అలాగని.. పుస్తకాల పురుగునేంకాదు!

* సివిల్ విభాగంలో ఐఈఎస్ విజేత
క్యాంపస్‌ ఉద్యోగాన్ని వదిలేసుకుని... చదువుల యాత్ర కొనసాగించిన ఓ అమ్మాయి... స్నేహితుల జీతాలూ, ఫేస్‌బుక్‌లో వారి సరదాల పోస్టింగ్‌లూ చూసి 'అరె... తప్పు చేశానా' అని బాధపడింది! అయితే అది తాత్కాలికమే. ఒకసారి లక్ష్యం నిర్దేశించుకున్నాక మడమ తిప్పకూడదనుకుని ఏకాగ్రతతో లక్ష్యాన్ని గురిపెట్టింది. జాతీయ స్థాయిలో వేలమందితో పోటీపడి ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌)కి ఎంపికైంది. అదీ అమ్మాయిలు అరుదుగా ఉండే సివిల్‌ విభాగంలో! నవ్య ఏం చెబుతోందంటే...
నేను పుట్టిపెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాన్న స్థిరాస్తి రంగంలో ఉన్నారు. ఆయన కష్టపడే తీరుని చూసి ఆ రంగంలోకే వెళ్లాలనుకున్నా. 'హాయిగా నీడపట్టున ఉండి ఉద్యోగం చేసుకోక నీకెందుకా రంగం' అన్నవాళ్లు చాలామందే! కానీ ఇష్టమైన దానికి సంబంధించి కష్టపడటంలో ఎంత సంతృప్తి ఉందో నాకే తెలుసు. ఎంసెట్‌లో 134వ ర్యాంకుతో వరంగల్‌లోని ఎన్‌ఐటీలో చేరా. సివిల్‌ విభాగంలో మొత్తం తరగతిలో నూట ఎనభై మంది విద్యార్థులుంటే వారిలో పద్దెనిమిది మంది మాత్రమే అమ్మాయిలు. అక్కడ చేరకముందే నా తర్వాతి లక్ష్యం 'గేట్‌' సాధించడమే అనుకున్నా. 'గేట్‌' కోసం ప్రత్యేకంగా చదివా. చివరి ఏడాదికొచ్చేసరికి రోజుకి తొమ్మిది గంటలు చదివేదాన్ని. అలాగని పుస్తకాల పురుగని అనుకోవద్దు! ఆదివారం వస్తే స్నేహితులతో కబుర్లూ, షికార్లూ మామూలే. అలాచేయకుంటే ఒత్తిడి ఎలా తగ్గుతుంది మరి?
క్లాసులో నేనొక్కదాన్నే ....
చివరి ఏడాదికొచ్చాక ఇంజినీరింగ్‌ విభాగాల కోసం ఆలిండియా సర్వీసెస్‌ ఉందని తెలిసింది. నాన్న 'ప్రయత్నిస్తేనే కదా నీ ప్రతిభ ఏంటో తెలిసేది, రాసి చూడు' అన్నారు. దాంతో బీటెక్‌ చివరి ఏడాది నుంచి 'గేట్‌'తో పాటూ ఐఈఎస్‌కీ శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. ఈలోగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగమొచ్చింది. పెద్ద జీతం, మంచి హోదా... చేరిపోదామా అనిపించింది మొదట. కానీ అంతకన్నా పెద్ద లక్ష్యం పెట్టుకుని ఇలా రాజీపడటం ఎందుకనిపించింది. 2013 'గేట్‌'లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో చేరా. దాన్లో ఉన్న ఆరు విభాగాల్లో నేను స్ట్రక్చర్స్‌ డివిజన్‌లో ఉన్నా. క్లాసు మొత్తానికి నేనొక్కదాన్నే అమ్మాయిని. ఈ ఏడాదే మొదటిసారి ఆలిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశా. వేల మంది రాసిన పరీక్షలో జాతీయ స్థాయిలో 61వ ర్యాంకు నాకొచ్చింది.
కష్టాన్నే ఇష్టంగా భావించా...
నా స్నేహితులంతా ఉద్యోగాలు చేస్తుంటే నేనేమో ఇంకా చదువుకోవడం ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించేది. వాళ్లేమో జీతాలు తీసుకుంటూ, పార్టీలు చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో స్టేటస్‌లు పెడుతుంటే ఉద్యోగం వదులుకుని తప్పుచేశానా అనిపించేది అప్పుడప్పుడు. కానీ ఓ లక్ష్యం అనుకున్నాక సాధించకుండా వెనుకంజ వేయడంలో ఆనందం ఏముంది అని వెంటనే సర్ది చెప్పుకునేదాన్ని. ఎంటెక్‌కీ, ఐఈఎస్‌కీ సిద్ధమయ్యేందుకు కచ్చితమైన ప్రణాళికనీ... సాధించాల్సిన లక్ష్యాల్నీ నిర్ణయించుకున్నా. సమయం చూసుకోకుండా కష్టపడ్డా. ఇక రెండు వారాల్లో పరీక్ష ఉందనగా, నాన్నకు యాక్సిడెంట్‌. చేయి నుజ్జునుజ్జయిపోయింది. చేతికి శస్త్రచికిత్సలు చేసి రాడ్‌ వేశారు. అనుక్షణం అండగా నిలిచిన నాన్నకు అలా అయ్యేప్పటికి పదిరోజుల పాటు నా మనస్సుని చదువుపై కేంద్రీకరించలేకపోయా. 'అంత ఆలోచించకు... నాకేం అవలేదుగా, నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు' అని నాన్న ఆ సమయంలోనూ నన్ను ఉత్సాహపరిచారు. ఆ ప్రోత్సాహం వూరకే పోలేదు... ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో మంచి ర్యాంకొచ్చింది. మా విభాగంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన దక్షిణాది అమ్మాయిని నేనే మరి!

Posted on 17 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning