక్షన్‌ను ఉపయోగించాలి. ఆ స్టీమ్‌ ఇంజక్షన్‌ను ఉపయోగించి క్రూడాయిల్‌ కరిగే ఉష్ణోగ్రతను భూమిలోకి పంపుతారు. అనంతరం సక్కర్‌రాడ్‌ పంపు అనే పరికరం ద్వారా కరిగిన క్రూడాయిల్‌ను భూమిపైకి తీసుకువస్తారు. విద్యార్థులు ప్రాజెక్ట్‌ను ఇసుక, కంకర, పెట్రోల్‌, నీరు, మోటార్లు ఉపయోగించి చేశారు. ఇది ఎంతో ఆకట్టుకుంది.
ఆయిల్‌ గ్యాస్‌ను ఇలా విడదీయాలి
సాధారణంగా భూమి లోపలున్న ఆయిల్‌, గ్యాస్‌ వంటి సహజ నిల్వలు పైకి తీసేటప్పుడు కలిసిపోయి వస్తాయి. టూఫేజ్‌ సెపరేషన్‌ విధానంలో వీటిని వేరు చేయాలి. ఈ విధానంలో హైడ్రోకార్బన్‌ జోన్‌లు ఐసోలేటెడ్‌ చేయడం ద్వారా ఆయిల్‌, గ్యాస్‌ను విడదీయవచ్చని ప్రాజెక్టులో చూపించారు. దీనిని జేఎన్‌టీయూకే బీటెక్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌ విద్యార్థులు నోవామాధురి, రమ్యశృతి, రుచినా సుల్తానా, శ్వేత, షణ్ముఖ, నిశితలు రూపొందించారు.
షేల్‌ గ్యాస్‌ ఇలా తీస్తారు
జేఎన్‌టీయూకేలో పెట్రోలియం ఇంజినీరింగ్‌ చదువుతున్న మధులిక, శృతి, సౌమ్య, సుష్మ, హర్ష, విజయమోహన్‌లు కలిసి షేల్‌గ్యాస్‌ ఉత్పత్తిపై ప్రాజెక్టును రూపొందించారు. సాధారణంగా భూమి లోపల సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో గట్టిగా గ్యాస్‌ నిల్వలు ఉంటాయి. హైడ్రాలిక్‌ ప్యాక్చిరింగ్‌ చేయడం వల్ల షేల్‌గ్యాస్‌ ఎలా బయటకు వస్తుందో ప్రాజెక్ట్‌లో వివరించారు. ప్రాజెక్టును సిమెంట్‌, ఇసుక, బూడిద, బొగ్గు, ఎర్రమట్టితో రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు.
డ్రిల్లింగ్‌ రిగ్‌తో ఆయిల్‌ ఆచూకీ
భూమిలోపల భాగంలో ఎక్కడ చమురు నిల్వలు ఉన్నాయో డ్రిల్లింగ్‌ రిగ్‌ ఓవర్‌యూ పరికరం ద్వారా కనుగొనవచ్చు. ఆయిల్‌ను కనుగొనడంతోపాటు, అధిక ఒత్తిడికి గురికాకుండా దానిని బయటకు తీయడం ఈ పరికరం వల్ల సాధ్యమవుతుంది. ఇదీ పూర్తిగా పర్యావరణానికి నష్టం కల్గకుండా ఆయిల్‌ నిల్వలను కనిపెట్టగలదు. ఈ ప్రాజెక్ట్‌ను జేఎన్‌టీయూకే బీటెక్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు మోహన్‌చైతన్య, శ్రీచరణ్‌, సూరిబాబు, సంతోష్‌కుమార్‌, కావ్యశృహితలు రూపొందించారు.
సర్క్యూట్‌బోర్డులు కీలకం
జేఎన్‌టీయూకేలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు ఇన్నోటెక్స్‌ ఆధ్వర్యంలో ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు రూపొందించారు. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయో విద్యార్థులు ప్రాజెక్టులో వెల్లడించారు. ప్రధానంగా ఏ ఏ విభాగాలలో వీటిని ఉపయోగిస్తారో ఇన్నోటెక్స్‌ డైరెక్టర్‌ త్రినాథ్‌ విద్యార్థులకు వివరించారు.
అబ్బురపర్చిన క్వాడ్‌ కాఫ్టర్‌
జేఎన్‌టీయూకేలో నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌లోక్వాడ్‌ కాఫ్టర్‌ ఆకట్టుకుంది. జేఎన్‌టీయూకే, రోబో వర్సిటీల ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాపులో మెకానికల్‌, ఏవీయేషన్‌, ఈసీఈ, ఈఈఈ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సంయుక్తంగా క్వాడ్‌ కాఫ్టర్‌ విన్యాసాలు ప్రదర్శించారు. ఇది భూకంపాలు సంభవించినపుడు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు బాధితులను కాపాడుతుందని విద్యార్థులు తెలిపారు. అలాగే వివిధ ఆహార పదార్థాలను తరలించే సామర్థ్యం దీనికి ఉందని వెల్లడించారు.

Posted on 02 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning