'ఈనాడు వెబినార్'లో టీసీఎస్ ఉపాధ్యక్షుడు ఇచ్చిన‌ సమాధానాలు

ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగ వేటలో బీటెక్ పట్టభద్రులకు ఎన్నో సమస్యలు... మరెన్నో సందేహాలు.. వీటిని నివృత్తి చేసేందుకు నిర్వహించిన 'ఈనాడు వెబినార్'లో యువతీ యువకుల ప్రశ్నలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉపాధ్యక్షుడు వి.రాజన్నసమాధానాలిచ్చారు. వారి మరిన్ని సూచనలు, సలహాలను మీకోసం అందిస్తున్నాం...

? నా ఎం.టెక్. 2014లో పూర్తయ్యింది. స్పెషలైజేషన్ వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్. సిస్టమ్ వేర్‌లాగ్ వెరిఫికేషన్ కోర్సు పూర్తి చేశాను. అందులో అవకాశాలెలా ఉన్నాయి? - గోపాలకృష్ణ బెహరా
* ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో చాలా అవకాశాలు ఉన్నాయి. 4జీ రాబోతోంది. 90 కోట్ల మంది మొబైళ్లు వాడుతున్నారు. వీటిలో నైపుణ్యాలు కలిగిన మీలాంటి వారి అవసరం ఉంటుంది. టీసీఎస్‌లో, క్యాప్టివ్ ఎంఎన్‌సీల్లోనూ ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ సంస్థలు ఉన్నాయి.
? మా కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకంలో హెచ్ఆర్ రౌండ్‌లో అర్హత సాధించలేక పోయాను. ఈ తరహా ఇంటర్వ్యూల్లో విజయం పొందాలంటే ఏం చేయాలి? - యామిని భవ్య
* ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేదని నిరాశవద్దు. హెచ్ఆర్ రౌండ్‌లో 99 శాతం ప్రశ్నలు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అడుగుతారు. మీరు ఎంతమేరకు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారని గమనిస్తారు. నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేయండి. క్యాంపస్ సెలెక్షన్స్‌కు ముందు నుంచే సన్నద్ధం కండి.
? 2009లో బి.టెక్(సీఎస్ఈ) పూర్తయ్యింది. ఆ తర్వాత కొన్ని సాధారణ ఉద్యోగాలు చేశాను. 2014లో ఎంటెక్‌లో కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పూర్తయ్యాయి. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? - కృష్ణ
* చాలా అవకాశాలు ఉన్నాయి. బోధన రంగంలో డిమాండ్ ఎక్కువ. ఇక్కడ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. పీహెచ్‌డీ చేస్తే బోధన రంగంలో స్థిరపడవచ్చు.
? నేను ఈసీఈ విద్యార్థిని. టెక్నికల్ ప్రోగ్రామింగ్‌లో పెద్దగా పట్టు లేదు. ఆర్థిక సంక్షోభం మాటలు వినిపిస్తున్నాయి. ఆ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఏమైనా ఉంటుందా? - మౌనిక రాంబాబు
* వచ్చే ఆర్థిక సంవత్సరం ఐటీ రంగానికి మంచి వృద్ధి ఉంటుంది. సంక్షోభాల వంటివి వచ్చినా మనం చేయగలిగేది ఏమీ ఉండదు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు కాబట్టి నైపుణ్యాలను మెరుగు పరచు కోవడంపై దృష్టి పెట్టాలి. మీరు కరిక్యులమ్‌పై కాంపిటెంట్‌గా ఉండాలి. ప్రోగ్రామింగ్‌లో పట్టు సాధిస్తే ఇంటర్వ్యూను ధైర్యంగా ఎదుర్కోగలరు.
? బి.టెక్(సీఎస్ఈ) 2014లో 80 శాతం మార్కులతో పూర్తి చేశా. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు లేవు. ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది? - భవాని
* ఐటీలో ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఇక్కడ క్లయింట్స్ యూఎస్ఏ, యూకే... తదితర దేశాల నుంచి ఉంటారు. వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పనిసరి. ఆంగ్లం రాదని నిరాశ వద్దు. మాట్లాడే ప్రయత్నం చేశాలి. తప్పులు దొర్లుతాయని సిగ్గుపడొద్దు. పత్రికలు చదవడం, ఆంగ్ల సినిమాలు చూడటం ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
? సొంతంగా యాప్స్‌ను అభివృద్ధి చేయడం ఎలా? ఏదైనా కోర్సు ఉందా? - వినోద్
* అంతర్జాలంలో ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని యాప్స్‌ను అభివృద్ధి చేయవచ్చు.
? 2012 ఈసీఈ బ్రాంచ్‌లో 75 శాతం మార్కులతో నా బీటెక్ పూర్తయింది. ఐటీయేతర రంగంలో పని చేస్తున్నాను. ఎం.ఎస్. కంప్యూటర్ సైన్స్ చేయాలనేది ఆలోచన. ఏ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? - కిరణ్, అబ్దుల్ ఆదిల్
* ఎం.ఎస్ కంప్యూటర్స్‌కు ఐటీలో అవకాశాలు పుష్కలం. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఉద్యోగంలో చేరడం కంటే టీసీఎస్ వంటి భారతీయ ఐటీ కంపెనీలో చేరితే వారే మిమ్మల్ని విదేశాలకు పంపిస్తారు. మీ కల నెరవేరుతుంది.
? నేను చదివింది మెకానికల్ బ్రాంచ్. టెస్టింగ్ టూల్స్ చదివాను. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేందుకు అర్హుడినేనా? - హరి
* టెస్టింగ్‌టూల్స్ ఐటీలో కీలకం. మీరు ప్రయత్నించవచ్చు.
? నాకు ఇస్రోలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చింది. ఎం.టెక్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది మంచిదో సూచించగలరు? - ఉదయ్
* మీరు ఇస్రోలో చేరడం ఉత్తమం. అక్కడ చేరాక ఎం.టెక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
? బి.టెక్ సీఎస్ఈ 2014లో పూర్తి చేశాను. రెండుసార్లు టీసీఎస్ ప్రాంగణేతర నియామకాలకు హాజరయ్యాను. టెక్నికల్ రౌండ్‌లో ఫెయిల్ అయ్యాను. పాసై ఉద్యోగం సంపాదించడం ఎలా? - సేతు
* దిగులు చెందవద్దు. టెక్నికల్ అంశాలపై పట్టు పెంచుకుని మరోసారి ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
? ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులకు కోర్ జాబ్స్ అవకాశాలు ఏమున్నాయి? - రాకేష్
* ఈఈఈ బ్రాంచ్ పూర్తిచేసిన వారికి కోర్ జాబ్‌లు ఎక్కువగా పుణె, గుజరాత్, చైన్నె వంటి నగరాల్లో ఉన్నాయి. మన నగరంతో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎక్కువ. ఎక్కడ ఉన్నా దరఖాస్తు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
? ఇంటర్వూలో ప్రతిభ కనబరచడానికి అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి? - సత్యేంద్ర
* ఇంజినీరింగ్‌లో మార్కుల పర్సంటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ప్రతిభ కనబరచగలగాలి. మీరేం చదివారో, మీ లక్ష్యాలేంటో స్పష్టంగా చెప్పగలగాలి. మాటతీరు బాగుండాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించగలగాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల్లో సీ, సీ++, జావా... వీటిలో ఏదేని రెండింటిపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఇంటర్వ్యూల్లో తప్పక రాణిస్తున్నారు.
? ఐటీ పరిశ్రమలో బూమింగ్ సెక్టార్ల గురించి చెబుతారా? - శ్రీరామ్
* వృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఉన్న సెక్టార్లు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా డిజిటల్, ఎంటర్‌ప్రైజెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇన్సూరెన్స్, బీపీవో, కేపీవో రంగాల్లో అవకాశాలు ఉన్నాయి.
? బి.టెక్ 2014 ఈఈఈ పూర్తయ్యింది. ఐటీ ఉద్యోగానికి ఎలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. - అనిత, నీలిమ
* సి, సి++, జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఒకటి రెండింటిలో మాస్టర్స్ కావాలి. ఏది ఇచ్చినా చేయగలగాలి. దీంతో పాటూ కోర్ సబ్జెక్టుల్లో మంచి పట్టుండాలి. మంచి భాషా నైపుణ్యాలు అవసరం.
? ఎంసీఏ 2007లో పూర్తి చేశాను. ఏ కోర్సులు అభ్యసిస్తే ఐటీలో ఉద్యోగం వస్తుంది? - ఎన్‌వీఎస్‌శర్మ
* అవకాశాలకు కొదవ లేదు. మొబిలిటీ, డాటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో పాటూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే కొలువు సాధింవచ్చు.

Posted on 14 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning