అంతర్జాలంలో 'బగ్‌ హంటర్ల' హవా

* తప్పులు పట్టిస్తూ రూ.లక్షల ఆర్జన
* సంపద కురిపిస్తున్న సరదా వ్యాపకం

ఈనాడు, చెన్నై: మీ ప్రతిభకు సలాం.. మా నుంచి మీకో చిన్న బహుమానం. రూ. 7.75 లక్షలు అందుకోండి - ఓ ఉదయం ఫేస్‌బుక్‌ నుంచి సేలంలోని ఇంజినీరింగ్‌ కుర్రాడు అరుల్‌ కుమార్‌కు వచ్చిన మెయిల్‌ ఇది.ఆనందంతో ఆశ్చర్యపోవడం అరుల్‌ వంతైంది. ఇంతకీ అరుల్‌ ఏం చేశాడు..?అరుల్‌ అందరి లాంటి ఇంజినీరింగ్‌ కుర్రాడే.నిద్రలేచింది మొదలు మళ్లీ పడుకొనేదాకా ఎప్పుడూ ఫేస్‌బుక్‌లోనే. ఓ రోజు ఫేస్‌బుక్‌లో ఒక పొరపాటు కనిపించింది.
ఇక్కడ ఎవరి ఫొటోలను మరెవరైనా సులభంగా తొలగించే అవకాశం ఉందని కనిపెట్టాడు. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్‌కు తెలిపాడు. 'మీరు చెబుతున్నది అసాధ్యం.' ఫేస్‌బుక్‌ నుంచి సమాధానం వచ్చింది. మీరు పొరపాటు చేస్తున్నారని 30 సార్లు పంపినా జవాబు మారలేదు. ఓపిక నశించింది.
ఫేస్‌బుక్‌లో పొరపాటును ఒక వీడియోగా తీశాడు. ఒక యూజర్‌ ఫొటోను మరొకరు ఎలా తొలగించవచ్చో వీడియో తీశాడు. ఆ వీడియోను మళ్లీ ఫేస్‌బుక్‌కి పంపాడు. అవాక్కవడం ఫేస్‌బుక్‌ వంతైంది. మీ ప్రతిభకు సలాం.. అంటూ ఫేస్‌బుక్‌ అరుల్‌కి నగదు బహుమతి పంపింది.
ఇక రాంచీకి చెందిన ప్రకార్‌ ప్రసాద్‌ కూడా అంతే. 'పేపాల్‌' సైట్‌లో లోపాన్ని గుర్తించి నిర్వాహకులకు తెలిపారు. ఆ సంస్థ ఆయనకు రూ. 3.11 లక్షలను బహుమతిగా ఇచ్చింది. తమిళనాడుకు చెందిన విజ్ఞేష్‌కుమార్‌ కూడా గూగుల్‌ అనువాదంలో ఒక పెద్ద పొరబాటును పసిగట్టి ఆ సంస్థకు తెలియజేస్తే బహుమానం లభించింది.
లక్ష్మణ్‌ ముత్తయ్య, తుషార్‌ ఆర్‌.కుంభారే, అతుల్‌ షెడాగే... ఇలా చెప్పుకుంటూపోతే అంతర్జాలంలో తప్పులను పసిగట్టి ఆయా సంస్థల నుంచి రూ.లక్షలు బహుమతిగా పొందుతున్నవారిజాబితా చాలాఉంది. చివరకు ఇలాంటి వారికి ఏకంగా ఒక పేరు కూడా పెట్టేశారు. ఆ పేరే 'బగ్‌ హంటర్స్‌'.
ఈ వేటగాళ్లు ఏం చేస్తారంటే..!
గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమేజాన్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, పేపాల్‌, స్నాప్‌డీల్‌... ఇలా ఎన్నో సంస్థలు వెబ్‌సైట్లను కలిగి ఉంటాయి. అవి తమ సైట్లలో రకరకాల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాయి. ఈ సందర్భంగా రూపొదించే ప్రోగ్రామ్స్‌లో కొన్ని సాంకేతికలోపాలుంటాయి. అవి సాధారణ వినియోగదారునికి తెలియవు. వెబ్‌సైట్‌ ప్రోగ్రామింగ్‌.. ఇతర కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు వాటిని గుర్తించగలుగుతారు. ఇలా పొరపాట్లను గుర్తించినపుడు ఆ వివరాలను సదరు సంస్థకు తెలియజేస్తారు. వీరు గుర్తించిన పొరపాటు సరైంది అయితే.. ఆ సంస్థలు కొంత నగదును బహుమానంగా ఇస్తాయి. మరికొన్ని సంస్థలు సదరు అభ్యర్థి ప్రతిభ నచ్చితే కొలువులిస్తాయి. ఇలాంటి వారినే బగ్‌ హంటర్స్‌ అంటారు.
పాకిస్థాన్‌కు చెందిన రఫాయ్‌ బలోచ్‌ అనే వ్యక్తి బగ్‌ హంటింగ్‌తో ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. సగటున ఏడాదికి రూ.10 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. అమెరికా తర్వాత మన మెరికలే ఎక్కువ: ఫేస్‌బుక్‌ నివేదిక ప్రకారం అమెరికా తర్వాత అత్యధిక బగ్‌ హంటర్స్‌ ఉన్నది దేశంలోనే. రెండేళ్లలో 329 మంది భారతీయ హంటర్లకు ఫేస్‌బుక్‌ నగదు బహుమతులు అందజేసింది. తాజాగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన బగ్‌ హంటర్‌ లక్ష్మణ్‌ ముత్తయ్యకు 12,500 డాలర్లు ఇచ్చింది.
భారీ మొత్తాలు..!: ఫేస్‌బుక్‌ భారత్‌లో బగ్‌ హంటర్లను ప్రోత్సహించేందుకు రూ.కోట్లు కేటాయించినట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్‌ అయితే విండోస్‌ 8.1 వెర్షన్‌లో విలువైన పొరపాటు పట్టించేవారికి లక్ష డాలర్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక హెచ్‌పీ కూడా తమ బగ్స్‌ని పట్టుకోగలిగితే వాటి స్థాయిని బట్టి లక్ష డాలర్లు ఇస్తామని చెబుతోంది. ఫేస్‌బుక్‌ ఇప్పటి వరకు 54 దేశాల్లోని బగ్‌ హంటర్స్‌కు రూ.32.86 కోట్లు చెల్లిస్తే.. గూగుల్‌ రూ.7.47 కోట్లు, మొజిల్లా సంస్థ రూ.4.66 కోట్లు చెల్లించాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అడోబ్‌, యాపిల్‌, స్నాప్‌డీల్‌ తదితర సంస్థలు కూడా రూ. కోట్లలో హంటర్లకు బహుమానాలిస్తున్నాయి. గూగుల్‌ అయితే ఎలాంటి పొరపాటు కనిపెట్టినా.. ఒక్కొక్కరికి 500 డాలర్లకు తక్కువ కాకుండా చెల్లిస్తోంది.
ఇది వేరు: బగ్‌హంటింగ్‌.. ఎథికల్‌ హ్యాకింగ్‌ ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు. ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది కేవలం కంప్యూటరు భద్రతా పరమైన అంశాలు, హ్యాకింగ్‌నకు సంబంధించినవే ఉంటాయి. అంటే ఎథికల్‌ హ్యాకర్స్‌ ఒక కంప్యూటరునో లేదా కంప్యూటరు వ్యవస్థనో హ్యాక్‌ చేసి.. తర్వాత సదరు వ్యవస్థ నిర్వాహకులకు ఆ సమాచారం పంపుతారు. ఫలానా లోపం వల్ల తాము మీ నెట్‌వర్క్‌లోకి చొరబడగలిగామని చెబుతారు. వాటికి పరిష్కారమార్గాలూ సూచిస్తారు. కాని బగ్‌ హంటర్స్‌ ఆయా వెబ్‌సైట్లు, సౌకర్యాల్లో లోపాలను మాత్రమే గుర్తించి నివేదిస్తారు.
బగ్‌ హంటింగ్‌ మంచి ప్రవృత్తి. నా సరదా వ్యాపకమే నాకో అదనపు ఆదాయమైంది. ఇది పొరబాటు అని చెబితే సరిపోదు.. అందులో సహేతుకత ఉందని నిర్వాహకులకు నిరూపించాల్సి ఉంటుంది. బగ్‌ హంటింగ్‌ వల్ల మనకు ఆ సంస్థలో ఉద్యోగం కూడా రావొచ్చు. ప్రతిభావంతులైన యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటే లాభసాటిగా కూడా మారుతుంది.
- అరుల్‌ కుమార్‌, చెన్నై
మనం రోజూ అంతర్జాలం చూస్తున్నా.... చాలామందికి ఈ బగ్‌ హంటింగ్‌ గురించి తెలియదు. ఇప్పుడిప్పుడే యువతలో ఈ వ్యాపకం పెరుగుతోంది. ఎథికల్‌ హ్యాకింగ్‌, హ్యాకింగ్‌ తరహాలో ఉన్నా.. వాటితో దీనికి సంబంధం లేదు. ఆయా సంస్థల నుంచి మనకు గుర్తింపు వచ్చే ఒక మంచి పక్రియ ఇది.
- విజ్ఞేష్‌ కుమార్‌,నాగర్‌కోయిల్‌

Posted on 03 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning