ఇలా వేసుకోండి.. ఇంజినీరింగ్‌ రహదారి!

ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు విజయవంతంగా విద్యాభ్యాసం కొనసాగించటానికి కొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి; ఆచరించాలి. అవేమిటి? ఎలా?
ఇంజినీరింగ్‌లో ప్రతి విద్యార్థీ అన్ని బ్రాంచీల గురించి కొంతైనా తెలుసుకోవాలి. తన బ్రాంచి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. కేవలం సిలబస్‌కే పరిమితం కాకూడదు. దిన, వారపత్రికలూ, విజ్ఞానశాస్త్ర సాంకేతిక మ్యాగజీన్లలో ప్రచురించే ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా గ్రహించాలి. డైరీలో ఆ విషయాలను వివరంగా రోజూ రాసుకోవాలి. 'నేను- నా బీటెక్‌' అనే ధోరణి మాని 'నేను- సంపాదిస్తున్న పరిజ్ఞానం; ప్రజాశ్రేయానికి ఎలా ఉపయోగించాలి' అనే ఆలోచనలతో ఉత్సాహం పెంచుకోవాలి.
సిలబస్‌ను అశ్రద్ధ చేయకుండా తరగతిలో చెప్పే రోజూ పాఠాల్లో గ్రహించిందేమిటో, ఏం అర్థం కాలేదో అది తెలుసుకుంటూ తోటి స్నేహితులతో సబ్జెక్టు గురించి చర్చించాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రయోగశాలలో చేయబోయే ప్రతి ప్రాక్టికల్‌ గురించీ ముందే చదువుకుని వెళ్లాలి.
ఇంజినీరింగ్‌ ప్రతి సబ్జెక్టులో ప్రతి పేజీ మొత్తం చదవాలి. పేజీల్లో ముఖ్యం, అతి ముఖ్యం అనే గుర్తులు పెట్టొద్దు. ఎందుకంటే ప్రతిదీ ముఖ్యమే. ప్రశ్న- జవాబు పద్ధతిలో అసలు చదవకూడదు. పాఠం మొత్తం చదివి, నేర్చుకుని, పాఠ్యాంశాన్ని గుర్తించి, ప్రశ్నలు- జవాబులు సొంతంగా తయారు చేసుకోవాలి. ఇలా శ్రద్ధగా నేర్చుకున్నవే ఉద్యోగ జీవితంలో ఉపయోగపడతాయి.
ఉద్యోగపర్వం
అభ్యర్థులు ఒకవేళ ఏర్‌ బస్‌/ బోయింగ్‌/ తదితర సంస్థల్లో ఇంటర్వ్యూ దాకా వెళితే..
'విమానం ఎలా ఎగురుతుంది?'; 'అలా ఎగరడానికి ఏమేం ఉపయోగిస్తారు?' అనే జనరల్‌ ప్రశ్నలు వేయరు.
'జనరేటర్‌ ఉపయోగం ఏంటి?'; 'నేర్చుకున్న కంట్రోల్‌ సిస్టంలో ఫీడ్‌బ్యాక్‌ లూప్‌ గురించి చెప్పండి'; కమ్యూనికేషన్లో నేర్చుకున్న ఫ్రీక్వెన్సీ బాండ్‌ల గురించి చెప్పండి' 'రాడార్‌ల గురించి చెప్పండి, ఈ పనిముట్లను వేటికి, ఎప్పుడు, ఎలా వాడతారు?' వంటి నిర్దిష్ట ప్రశ్నలు అడుగుతారు.
విద్యార్థిగా మీదే కోవ?
విద్యార్థులు నాలుగు రకాలు. తరగతిలో పాఠం విన్నాక ఇలా ఉంటారు.
* 'ఓహో అదా సంగతి' అనుకుని ఆపేస్తారు.
* ఇప్పటిదాకా ఇది చెప్పారు. ఇక ముందు ఏం చెబుతారో అనే ఉత్సాహంతో ఉండేవారు.
* 'ఇది ఇలాగే ఎందుకవాలి? అలా కూడా ఎందుకు కాకూడదు'- అని పాఠం విన్నాక ప్రశ్నించుకునే విద్యార్థులు. (ఈ రకం వారు పరిశోధన విభాగం (R&D)లో రాణిస్తారు)
* అంతా విన్నాక, ఇప్పటిదాకా ఏం చెప్పారు? అనేవాళ్లూ ఉంటారు. ఇలాంటివారు మొదటి జాబితాలోకి చేరేలా ప్రయత్నం చేయాలి.
పరస్పర సంబంధం
బీటెక్‌ మూడో సంవత్సరం కంట్రోల్‌ సిస్టం ఒక సబ్జెక్టు. అందులో ముఖ్యమైన అంశం: ఫీడ్‌బ్యాక్‌ సిద్ధాంతం. కంట్రోల్‌ సిస్టమ్‌ సబ్జెక్టులో ఫీడ్‌బ్యాక్‌ పద్ధతిని పక్కనున్న చిత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

పరిశ్రమలు, రాకెట్లు, విమానాలు, ఓడలు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ప్రతి భాగంలో కొన్ని కంప్యూటర్లు, వాటితో ప్రాసెసర్లు ఉంటాయి. అవుట్‌పుట్‌ ఎంత కావాలో, ఎంత రావాలో ఆర్‌&డీ ఇంజినీర్లు నిర్ణయించి దాని ప్రకారం ఇన్‌పుట్‌ను కంప్యూటర్లకు పంపిస్తారు. కంప్యూటర్ల ప్రాసెసర్లు ఎలా ఇన్‌పుట్‌ను మార్పు చెందించాలో గణించి ఆ మారిన సిగ్నళ్లను అవుట్‌పుట్‌కు పంపిస్తాయి. అవుట్‌పుట్‌ అంటే మోటార్లు, హైడ్రాలిక్స్‌ జాక్స్‌, లివర్లు, మెకానికల్‌ మూవర్స్‌, లిఫ్ట్‌లు, ఎలివేటర్లు, ఎస్క్‌లేటర్స్‌ తదితరమైనవి కదల్చడానికి ఉపయోగిస్తారు. కానీ, అవి సరైన స్థానానికి చేరాయా, కదిలాయా, మొదలైన మార్పులు ఫీడ్‌బ్యాక్‌ సర్క్యూట్ల ద్వారా ఇన్‌పుట్‌కు పంపుతారు. అలా ఇన్‌పుట్‌ కావాల్సిన అవుట్‌పుట్‌ వచ్చేదాకా ఫీడ్‌బ్యాక్‌ సిగ్నళ్లను వాడుతుంది.
ఇలా పుస్తకాల్లో విశదీకరించిన అనేక విషయాలు బీటెక్‌ తరువాత చేరబోయే ఉద్యోగాల్లో తారసపడతాయి. కాబట్టి పుస్తకాన్ని పుస్తకంగా కాకుండా దానిలో ఉన్న పాఠాల ద్వారా వాస్తవానికి చేరువవుతూ, అన్వయించుకుంటూ చదవాలి.
బీటెక్‌ సబ్జెక్టునే కొద్దిమార్పులతో పరిశ్రమల్లో, విద్యుత్కేంద్రాల్లో, ప్రయాణసాధనాల్లో, రాకెట్లలో, ఇంకా ఎన్నోచోట్ల వాడుతున్నారని గ్రహించవచ్చు.

Posted on 09 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning