'ఈనాడు వెబినార్'లో జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఇచ్చిన‌ సమాధానాలు

ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ వేటలో బీటెక్ పట్టభద్రులకు ఎన్నో సమస్యలు... మరెన్నో సందేహాలు.. వీటిని నివృత్తి చేసేందుకు నిర్వహించిన 'ఈనాడు వెబినార్'లో యువతీ యువకుల ప్రశ్నలకు జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్, తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్‌వీ రమణారావు సమాధానాలిచ్చారు. వారి మరిన్ని సూచనలు, సలహాలను మీకోసం అందిస్తున్నాం...

? నేను బీటెక్ మెకానికల్ చదువుతున్నాను. ఇప్పటికి 64 శాతం మార్కులొచ్చాయి. థర్మల్ ఆధారిత విద్యుత్తు కేంద్రాల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. నా నిర్ణయం సమంజసమేనా? - సునీల్‌కుమార్
* విద్యుత్తు రంగానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీ లాంటి వాటిలో ఏటా ఉద్యోగ నియామకాలు జరుపుతుంటారు. నీ నిర్ణయం మంచిదే.
? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి? - శేషసాయి
* ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో ఐటీ ఉద్యోగాలు ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ శాఖలు నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష, ముఖాముఖి నిర్వహిస్తాయి. వాటిలో విజేతగా నిలవాల్సి ఉంటుంది. ఏదైనా మీ చదువుకు సంబంధం ఉన్న కోర్సులు పూర్తి చేస్తే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
? మెకానికల్‌కు సంబంధించి ఉత్పత్తి తరహా కంపెనీ(కోర్)ల్లో పనికివచ్చే సాఫ్ట్‌వేర్లు ఎలాంటివి నేర్చుకోవచ్చు? - వపన్
* ఆటో మొబైల్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఆటోక్యాడ్ లాంటి సాఫ్ట్‌వేర్లు వినియోగిస్తారు. అలాంటి వాటిని నేర్చుకుంటే మంచిది.
? నేను బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నా. బీటెక్ తర్వాత ఏం చదవవచ్చు. ఎలాంటి అవకాశాలు ఈ రంగంలోఉన్నాయి? - శ్రీని
* ఓయూలో ఎంటెక్ చేయవచ్చు. ఫార్మా రంగంలో కెమికల్ ఇంజినీర్లను నియమించుకుంటారు. కాలుష్యం ముఖ్యంగా జల వ్యర్థాలు వచ్చే ఫార్ములేషన్స్, బల్క్‌డ్రగ్, ఇతర రసాయన తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ఇండస్ట్రీలోనూ ఉద్యోగాలు పొందొచ్చు. రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ మండళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు.
? నాకు ఆటోమోటివ్ పరిశ్రమల్లో ఉద్యోగం చేయాలని ఉంది. ఏ ఒక్క కంపెనీ ప్రకటన ఇవ్వడం లేదు. మరి ఉద్యోగావకాశాలు గురించి ఎలా తెలుసుకోవాలి? - అనురూప్
* కొన్ని కంపెనీలు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వని మాట వాస్తవమే. వారు తమ వెబ్‌సైట్లో పెడుతుంటారు. దీనివల్ల కంపెనీల వెబ్‌సైట్లు చూస్తూ ఆ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లకు రెజ్యూమ్ పంపించుకోవాలి. ఆటోమోటివ్ పరిశ్రమలో మంచి అవకాశాలే ఉన్నాయి.
? ఎంటెక్ కంట్రోల్ సిస్టమ్స్ కోర్సు చేయడానికి ఉత్తమ కళాశాల ఏది? - తరుణ్‌వర్మ
* మొదట మీరు గేట్ పరీక్ష రాసి మంచి స్కోర్ సాధించండి. దాంతో మీకు ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
? నేను 2012లో ఈఈఈలో బీటెక్ పూర్తి చేశాను. బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నించి కొద్దిలో విఫలమయ్యాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోకి రావొచ్చా? - శ్యామల
* బ్యాంకు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ రెండూ వేర్వేరు. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈఈఈ చదివారు కాబట్టి విద్యుత్తు రంగంలో మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగంలోనూ అంతే.
? నేను బీటెక్ చదివాను. బ్యాక్‌లాగ్‌లున్నాయి. ఉద్యోగం పొందటంపై ప్రభావం పడుతుందా? - హరిత
* బ్యాక్‌లాగ్‌లు పెద్ద సమస్య కాదు. బీటెక్ పట్టా అనంతరం మొత్తం మార్కుల శాతం చూస్తారు. కంపెనీలు నిర్వహించే రాత పరీక్ష, సాంకేతిక, మానవ వనరుల రౌండ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
? నేను 64 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. అందరూ అనుభవం అడుగుతున్నారు? ఇలాంటప్పుడు నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? - నితీష్
* అనుభవం లేదు... ఉద్యోగాలు రావేమోనని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. ఇలాంటప్పుడు ఫ్రెషర్లు స్టార్టప్ కంపెనీ( కొత్తగా వచ్చిన)ల్లో ప్రయత్నించి అక్కడ రెండుమూడేళ్లు అనుభవం సంపాదించాలి. ఆ తర్వాత పెద్ద కంపెనీల్లో ప్రయత్నించాలి.
? ఉత్పత్తి రంగాల్లో ఈసీఈకి ఉన్న అవకాశాలు ఏమిటి? - కె.శ్రవంత్‌కుమార్
* ఈసీఈలో కోర్ రంగంలో అంటే ఎలక్ట్రానిక్ చిప్‌లను తయారు చేసే వాటిల్లో ప్రయత్నించాలి. హైదరాబాద్‌లోనే ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీల్లో అవకాశాలుంటాయి. ఇతర నగరాల్లోనూ ఉద్యోగాలుంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
? ప్రస్తుతం నేను బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలపండి. - పవన్ శ్రీనివాస్
* కాలుష్య నియంత్రణ మండలి (పి.సి.బి)తో పాటు ఫార్మా పరిశ్రమల్లో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బీటెక్ పూర్తి కాగానే ఎంటెక్‌లో చేరి అదే కోర్సులో స్పెషలైజేషన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాన్ ఐటీ రంగంలో గుజరాత్, పుణె, దిల్లీ వంటి ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ప్రయత్నించవచ్చు.

Posted on 14 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning