ఐటీ పరుగులు తీస్తుంది !


 • * ఖాతాదారులు ఖర్చు పెంచుతున్నారు
  * క్లౌడ్‌, మొబిలిటీ లాంటి విభాగాల్లో మంచి అవకాశాలు
  * వచ్చే ఆర్థిక సంవత్సరం 25 వేల మందికి అవకాశం: టీసీఎస్‌ ఎండీ చంద్రశేఖరన్‌

  న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానంపై ఖాతాదారుల ఖర్చు పెరుగుతున్నందున రానున్న కాలం ఐటీకి మరింత మెరుగ్గా ఉండగలదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) భావిస్తోంది.
  అమెరికా, యూరప్‌లలో ఐటీపై వ్యయాలు పెంచుతున్నారు.

  క్లౌడ్‌, మొబిలిటీ, బిగ్‌ డేటా లాంటి సాంకేతిక పరిజ్ఞానాలకు గిరాకీ పుంజుకుంటోంది, ఈ పరిణామాలు కంపెనీకి మేలు చేయగలవని టీసీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), సీఈఓ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. డిజిటల్‌ విభాగంలో వృద్ధి ఏటికేడాది పెరుగుతోందన్నారు. 'ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ కంపెనీకి బాగానే ఉంది. ఏడాది ప్రారంభంలో 45,000 మందిని నియమించాలని భావించగా.. ప్రథమార్ధంలో (ఏప్రిల్‌-సెప్టెంబరు) 50 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) 25,000 మందికి ఉద్యోగావకాశం కల్పించాలని యోచిస్తున్నాం' అని చంద్రశేఖరన్‌ చెప్పారు. కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని భౌగోళిక ప్రాంతాలు, విభాగాల్లో వృద్ధి ఉందని, రానున్న సంవత్సరాల్లో ఖాతాదారుల విచక్షణాత్మక వ్యయం పెరగగలదని వివరించారు. ఖాతాదారుకు, కంపెనీకి మధ్య ఉండే ప్రధాన కాంట్రాక్టుకు అదనంగా ఖాతాదారులు ఆలోచించి చేసే వ్యయాన్ని విచక్షణాత్మక వ్యయం అంటారు. ఇది ఖాతాదారుల ఖర్చు చేయగల శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇంకా ఏమన్నారంటే..

  * సామాజిక, మొబైల్‌, ఎనలిటిక్స్‌, క్లౌడ్‌ (స్మాక్‌) టెక్నాలజీస్‌ పుంజుకుంటున్నాయి. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో కోట్ల డాలర్ల ఆదాయాలు ఈ విభాగం నుంచి కంపెనీకి రాగలవు.

  * ఖాతాదారులతో చర్చించిన దాన్ని బట్టి 2013-14 కంటే 2014-15 మెరుగ్గా ఉండగలదని భావిస్తున్నాం. రిటైల్‌, వినియోగ వస్తువులు, సేవలు, ఔషధ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహా ఆన్ని రంగాల్లో వృద్ధి ఉండగలదు.

  * వలస సంస్కరణలపై తుది బిల్లు వచ్చే వరకూ దాని ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేం. కరెన్సీ ఒడుదొడుకులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం మొదలైన వాటి ప్రభావాన్ని కూడా కచ్చితంగా అంచనా వేయలేం.

  * భారత్‌లో ఒడుదొడుకులు కొనసాగుతునే ఉంటాయి. ఎన్నికల సమీపిస్తున్నందున ఐటీ వ్యయంలో జాప్యం జరుగుతుంది.

  * కాంట్రాక్టు రిన్యూవల్‌కు వస్తే.. ఖాతాదారులు యథాతథంగా కాంట్రాక్టు ఇవ్వడం లేదు. దాన్ని చిన్న, చిన్న కాంట్రాక్టులుగా విభజించి బిడ్లను ఆహ్వానిస్తున్నారు. ఈ ధోరణి ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

  * దాదాపు అన్ని రకాల సేవలపై వసూలు చేసే ధరలు స్థిరంగా ఉండగలవు. అయితే.. క్లిష్టమైన సేవలపై ధరలు పెరిగే వీలుంది.

  * రానున్న సంవత్సరాల్లో వ్యాపార పరిమాణం బాగా పెరగడానికి అవకాశం ఉంది. నిర్వహణ మార్జిన్లు సగటున 27 శాతం ఉండొచ్చు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning