చేతల్లో నైపుణ్యం... మాటల్లో చాతుర్యం... ఇక ఉద్యోగం మీదే

* నైపుణ్యాన్ని నవీకరించుకోండి
* పట్టు వీడక ప్రయత్నించండి
* ఈనాడు 'వెబినార్'లో నిపుణులు

ఈనాడు, హైదరాబాద్: చేతిలో పట్టా ఉన్నా ఓ పట్టాన ఉద్యోగం రాదే... అని చింతించొద్దు... ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా కొలువు దక్కడం లేదే అని బాధపడొద్దు... అనుభవం లేక కోరుకున్న సంస్థలో చేరలేకపోయానే అని మదనం వద్దే వద్దు... నైపుణ్యాలకు నిరంతరం సానపెట్టుకుంటూ... పట్టువీడక ప్రయత్నిస్తే జాబును సులువుగా కొట్టొచ్చంటున్నారు నిపుణులు. టీసీఎస్ ప్రాంతీయ అధిపతి రాజన్న, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం పరిపాలనాధికారి ఆచార్య ఎన్వీ రమణారావు, టాలెంట్ స్ప్రింట్ అధ్యక్షుడు రోణంకి మధుమూర్తి మార్చి 12న జరిగిన 'ఈనాడు-వెబినార్‌'లో పాల్గొని విద్యార్థుల సందేహాల్ని సవివర సమాధానాలతో పటాపంచలు చేశారు. భవిష్యత్తును బంగారు మయం చేసుకునేందుకు ఇంకా ఏమేం సూచనలు ఇచ్చారో.. చూద్దామా..
ఐటీలో అవకాశాలు అపారం - రాజ‌న్న‌, టీసీఎస్ రీజిన‌ల్ హెడ్‌
ఐటీరంగంలో ఉద్యోగార్థులకు అవకాశాలు పుష్కలం. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరారు. వీరిలో 33 శాతం మహిళలు ఉన్నారు. ఈ నెల 31తో ముగిసే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ వృద్ధి 12 నుంచి 15 శాతంగా ఉంది. మార్కెట్ పరంగా చూస్తే 146 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉండబోతోంది. వృద్ధిరేటు 13 శాతంగా అంచనా వేస్తున్నాం. ఈ వృద్ధి నమోదు కావాలంటే కొత్తగా ఉద్యోగులు చేరితేనే సాధ్యం. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు ఎప్పుడూ అవకాశాలు అపారం. రెండు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. దేశంలోనే టీసీఎస్ అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత ఉండటమే.
* దేశవ్యాప్తంగా 35 లక్షల మంది ఐటీ ఉద్యోగాలతో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఇందుకు నాలుగు రెట్లు భద్రత, సౌకర్యాల కల్పన(హౌస్ కీపింగ్), నిర్మాణ పరంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. వీరు ఓ కోటి మంది వరకు ఉంటారు.
* 146 బిలియన్ డాలర్ల మార్కెట్‌లో 70 శాతం ఎగుమతులు ఉన్నాయి. బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఎగుమతులతో తొలిసారి మన దేశం 100 బిలియన్ డాలర్ల మార్కును దాటబోతున్నాం.
* ఐటీలో దేశీయ వాటా 30 శాతం. కేంద్రం స్మార్ట్ సిటీలను ప్రకటించడం, రెండు తెలుగు రాష్ట్రాలు సామాన్యులకు సాంకేతికత అందుబాటులోకి తీసుకు రాబోతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. పాస్‌పోర్ట్ దరఖాస్తులు, ఆరోగ్యశ్రీ సేవల్లో ఐటీ వినియోగంతో పదేళ్లకు ఇప్పటికీ వచ్చిన మార్పులను గమనిస్తే రాబోయే రోజుల్లో ఈ తరహా మరిన్ని సేవలను ప్రజలకు చేరువ కావాల్సి ఉంది.
ఆఖరి ఏడాది చదివేవారు
* 2016-17లో ఇంజినీరింగ్ పూర్తి చేసేవారికి మరో ఏడాది సమయం ఉంది. క్యాంపస్ నియామకాలకు సన్నద్ధం అయ్యేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
* ముందు బ్యాక్‌లాగ్ సబ్జెక్ట్‌లను పూర్తి చేయాలి.
* ప్రాంగణ నియామకాల్లో 400 మందిలో 50 మంది వరకే ఎంపికకు అవకాశాలు ఉంటాయి. మొదటగా మీరు ఆ 50 మందిలో ఉన్నారో లేదో చూసుకోండి.
గ్లోబల్ ప్రొఫెషనల్స్‌గా...
ఐటీ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు గ్లోబల్ ప్రొఫెషనల్స్‌గా మారేందుకు సన్నద్ధం కావాలి. హైదరాబాద్‌లో ఉద్యోగం అని కాకుండా ఎక్కడైనా పని చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. పోటీపడితే ఉద్యోగం పొందగలుగుతారు. అందుకు ప్రధానంగా ఏడు అంశాలపై దృష్టిపెట్టాలి. అవి:
1. కరిక్యులమ్‌తో కాంపిటెంట్‌గా చేయాలి
2. ఒకటి రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల్లో నైపుణ్యం
3. కోర్ సబ్జెక్టుపై పట్టు
4. జనరల్ నాలెడ్జి కరెంట్ అఫైర్స్‌పై అవగాహన
5. కంపెనీలో ఇంటర్న్‌షిప్‌నకు ప్రయత్నించడం
6. కంపెనీల నాలెడ్జి పోర్టళ్లను సద్వినియోగం చేసుకోవడం
7. ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాలకు సన్నద్ధమవడం.
మూడు అంశాలపై దృష్టిపెట్టాలి..
పాఠ్యాంశాలను(కరికుల్యమ్)ను విమర్శిస్తుంటారు చాలామంది. అందులో ఎలాంటి సమస్యలూ లేవు. విద్యార్థులు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి. కాంపిటెండ్‌గా ఉండాలి.
1. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగా సమస్యలు ఉంటున్నాయి. మీరు నేర్చుకునే సి, సి++, జావా... ఏ లాంగ్వేజ్ అయినా అందులో ఛాంపియన్ కండి.
2. సబ్జెక్ట్ పరంగా... మీరు చదివిన కోర్సును బట్టి ఒకటి రెండు సబ్జెక్టుల్లో పట్టు సాధించండి.
3. భాషా(కమ్యూనికేషన్) నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఆంగ్లంపై పట్టుండాలి.
ఎక్కడెక్కడ?
* డిజిటల్
* మొబిలిటీ
* క్లౌడ్
* డాటా సర్వీసెస్
* సోషల్ నెట్‌వర్కింగ్
* ఇంజినీరింగ్ సర్వీసెస్
* ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్
* ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్
* అస్యూరెన్స్ సర్వీసెస్
* సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
* బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్
* ఆటోమేషన్
ప్రయత్నం చేయడమే..
ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేదని చాలామంది దిగులు చెందుతుంటారు. నిరాశ వద్దు. లోపాలను సవరించుకుని మళ్లీ ప్రయత్నించడమే ముఖ్యం. క్యాంపస్‌లో చేజారితే.. ఆఫ్ క్యాంపస్ ఎంపికలు ఉంటాయి.
* వాస్తవానికి ప్రాంగణ నియామకాల్లో 40 నుంచి 50 కళాశాలల్లోనే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్రాంగణేతర నియామకాల్లోనే పోటీ పడాల్సి ఉంటుంది. టీసీఎస్ విషయానికి వస్తే క్యాంపస్ కమ్యూనిటీ ఉంది. అందులో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రయత్నాలు కొనసాగించవచ్చు.
ఏం చూస్తారు..?
ప్రాంగణ నియామకాల్లో మూడు రౌండ్లు... టెక్నికల్, హెచ్ఆర్, మేనేజ్‌మెంట్ రౌండ్(ఎం.ఆర్) ఉంటాయి.
* టెక్నికల్‌గా రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఒకటిరెండు లాంగ్వేజ్‌లలో పూర్తి పట్టు సంపాదిస్తే ఎదుర్కోవడం సులువు. కోర్ సబ్జెక్టులో నైపుణ్యం ఉండాలి. వీటిలో మీ ప్రతిభను పరీక్షిస్తారు.
* హెచ్.ఆర్., మేనేజ్‌మెంట్ రౌండ్‌లో ఉద్యోగార్థి దృక్పథాన్ని పరిశీలిస్తారు. ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? కొత్త విషయాలను తెలుసుకునే చొరవను తరచి చూస్తారు.
ఏ బ్రాంచి... ఏం నేర్చుకోవాలి?
* సాఫ్ట్‌వేర్, ఐటీ ఉద్యోగాలకు...
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్, అనటికల్ స్కిల్స్, ఏదైనా కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడం, ఉద్యోగానికి కావాల్సిన ఇతర నైపుణ్యాలు
* కోర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు
ఈసీఈ: ఈసీఈ బేసిక్స్‌పై పట్టు, మ్యాట్‌లాబ్, హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్(హెచ్‌డీఎల్) లాంటి ప్రత్యేక నైపుణ్యాలు, హెచ్ఎఫ్ఎస్ఎస్, యాన్సిస్, ల్యాబ్‌వ్యూ లాంటి కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్, ఇంటర్న్‌షిప్, ప్రాక్టికల్స్ పరిజ్ఞానం
మెకానికల్: మెకానికల్ ఇంజినీరింగ్ బేసిక్స్, మ్యాట్‌ల్యాబ్, యాన్సిస్, క్యాడ్, క్యామ్ లాంటి సాఫ్ట్‌వేర్లపై ప్రత్యేక స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రాక్టికల్స్‌లో పరిజ్ఞానం
సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు: సివిల్స్ ఇంజినీరింగ్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టు(బేసిక్స్), క్యాడ్ సాఫ్ట్‌వేర్‌లో మంచి పరిజ్ఞానంతో ఆర్కిటెక్చర్, హైవే, ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఈఎం, హైడ్రాలిక్స్‌పై పరిజ్ఞానం
ఈఈఈ: మూలాలపై పట్టు, మ్యాట్‌ల్యాబ్, హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్(హెచ్‌డీఎల్), పీఎల్‌సీస్, పవర్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌వీ ఇంజినీరింగ్ తదితర ప్రత్యేక నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్ చేసి ఉండటం తదితర. ఇతర బ్రాంచీలకూ ఇదేవిధంగా నైపుణ్యాలు సంపాదించుకోవాలి.
బ్యాంకు, బీమా కంపెనీల్లో ఉద్యోగాలకు...
* జనరల్ నాలెడ్జి
* లాజికల్ రీజనింగ్
* మ్యాథమేటికల్ స్కిల్స్
* అనటికల్ స్కిల్స్
బోధనా వృత్తిలో....
* కనీస విద్యార్హత అయిన ఎంటెక్, ఎంఈ, పీజీ
* పీహెచ్‌డీ(ఉంటే ప్రాధాన్యం)
* పరిశోధనా పత్రాలు తగినంతగా ఉండేలా చూసుకోవాలి
* పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండటం/వాటిలో పనిచేసి ఉండటం
* కార్యశాలలు, సదస్సులకు హాజరు కావడం/వాటిని నిర్వహించడం
* తన సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం సంపాదించడం
కనీస నైపుణ్యాలుంటే అందరికీ కొలువులు - ఆచార్య ఎన్‌వీ రమణారావు, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూహెచ్
పరిశ్రమకు అవసరమైన కనీస అర్హతలు ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అయితే కనీస నైపుణ్యాలు తప్పనిసరి. ఐటీ కారణంగా భారత్‌లో దశాబ్ద కాలంలో ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరిగాయి. పలు బహుళజాతి ఐటీ కంపెనీలు 2015లో చదువు పూర్తిచేసుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాంగణేతర నియామకాలు చేపడుతున్నాయి. వారాంతాల్లో వాటిని నిర్వహిస్తాయి.
జీవితాన్నిచ్చే కార్యక్రమమిది - చిట్టంపల్లి సత్యేంద్ర, బీటెక్ విద్యార్థి, వరంగల్.
ఇదివరకు నేను రెండు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఎంపిక కాలేదు. 'ఈనాడు వెబినార్ ద్వారా నాలో ఉన్న కొన్ని లోపాల్ని సరిచేసుకునే అవకాశం దొరికింది. సందేహాలకు సమాధానాలు దొరికాయి. నేనడిగిన ప్రశ్నకు, ఇతరులు అడిగిన వాటికి నిపుణులు చెప్పిన సమాధానాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ స్ఫూర్తితో మరికొంత కసరత్తు చేస్తాను. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించగలనన్న భరోసా నాలో కలిగింది. నాలాంటి వారికి జీవితాన్నిచ్చే కార్యక్రమం ఇది.
మరో గంట పొడిగిస్తే బాగుండేది - నౌడూరి పూజిత, బీటెక్, అయోధ్యనగర్, విజయవాడ.
బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ చదవాలా? ఉద్యోగంలో చేరాలా? అనే సందిగ్ధానికి గురయ్యా. నిపుణుల సూచనలతో స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈసీఈ, ఈఈఈ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే క్రమంలో ఎదురవుతున్న అనుమానాల్ని నివృత్తి చేసుకున్నా. నిపుణుల్ని నేరుగా కలిసి, మాట్లాడటం మాలాంటి వారికి కొంచెం కష్టమే. 'ఈనాడు వెబినార్ ద్వారా ఆ అవకాశం కలిగింది. సమయం సరిపోక పోవడం వల్ల కొన్ని ప్రశ్నలు అడగలేకపోయాం. మరో గంట పొడిగించి ఉంటే బాగుండేది.
సూచనలు బాగున్నాయ్ - పి.వై.ఎస్ పవన్ శ్రీనివాస్, బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) అగనంపూడి.
ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలో చెబుతూ వెబినార్‌లో నిపుణులు ఇచ్చిన సూచనలు బాగున్నాయి. జాబ్ రిలవెంట్ కోర్సులపై దృష్టి పెట్టడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవాలని చెప్పారు. నాన్ ఐటీ రంగంలో ఆటో కేడ్, మెట్‌లాబ్ వంటి కోర్సులతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ సూచనలన్నీ నిరుద్యోగులకు బాగా ఉపయోగపడతాయి.
ఆనందాన్ని కలిగించింది - మీనాక్షి, వైజాగ్.
'ఈనాడు వెబినార్‌లో పాల్గొనడం ఆనందాన్ని కలిగించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో నిష్ణాతులైన నిపుణుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడం, ఉద్యోగ సాధనకు దోహదపడే అవకాశాల గురించి తెలుసుకోగలిగాను. నిపుణుల సూచనలు పాటించి సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువు దక్కించుకునేలా ప్రయత్నం చేస్తాను.
వెబినార్‌లో విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నిపుణులు సమాధానాలిచ్చారు. వాటిని చూద్దాం..
1. నేను 2013లో 70 శాతం మార్కులతో బీటెక్(ఐటీ) ఉత్తీర్ణత సాధించా. ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నా. ఎలాంటి కోర్సులు చదివితే నాకు సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది? - రుషి
జ. బీటెక్ అనంతరం ఎంబీఏ చదివిన వారు... కాస్త నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఎదురుచూస్తోంది. సేల్స్, బిజినెస్ డెవలెప్‌మెంట్, బిజినెస్ అనలిస్ట్, టెస్టింగ్ తదితర ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం 100 మందికి ఇదే రంగంలో ఉద్యోగాలు లభిస్తుంటే అందులో 60 మందికి ప్రోగ్రామింగ్... క్యూ అండ్ ఏ, టెస్టింగ్ విభాగాల్లో 30 మందికి... మిగిలిన వారికి పైన పేర్కొన్న వాటిల్లో అవకాశం లభిస్తోంది. భవిష్యత్తులో శాప్‌దే ఆధిపత్యం. అందుకే మొదటగా అందులో ప్రావీణ్యం సాధించండి. శాప్(ఎస్ఏపీ) వంటి కోర్సులను చేసిన వారికి పెద్ద పెద్ద సంస్థలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి.
2. దాదాపుగా అన్ని సంస్థలు పని అనుభవం ఉంటేనే అవకాశమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఫ్రెషర్స్‌కు ఎక్కువగా అవకాశాలను ఇచ్చే సంస్థలను సూచించగలరు? - శివకుమార్
జ. ఉద్యోగం చేస్తేనే అనుభవం వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ప్రాంగణేతర నియామకాల్లో ఎక్కువ మంది మీరు ఎదుర్కొంటున్న సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే ముందు మంచి ఫినిషింగ్ స్కూల్లో చేరి.. వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులపై పని చేయాలి. అలా వచ్చే పని అనుభవంతో పెద్ద సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఈఈ చదివిన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) రంగంలో లభిస్తున్నాయి. ఇందులో రోజురోజుకూ అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అటువైపు దృష్టి సారించండి.
3. నేను 2011లో 67.31 శాతం మార్కులతో బీటెక్(ఐటీ) పూర్తి చేశా. నాకు ప్రోగ్రామింగ్‌లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నా.. గేట్ పరీక్ష కారణంగా ప్రాంగణ నియామకాలకు హాజరు కాలేదు. కళాశాల నుంచి బయటికి వచ్చాక ప్రయత్నాలు చేసినా ఎక్కడా ఉద్యోగం లభించలేదు. సలహాలు, సూచనలు ఇవ్వగలరు? - సరిత
జ. మీరు 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రాంగణేతర నియామకాల్లో 2014, 2015 సంవత్సరాల్లో బీటెక్ పూర్తి చేసిన వారికే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మీలాంటి వారిని ఎంపిక చేసేందుకు పెద్ద సంస్థలు అంతగా ఆసక్తి చూపవు. ఇలాంటి తరుణంలో నిరుత్సాహ పడకుండా.. స్టార్టప్, చిన్న సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించండి. మిత్రులు, సీనియర్లను అడిగి ప్రోగ్రామింగ్, క్యూ అండ్ ఏ, టెస్టింగ్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో... ఏదో ఒకదాన్ని ఎంచుకొని.. అందులో నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయండి. చిన్న సంస్థల్లో కొన్నేళ్లు పని చేశాక మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించండి.
4. ఎమ్‌క్యాట్(ఏఎం- సీఏటీ)లో మంచి మార్కులు వస్తే.. పెద్ద సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తాయా? - హరిత
జ. పెద్ద సంస్థలు(టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, సీటీఎస్) చాలా కళాశాలలకు వెళ్లడం లేదు. ఏదో కొన్నింటికే వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎమ్‌క్యాట్‌లో మంచి మార్కులు సాధిస్తే.. యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి. ఇందులో ప్రతిభ చూపిస్తే.. ఉద్యోగాల కోసం మీరే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది ఇప్పుడు కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థల్లో పనిచేస్తున్నారు.
5. నేను 2012లో 78 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి కోర్సులు చదవాలి? - స్రవంతి
జ. 2012లో బీటెక్ పూర్తి చేసి... 2015లో ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. అయినా.. ఫర్వాలేదు. ఇతరులతో పోలిస్తే మీరు కాస్త ఎక్కువ కష్టపడాలి. అసలు ముందు మీ సన్నిహితులతో మాట్లాడి... మీకు ఎందులో ఆసక్తి ఉందో తేల్చుకోండి. అందుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేయండి.
6. నేను ఇంటర్వ్యూకి వెళ్లిన ప్రతిసారీ హెచ్ఆర్ రౌండ్‌లో విజయం సాధించడం లేదు. ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు. 2013లో 78.78 శాతంతో బీటెక్(సీఎస్ఈ) పూర్తి చేశా. వరుసగా ఎదురవుతున్న అపజయాలను ఎలా ఎదుర్కోవాలో సూచించగలరు? - నీహారిక
జ. ముఖాముఖిలో విజయం సాధించనంత మాత్రాన పోయేదేమీ లేదు. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ లోపాల గురించి హెచ్ఆర్ మేనేజర్లను అడిగి తెలుసుకోండి. వారు గుర్తించిన లోపాలను మళ్లీ తలెత్తకుండా చూసుకోండి. ఇంకా.. బాగా కష్టపడండి. నేనూ 5 నుంచి 6 ఇంటర్వ్యూల్లో విజయం సాధించలేదు. అపజయాలు ఎదురు కావడం సహజమే. అందుకే ఎక్కువగా దిగులు పడకండి.
7. సాఫ్ట్‌వేర్ సంస్థలు ధ్రువీకరించిన శిక్షణ సంస్థల వివరాల గురించి చెబుతారా? - ఎన్.అప్పలరాజు
జ. ముందుగా ఇంటర్నెట్‌లోకి వెళ్లి ఇలాంటి శిక్షణ సంస్థల వివరాల కోసం గూగుల్‌లో వెతకండి. మీకు కావాల్సిన వివరాలు లభిస్తాయి. బెంగళూరులోని సీడాక్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణను ఆరు నెలల పాటు ఇస్తోంది. కానీ.. రాతపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో ఉన్న సీఎంసీ శిక్షణను అందిస్తోంది.
8. నేను 2013లో 72 శాతం మార్కులతో బీటెక్(సీఎస్ఈ) పూర్తి చేశా. నాకు సీ, సీ ప్లస్ ప్లస్, జావా, పైతాన్, పెర్ల్, రూబీ వంటి కంప్యూటర్ భాషలపై పట్టు ఉంది. ఇంటర్, పదో తరగతిలో వచ్చిన తక్కువ మార్కుల కారణంగా... ఇంటర్వ్యూల్లో విజయం సాధించలేక పోతున్నా. దయచేసి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సాధించడానికి ఇప్పుడు నేనేం చేయాలో సూచించగలరు? - అబ్దుల్ ఆదిల్
జ. ముందు మీరు ఓ విషయం గుర్తుంచుకోవాలి. బహుళజాతి సంస్థలు పదో తరగతి, ఇంటర్, బీటెక్‌లో 60 శాతం మార్కులుంటేనే.. ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిస్తాయి. మన గురించి వాళ్లు నిబంధనలను సడలించరు. అందుకే మన ఆలోచన విధానం మారాలి. ప్రాంగణేతర నియామకాల్లో చిన్న చిన్న, స్టార్టప్ కంపెనీలు ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటాయి. మార్కులను పట్టించుకోవు. వాటిల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఇక్కడి అనుభవం మీరు అనుకున్న సంస్థలో ఉద్యోగం తెచ్చుకునేందుకు పనికి వస్తుంది.
9. నేను ఇటీవలే బీటెక్ పూర్తి చేశాను. డాట్‌నెట్‌పై శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతం ఓ కంపెనీలో ఆరు నెలల నుంచి పని చేస్తున్నా. వేరే సంస్థల్లో ఉద్యోగం చేయడానికి చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. చివరి వరకు ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది. ఇప్పుడేం చేయాలి? - నిఖిలేష్ సత్యవర
జ. మీరు ఉద్యోగంలో చేరింది ఆరు నెలల కిందటే. అప్పుడే కొత్త సంస్థలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీ కెరీర్‌కు మంచిది కాదు. ఒకే దాంట్లో కనీసం రెండు నుంచి మూడేళ్లు పని చేస్తేనే.. మంచి అనుభవం వస్తుంది. అప్పుడే ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొద్ది కాలానికే వేరే సంస్థకు వెళ్లిపోతే.. ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అలా చేస్తే వృత్తి జీవితంలో విజయం సాధించలేరు. ముందు ఉద్యోగాన్ని ఇష్టపడి చేయండి.. వేరే దాంట్లో ఉద్యోగం కోసం రెండు, మూడేళ్ల తర్వాత ఆలోచించడం ఉత్తమం.

Posted on 13 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning