కొలువు ఇలా సులువు

* కెరీర్ ఎంపికలో ఆలస్యం వద్దు
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ వేటలో బీటెక్ పట్టభద్రులకు ఎన్నో సమస్యలు... మరెన్నో సందేహాలు.. వీటిని నివృత్తి చేసేందుకు నిర్వహించిన 'ఈనాడు వెబినార్'లో యువతీ యువకుల ప్రశ్నలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉపాధ్యక్షుడు వి.రాజన్న, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్, తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్‌వీ రమణారావు, టాలెంట్ స్ప్రింట్ అధ్యక్షుడు మధుమూర్తి సమాధానాలిచ్చారు. వారి మరిన్ని సూచనలు, సలహాలను నేడూ మీకోసం అందిస్తున్నాం...
ఇంజినీరింగ్ పూర్తయ్యాక కెరీర్ ఎంపికలో ఆలస్యం చేయకూడదు. చాలా మంది విద్యార్థులు ఎంటెక్ చదవాలో.. ఉద్యోగం చేయాలో తేల్చుకోలేక విలువైన కాలాన్ని వృథా చేసుకుంటారు. ఇది భవిష్యత్తుకు కచ్చితంగా చేటు చేసే అంశమే. ఇలాంటి వారిని ఎంపిక చేసుకునేందుకు పెద్ద సంస్థలు అంతగా ఆసక్తి చూపించవు. అలా అని నిరుత్సాహ పడాల్సిన అవసరమూ లేదు. చిన్న చిన్న సంస్థలు, స్టార్టప్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం ఉత్తమం. కళాశాల నుంచి బీటెక్ పట్టాతో వచ్చే విద్యార్థుల్లో కనీసం 15 శాతానికి మించి ఉద్యోగాలు రావడం లేదు. అంటే.. మిగిలిన 85 శాతం మందికి మా ర్కులు బాగానే వచ్చా యి. ఉద్యోగం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు వారిలో లేవు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగం మంచి ఊపు మీద ఉండటంతో... ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉంది. నిరంతరం సాధన చేయాలి. సానుకూల దృక్పథం.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే తప్పక విజయం సాధిస్తారు.
అది అపోహే... ప్రాంగణేతర నియామకాల్లో ఉద్యోగం రాదన్నది అపోహే. ఆయా సంస్థలు.. అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలిస్తాయి. సంస్థకు పనికి వస్తాడా లేదా అన్నది క్షుణ్నంగా పరీక్షిస్తాయి. ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుంది. ఆప్టిట్యూడ్ పరీక్షలో విజయం సాధించడానికి ఎక్కువగా కష్టపడాలి. చేసిన ప్రాజెక్టుల గురించి సాంకేతిక ముఖాముఖిలో వివరించాలి. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. నేటితరం విద్యార్థుల్లో నైపుణ్యలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ కంపెనీలు 2014, 15 బ్యాచ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తాయి. అంతకుముందు పూర్తి చేసిన వారు.. అనుభవం కోసం చిన్న చిన్న, స్టార్టప్ సంస్థల్లో చేరాలి తప్పితే కాలాన్ని వృథా చేసుకోవద్దు.
ఎస్... ఎం... ఏ... సీ..! సాఫ్ట్‌వేర్ రంగంలో కెరీర్‌ను ప్రారభించాలనుకునే వారు ఎస్(సోషల్ మీడియా), ఎం(మొబిలిటీ), ఏ(అనలిటిక్స్), సీ(క్లౌడ్) వంటి అంశాల్లో నిరంతరం వస్తున్న సాంకేతిక మార్పులపై దృష్టి సారించాలి. సోషల్ మీడియాలో ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు... అందులో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి. ప్రస్తుతం మొబైల్ లేకుండా ఏ పనీ జరగడం లేదు. ఇలాంటి తరుణంలో మొబైల్ ఫస్ట్ సాఫ్ట్‌వేర్(ఐఓఎస్, ఆండ్రాయిడ్)పై అవగాహన పెంచుకోవాలి. అవసరమైతే వాటిని నేర్చుకోవాలి. ఒకప్పుడు సమాచారాన్ని విశ్లేషించడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. గతంతో పోలిస్తే డేటా మరింత పెరిగింది. ఇందులో నిపుణులు చాలామంది అవసరం. క్లౌడ్ కంప్యూటింగ్.. టెక్నాలజీ రంగంలో సంచలనం. అదే భవిష్యత్తులో ఉద్యోగాల ఖిల్లా.
ఆ సంస్కృతి వద్దు... చాలామంది నకిలీ అనుభవ పత్రాలను సృష్టించి.. ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది చాలా తప్పు. ఎప్పుడో ఓసారి మీరు పనిచేస్తున్న సంస్థే... మిమ్మల్ని గెంటేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాజెక్టు చేస్తూనే సబ్జెక్టును నేర్పించే ఫినిషింగ్ స్కూల్లో చేరి.. అనుభవం సంపాదించండి. ఎక్కువ ప్రాజెక్టుల్లో పాలుపంచుకోండి. ఆ అనుభవం, విషయ పరిజ్ఞానం.. మీకు మంచి సంస్థలో ఉద్యోగం దొరికేందుకు ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే... చిన్నతనం నుంచి ఆంగ్లంలోనే విద్యాబోధన జరగాలి.
ఇవే నిదర్శనాలు
* ప్రాంగణ నియామకాల జోరు 2014లో గణనీయంగా తగ్గిందని ఫస్ట్‌నౌకరీ.కామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
* ఏటా దేశంలో 7 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. అదే సమయంలో ఏటా 3 నుంచి 4 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అయినా.. 15 శాతం మందికీ కొలువులు రావడం లేదు.
100 మందికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే.. వాటిలో
* 60 - ప్రోగ్రామింగ్ (జావా, డాట్ నెట్, లాంప్ స్టాక్ తదితర కంప్యూటర్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి)
* 30 - క్వాలిటీ అండ్ అస్యూరెన్స్ (సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఏదో ఒక టెస్టింగ్ టూల్‌లో ప్రావీణ్యం సంపాదిస్తే.. మంచి అవకాశాలు లభిస్తాయి)
* 10 - సిస్టమ్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఉద్యోగాలు.
ఈ నైపుణ్యాలు ఉన్నాయా?
ఈ కింది నైపుణ్యాలు మీకుంటే ఉద్యోగం సంపాదించవచ్చు.. చేరిన తర్వాత ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు.
* ఓ ప్రాజెక్టు లేదా చేసే పనిని గురించి బాగా రాసే కళ
* కంప్యూటర్ నైపుణ్యం
* ఆర్థికపరమైన అవగాహన
* బృందంతో కలిసి పనిచేసే కళ
* సహనంతో పనిచేయడం
ఈ లక్షణాలూ అవసరమే
కొందరు చదువులో వెనకబడినా ఉద్యోగం సంపాదించటంలో ముందు వరసలో ఉంటారు. అలాంటి వారిని మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే వారు సానుకూల ధోరణితో వ్యవహరిస్తారు. అంటే ఒకసారి విఫలమైతే నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నిస్తారు. అందుకు మీ సామర్థ్యాలపై మీకు మంచి అభిప్రాయం ఉండాలి. నైపుణ్యం, పరిజ్ఞానం ఎంత ముఖ్యమో మీ దృక్పథం కూడా ఉద్యోగం పొందటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం ఇదీ పరిస్థితి...
* యాస్పిరింగ్ మైండ్స్ అధ్యయనం ప్రకారం 2011లో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన 5 లక్షల మందిలో 17.45 శాతం మందే ఉద్యోగాలకు అర్హులని తేలింది. సాంకేతిక నైపుణ్యాలను పక్కనబెడితే 50 శాతం మందిలో భాష, వ్యాకరణ దోషాల సమస్య ఉందని వెల్లడించింది.
* నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) 2011 సర్వే ప్రకారం 75 శాతానికిపైగా సాంకేతిక విద్య పూర్తిచేసిన వారిలో ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేవని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 6,000 కోట్ల డాలర్ల ఔట్‌సోర్సింగ్ పరిశ్రమ ఏడాదికి 100 కోట్ల డాలర్లు కేవలం అభ్యర్థుల శిక్షణకు ఎలా ఖర్చు చేయగలదని ప్రశ్నించింది.
* 2012లో పర్పుల్ లీప్ అనే సంస్థ ఇండస్ట్రీ రెడీనెస్ ఇండెక్స్ పేరిట సర్వే చేసి, శిక్షణ అనంతరం కూడా 2, 4వ కేటగిరీల్లోని కళాశాలల విద్యార్థులు మూడో వంతు మంది ఉద్యోగాలు పొందలేకపోయారని పేర్కొంది. కారణం దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలు పరిష్కరించే సామర్ధ్యం, నేర్చుకునే ఆసక్తి తగ్గిపోవడమేనని వెల్లడించింది. విచిత్రమేందంటే ఈ సర్వే చేసింది 60 శాతం మార్కులకుపైగా సాధించిన వారిపైనే.

Posted on 14 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning