పల్లె కుర్రాడు.. జాతీయస్థాయిలో మెరిశాడు

* ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో 19వ ర్యాంకు
* సత్తా చాటిన వ్యవసాయ కూలి బిడ్డ
* ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న శోభన్‌బాబు

ఈనాడు, హైదరాబాద్: పేద కుటుంబంలో పుట్టానని చదువులో రాజీ పడలేదు... పల్లెటూరు వాడినని లక్ష్యాన్ని కుదించుకోలేదు. ప్రతిభతో ర్యాంకులు సాధించి జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షల్లో విజేతగా నిలిచాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(ఐఈఎస్)-2014 లో 19వ ర్యాంకు సాధించి రైల్వే విభాగంలో ఇంజినీరుగా చేరపోతున్నాడు ఓయూలో ఎంటెక్ చేస్తున్న గుండిపూడి శోభన్‌బాబు. ఇతని సొంతూరు నల్గొండ జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని చీదెళ్ల. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారు. కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. శోభన్‌బాబుకు చదువంటే ఆసక్తి. తండ్రి శివలింగయ్య, తాత గోపయ్య బాగా ప్రోత్సహించారు. ఫలితం ఎంసెట్‌లో 2 వేలు ర్యాంకు సాధించి హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్రాంగణంలో బీటెక్ ఎలక్ట్రికల్ బ్రాంచిలో చేరాడు. తర్వాత జాతీయస్థాయిలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్) పరీక్ష రాసి ఓయూలో ఎంటెక్‌లో చేరాడు.
* ట్యూషన్లు చెబుతూ బీటెక్...
జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్‌లో చేరిన తర్వాత ఫీజుల కోసం హోం ట్యూషన్లు చెప్పాడు. ఉదయం, సాయంత్రం పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి పదో తరగతి, ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. అలా వచ్చిన డబ్బులతో ఫీజులకు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేవాడు. చాలా మంది స్నేహితులు తన చదువు కోసం సహాయం చేశారని శోభన్‌బాబు చెబుతున్నాడు.
* 589 మందిలో ఒకడు..
ఒకవైపు ఎంటెక్ చదువుతూనే ఐఈఎస్‌కు పరీక్ష రాశాడు. దేశవ్యాప్తంగా సుమారు 3.20 లక్షల మంది దరఖాస్తు చేశారు. అయిదు ప్రశ్నపత్రాలుంటాయి. మూడు రోజులపాటు పరీక్ష నిర్వహిస్తారు. చాలా మంది మధ్యలో వదిలేసి వెళ్తారు. ఈ పరీక్ష సుమారు లక్షన్నర మంది రాశారు. ఎలక్ట్రికల్ బ్రాంచి నుంచి 30 వేల మంది హాజరయ్యారు. మొత్తం లక్షన్నర మందిలో 2 వేల మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. చివరకు అన్ని బ్రాంచీలకు కలిపి 589 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు 110 మంది ఎంపికయ్యారు. వారిలో శోభన్‌బాబు 19వ ర్యాంకులో నిలిచాడు. ఈ ర్యాంకుతో గ్రూపు-ఏ పోస్టు అయిన రైల్వే ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఉద్యోగం దక్కనుంది. ఐఈఎస్‌లో ర్యాంకు, శిక్షణలో ప్రతిభ ఆధారంగా పోస్టింగ్ కేటాయిస్తారు. తన లక్ష్యం సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్‌కు ఎంపిక కావడమేనని శోభన్‌బాబు ధీమాగా చెప్పాడు.
విద్యా పయనం ఇలా..
* 8-10వ తరగతి: నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్ (10వ తరగతిలో 561 మార్కులు)
* ఇంటర్‌మీడియట్: వరంగల్ ఎస్‌వీఎస్ (మార్కులు 971 )
* ఎంసెట్ ర్యాంకు: 2000
* బీటెక్: జేఎన్‌టీయూహెచ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (మార్కులు 77 శాతం)
* గేట్ ర్యాంకు: 1000
* ఎంటెక్: ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో పవర్ సిస్టమ్స్‌లో రెండో సంవత్సరం.

Posted on 06 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning