నాది గేట్‌వే ఆఫ్‌ ఇండియా!

ట్రిపుల్‌ ఐటీలో తను చేసింది ఓ అరుదైన కోర్సు! 'మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌'లో బీటెక్‌ పూర్తికాగానే రెక్కలు కట్టుకుని డాలర్‌ దేశంలో వాలిపోవచ్చనే భావించారు ఆమె సహాధ్యాయులు. అలాగే చేశారు కూడా. అయితే నందిగం అన్విత దారి వేరు. తను 'గేట్‌' వైపు పరుగెత్తింది. లక్షలాది మందితో పోటీపడి దేశంలోనే ఆరో ర్యాంకు సాధించింది. ఎలక్ట్రానిక్స్‌ని మరింతగా మధించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిజ్ఞానమంతా భారతదేశానికే సొంతం కావాలని అంటోంది. అదీ కేంద్ర ప్రభుత్వంలోనే పనిచేస్తానంటోంది. ఎందుకో మీరే చదవండి...
'మిమ్మల్ని ఎవరు చదివించారూ..?' అని ఎవరైనా అడిగితే మనం అమ్మానాన్నా అనో.. ఇంకెవరో అనో చెప్పేస్తుంటాం కదా! నిజానికిది పూర్తిగా నిజం కాదు. మనం నేర్చుకునే ప్రతి అక్షరం వెనుకా ఈ దేశం పరోక్షంగా అందించే ఆర్థిక సాయం ఎంతో ఉంది. మన దృష్టిలో బోధన రుసుమూ, వసతీ, ఆహారం వసతి కోసం మనం పెట్టే ఖర్చే పెద్దదిగా కనిపిస్తుంటుంది. అలాకాకుండా కాలేజీలో మనం చదివేందుకున్న ల్యాబ్‌లూ, అసలు ఆ కాలేజీ నిర్మించేందుకు ప్రభుత్వం అందించే స్థలాలూ.... ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి మనం. ఆ లెక్కన ఆలోచిస్తే.. నాలాంటి ఇంజినీరింగ్‌ విద్యార్థి చదువు వెనుక ప్రభుత్వం కొన్ని లక్షలే ఖర్చుపెట్టి ఉంటుంది. మరి మనం ఆ రుణం ఎప్పుడు తీర్చుకోవాలి... మనకోసం తమ పన్నుకట్టిన ప్రజలకు ఎలా సేవలందించాలి... ఈ ఆలోచనలతోనే నేను కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఇండియన్‌ ఎలక్ట్రానిక్స్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నాను.
ఎందుకిలా ఆలోచిస్తున్నాను?... మానాన్న ఇల్లెందు సింగరేణిలో డిప్యుటీ ఎస్‌ఈ. అమ్మ సూదిమళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్లే నేను మనదేశంలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నానేమో! అమ్మే నాకు చదువుల్లో స్ఫూర్తి. 1994 డీఎస్సీలో ఆమె జిల్లా టాపర్‌! బీఈడీలోనూ ర్యాంకరే. ఇక మా అన్నయ్య ఐఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. ప్రతిదానికీ తనతో పోటీపడే నేనూ ఐఐటీ-జేఈఈకి సిద్ధమయ్యాను. పరీక్షల రోజు తీవ్రమైన జ్వరం. సీటు సాధించలేకపోయాను. 'దానిదేముంది మళ్లీ రాయొచ్చు..!' అన్నాడు అన్నయ్య. అందుకోసం ఏడాది వృథా చేయడం ఇష్టంలేక ఏఐఈఈఈ రాశాను. అందులో 8,294 ర్యాంకు వచ్చింది. అప్పుడే నేను 'డిజైనింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (డీ అండ్‌ ఎం) కోర్సు' గురించి విన్నాను. అది చెన్నై పరిసరాల్లో ఉన్న 'కాంచీపురం ట్రిపుల్‌ ఐటీ'లో మాత్రమే ఉందని తెలిసింది. అందులో చేరిపోయాను. ఆ ట్రిపుల్‌ ఐటీకి ప్రత్యేక భవనం లేదు. అందుకని ఐఐటీ-మద్రాసు ప్రాంగణంలో ఓ భాగంగా దాన్ని ఏర్పాటుచేశారు. అలా జేఈఈతో నాకు దక్కని ఐఐటీ ప్రాంగణం ఇలా దక్కిందన్నమాట.
అందరూ అటెళితే.. నేను చదివిన డీఎండ్‌ఎం... ఎలక్ట్రానిక్‌ పరికరాల రూపకల్పన, తయారీకి సంబంధించిన అరుదైన కోర్సు! అది ముగించగానే నా సహాధ్యాయుల్లో చాలామంది విదేశాలకు వెళ్లిపోయారు. నేను ఈసీఈలో 'గేట్‌' రాశాను. సుమారు రెండున్నర లక్షలమంది నాతోపాటూ పోటీపడ్డారు. ఇందులో జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు వస్తుందని కలలో కూడా వూహించలేదు! వచ్చాక అమ్మానాన్నల ఆనందం అంతా ఇంతా కాదు. ఐఐటీ-జేఈఈ పరీక్ష పోయిన వెలితి వాళ్లకు ఇప్పుడు తీరిందనే చెప్పాలి! ఎం.టెక్‌ వచ్చింది కాబట్టి జులైలో ఐఐటీ (లేదా ఐఐఎస్‌)లో క్లాసులు మొదలవుతాయి. ఈలోపు ఐఈఎస్‌కి రాయాలనుకుంటున్నాను. ఒకవేళ సర్వీస్‌కి ఎంపికైనా కూడా ఎం.టెక్‌ చదివే అవకాశం నాకెప్పుడూ ఉంటుంది!

Posted on 21 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning