శోధిస్తే... శాసించొచ్చు

* వెబ్‌సైట్లే... విజయపు మెట్లు
* విస్తృత‌మవుతున్న వైఫై బోధన
* అందిపుచ్చుకొంటున్న నగర విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: పాఠ్యాంశాల్లో పట్టు సాధించేందుకు, విద్యార్థి దశ నుంచే ఉపాధి పొందేందుకు ప్రణాళికాబద్ధంగా సాగాలి. అందుకోసం అంతర్జాలం అనేక మార్గాలు సూచిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాసు ఆచార్యుల ఉపన్యాసాలు నేడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని అనుసరిస్తూ... చదువులో ముందుకెళ్తే విజయం తథ్యం... అంటున్నారు విద్యావేత్తలు. హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విద్యార్థులు పరీక్షలు, మార్కుల కోసం కాకుండా ఆలోచన, విశ్లేషణాత్మక శక్తిని పెంపొందించుకుని భవిష్యత్తు నిర్ణేతల్లా ఎదగాలని సూచిస్తున్నారు.
* మేల్కొంటేనే గెలుపు..
నగరంలో సుమారు 12 లక్షల మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వారిలో 3 లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులే. యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నిబంధనలతో దేశంలోని అన్ని ప్రధాన విశ్వవిద్యాలయాలు వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దేశంలో దశాబ్దకాలం నుంచి శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న గణనీయమైన మార్పును దృష్టిలో ఉంచుకొని యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని తప్పనిసరి చేసింది. దాంతోపాటు ఆన్‌లైన్‌ కోర్సులనూ అందిస్తుంది. దీనంతటికీ కారణం భిన్నరంగాల్లో రాణించాలనుకునే ఔత్సాహికులు, తరగతి గదికి అదనంగా పాఠ్యాంశాలను నేర్చుకోవాలనే తపన విద్యార్థుల్లో పెరగడం. వారి అభిరుచులకు అనుగుణంగా యూజీసీ, కెరీర్‌ ఎడ్యుకేషన్‌ కార్పొరేషన్‌(సీఈసీ), ఇందిరాగాంధీ జాతీయ దూరవిద్యా కేంద్రం(ఇగ్నో), నేషనల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌(ఎన్‌కేసీ), దూరదర్శన్‌ తదితర సంస్థలు అంతర్జాల విద్యావనరుల విస్తృతికి కృషి చేస్తున్నాయి. ప్రముఖుల బోధనను చిత్రీకరించి వీడియోలతో పాటు, వాటిని అక్షరరూపంలోకి మార్చి పాఠ్యగ్రంథాలను అందిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, గూగుల్‌ వరల్డ్‌లకు సంబంధించిన ఎడెక్స్‌(ఈడీఎక్స్‌) వెబ్‌సైట్‌ 2012 నుంచి నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన విద్యావేత్తల పాఠాలు, సలహాలు, సూచనలు, విశ్లేషణలు అంతర్జాలంలో విద్యావేదికను ఏర్పరచాయి.
చూడాల్సినవి... ఇవీ
* మూక్స్‌(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌) సంప్రదాయ విద్యావిధానానికి అదనంగా సమాచారాన్ని అందిస్తోంది. నిపుణుల ఉపన్యాసాలు, పాఠ్యాంశాలు, స్వయం ఉపాధి వంటి అనేక అంశాలకు సంబంధించిన విషయాలు ఇందులో లభిస్తాయి. సభ్యత్వం తీసుకున్న ప్రతి అభ్యర్థి నిపుణుల వీడియో పాఠాలను అందుకోవచ్చు.
* ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎంఐటీ(మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) వెబ్‌సైట్లో చాలా అంశాలకు సంబంధించిన పరిశోధనలు, జర్నళ్లు అందుబాటులో ఉంటాయి.
* 'ఇన్‌ఫ్లిబ్‌నెట్‌ ఇనిస్ట్యూషనల్‌ రిపాజిటరీ' వెబ్‌సైట్లో రకరకాల పుస్తకాలు, జర్నళ్లు, పరిశోధన పత్రాలుంటాయి.
* 'స్వయమ్‌' విద్యాభివృద్ధి సంస్థ చిన్నపిల్లల్లో ప్రతిభా పాటవాలను పెంపొందించేందుకు పోటీపరీక్షల మెటీరియల్‌, వీడియోల ద్వారా జీవిత లక్ష్యాలను నిర్ణయించుకునేందుకు మనస్తత్వ నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇస్తుంది.
* 'ఖాన్‌ అకాడమీ' ఇంజినీరింగ్‌, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, తదితర అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది.
* ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించిన అధునాతన విషయాలు, సాంకేతికత, తదితర పాఠ్యాంశాలకు సంబంధించిన ఐఐటీ ఆచార్యుల వీడియోలను యూట్యూబ్‌, వెబ్‌సైట్లో ఉంచుతూ 'ఎన్‌పీటెల్‌' ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందింది.
* ఏకలవ్య, జ్ఞాన్‌ వాణి, వ్యాస్‌ వంటి ప్రభుత్వ ఛానెళ్లు ఉన్నత విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి.
* వెనుకబడిన వర్గాల మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు రాయ్‌(ఆర్‌ఏఐ) ఫౌండేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఉపన్యాసాలు, తరగతులు, సమావేశాలు నిర్వహిస్తుంటుంది.
* దిశా నిర్దేశకులుగా ఉండాలి - కృష్ణారావు, ఈఎంఎంఆర్‌ కేంద్రం డైరెక్టర్‌, ఇఫ్లూ
విద్యార్థులు భవిష్యత్తు నిర్దేశకులుగా ఉండాలి. మూసపద్ధతిలో పుస్తకాలను చదివి పరీక్షలు రాస్తే ఉపయోగం ఉండదు. అనవసర పనుల కోసం సమయాన్ని వృథా చేయకూడదు. కాలంతో పరుగులు తీస్తూ... యూజీసీతోపాటు, అనేక విదేశీ వర్సిటీలు, సంస్థలు అందిస్తున్న అంతర్జాల విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలి. పరిశోధనలు, అధ్యయనాలు, సర్వేలకు అవి చాలా ఉపయోగపడతాయి. వాటిని చదవడం, వినడం ద్వారా ఎదుటి వారిని శాసించే స్థాయికి ఎదుగుతారు.
* దూసుకుపోయేందుకు.. - అబ్దుల్లా జక్రియ, ముఫకంజా ఇంజినీరింగ్‌ కళాశాల, నాలుగో సంవత్సరం విద్యార్థి
తరగతి గదిలో విన్న పాఠాలకు అధనంగా నేర్చుకుంటేనే మనం ముందుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమయ్యే కొత్తకొత్త సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మొదటి సంవత్సరం నుంచే నేను ఎన్‌పీటెల్‌ వెబ్‌సైట్‌ వినియోగిస్తున్నా. దానివల్ల అదనపు సమాచారం, లోతైన అంశాలను నేర్చుకొంటున్నా. మా ప్రొఫెసర్లతోపాటు దిల్లీ, ముంబయి ఐఐటీల్లోని నిపుణుల విశ్లేషణలు అందులో ఉంటాయి.
* నిరంతర అధ్యయనం - గిరీష్‌రెడ్డి, ఎంకామ్‌ విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం
బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో సందర్భానుసారంగా విధానాలు మారుతుంటాయి. వాటిని అనుభవం ద్వారానే తెలుసుకోగలం. విద్యార్థి దశలోనే మూక్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆ విషయాలను తెలుసుకోగలిగా. ఉద్యోగాన్వేషణలో ఇలాంటి మెలకువలు ఉపయోగపడతాయి. పాఠాలు, పరీక్షలు, మార్కులు మనల్ని గెలిపించవు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, పట్టుదల, కృషి ఉండాలి.

Posted on 04 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning