ఒక్క ఆలోచన కోట్ల ఖరీదు

* ఔత్సాహికుల ప్రోత్సాహంలో ముందడుగు
* కొత్త కంపెనీలకు ఆర్థిక అండదండలు
* ఐటీ పరిశ్రమ పురోగతికి కీలక చర్యలు

ఈనాడు - హైదరాబాద్‌: సాంకేతిక రంగంలో కొత్త ఆలోచనకు రూపం ఇచ్చి దాన్ని వ్యాపారంగా అభివృద్ధి చేసే ధోరణి పుంజుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రయోగాలు చేసే కొత్త కంపెనీలు (స్టార్టప్‌లు) వస్తున్నాయి. లక్షలాది ఉద్యోగాల కల్పనకు ఇటువంటి కంపెనీలకు ప్రాణం పోసే ఇంక్యుబేషన్‌ కేంద్రాలు పెరగాలి. కొత్త కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రారంభ మూలధనం, నిబంధనల అవరోధాలను తొలగించాలి. - బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్న మాటలివి.
ఇందుకు అనుగుణంగానే ప్రారంభం కంపెనీలు, వాటికి ప్రాణం పోసే ఇంక్యుబేషన్‌ కేంద్రాల అభివృద్ధికి సాంకేతిక-ఆర్థిక ఇంక్యుబేషన్‌ కార్యక్రమం- 'స్వయం ఉపాధి, నైపుణ్య వినియోగం' (ఎస్‌ఈటీయూ)ను బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకు రూ.1,000 కోట్లు కేటాయించారు. రాయల్టీ పన్నును 25% నుంచి 10 శాతానికి తగ్గించారు. అయితే.. ఇప్పటికే ప్రారంభ కంపెనీల ప్రాధాన్యాన్ని గుర్తించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఇంక్యుబేషన్‌ కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలు ఇక్కడ మరిన్ని కొత్త కంపెనీల (స్టార్టప్‌లు) ఆవిర్భావానికి దోహదం చేయగలవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సాంకేతిక రంగంలో కొత్త వ్యాపార ఆలోచనలకు రూపమిచ్చి కోట్ల రూపాయల ఖరీదు చేసే సంస్థను ఏర్పాటు చేసేందుకు, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీ-హెచ్‌), బిట్స్‌ పిలానీ, హైదరాబాద్‌ ప్రాంగణంలో ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 'టి-హబ్‌' పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో ఇది ఐఐఐటీ-హెచ్‌ ప్రాంగణంలో జూన్‌ నాటికి ప్రారంభం కానుంది. జూన్‌ నాటికి టి-హబ్‌ భవనం సిద్ధం అవుతుందని, ప్రస్తుతం ఐఐఐటీ-హెచ్‌ ఇంక్యుబేటర్‌లో ఉత్పత్తి అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లు కూడా ఇందులోకి వెళతాయని ఐఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ పి.జె.నారాయణన్‌ తెలిపారు. తమ ఇంక్యుబేటర్‌ 'సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌'లో ప్రాంగణ విద్యార్థులకే కాక బయట వారికి కూడా అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. రెండో దశలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసే సదుపాయాలు అందుబాటులోకి వస్తే 'టి-హబ్‌'లో దాదాపు 1,000 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కావలసిన సదుపాయాలు ఉంటాయి. ప్రారంభం కంపెనీలకు నిధులు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ప్రారంభంలో రూ.300 కోట్లతో జూన్‌ 2 నాటికి దీన్ని సిద్ధం చేయనున్నారు.
* తొలి కార్పొరేట్‌ ఇంక్యుబేటర్‌..
ఇవి కాక కొన్ని ప్రధాన ఇంజినీరింగ్‌ కాలేజీలు కూడా ఇంక్యుబేషన్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకూ విద్యా సంస్థల్లోనే ఇంక్యుబేటర్లు ఉంటే.. అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇటీవల హైదరాబాద్‌లో తొలి కార్పొరేట్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో 7-9 వరకూ ఇంక్యుబేటర్లు ఉన్నాయని ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ఎండీ రమేశ్‌ లోకనాథన్‌ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 300 కంపెనీలు ఉన్నాయి. 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎగుమతులు రూ.64 వేల కోట్లకు చేరనున్నాయి. అయితే.. ఒకప్పుడు పరిశ్రమ వృద్ధి రేటు 100 శాతానికి పైగా ఉండేది. ఇప్పుడు 12-15 శాతానికి పడిపోయింది. పరిశ్రమను రెండో దశ వృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలంటే ఉత్పత్తులను అభివృద్ధి చేసే కొత్త కంపెనీలు రావాలని ప్రధాన ఐటీ కంపెనీకి చెందిన హైదరాబాద్‌ కేంద్రం అధిపతి ఒకరు అన్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కొత్త కంపెనీల అభివృద్ధి దోహదం చేయగలవని వివరించారు. వాస్తవానికి పరిశ్రమను ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే ఒరాకిల్‌, సీఏ, మైక్రోసాఫ్ట్‌ వంటి బహుళ జాతి ఉత్పత్తి కంపెనీలు ఇక్కడకు వచ్చాయి. ఆ తర్వాతే సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఉత్పత్తులను అభివృద్ధి చేసే కొత్త కంపెనీలు అవిర్భవించడానికి అన్ని రకాల సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, కొత్త కంపెనీలకు మొదటి చిరునామా ఇంక్యుబేటర్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో స్టార్టప్‌ల అభివృద్ధికి నాస్‌కామ్‌, ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై), హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా), ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), ఐఐఐటీ-హైదరాబాద్‌ తదితరాలు కలిసి పని చేస్తున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం..
విద్యార్థులను సాంకేతిక రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్టార్టప్‌ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. రుషికొండలో స్టార్టప్‌ గ్రామాన్ని అభివృద్ధి చేసి వచ్చే అయిదేళ్లలో 500 నుంచి వెయ్యి స్టార్టప్‌లకు ప్రాణం పోయాలని భావిస్తోంది. ఇందుకు గత ఏడాది నవంబరులో మాబ్‌మీ వైర్‌లెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే స్టార్టప్‌ విలేజ్‌లో దాదాపు 50 స్టార్టప్‌లు ఉత్పత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Posted on 07 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning