ఉద్యోగ సన్నద్ధతలో... మీరు ఎక్కడ?

విద్యాభ్యాసం ముగిసేలోపు ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ గురించి సరైన అంచనాతో ఉండటం చాలా ముఖ్యం. ఈ అవగాహన ఉంటే లోపాలు సరిదిద్దుకుని ఉద్యోగసాధనలో ముందంజ వేయవచ్చు. అందుకు సహాయపడే ప్రశ్నావళి అందిస్తున్నాం. స్వీయ రేటింగ్‌తో మీ స్థాయిని అంచనా వేసుకోండి!
ఇంజినీరింగ్‌ పూర్తయినవారిలో కొందరికే ఉద్యోగాలు వస్తున్నాయి. కొంతమంది కొద్దో గొప్పో ఉద్యోగాలు సాధించినా అవి వారి ప్రతిభకు తగినవి కాకపోవడంతో నిరుత్సాహం మిగులుతోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్లేస్‌మెంట్‌ విభాగాలూ క్యాంపస్‌ డ్రైవ్‌ల్లో అవకాశాలు కల్పించినప్పటికీ విద్యార్థులు అనుకున్నస్థాయిలో ఎంపిక కాని పరిస్థితి సాధారణం. అర్హత కలిగిన విద్యార్థులూ, వారికి తగిన నైపుణ్యాలూ ఉంటే ఉద్యోగం ఇవ్వడం సంస్థలకు పెద్ద సమస్యేం కాదు. ఎందుకంటే చాలా సంస్థలు తమకు అవసరమైన నైపుణ్యాలున్నవారు దొరకడం లేదని వాపోతున్నాయి.
ఏ కళాశాలలో చదివారనేదానికన్నా ఎంత నేర్చుకున్నారు; ఈ నాలుగేళ్ళలో ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు అనేవి ముఖ్యం. చాలామంది విద్యార్థుల్లో తాము ఎంచుకున్న బ్రాంచికి సంబంధించి ఎటువంటి సంస్థలున్నాయి; వాటిలో ఎన్ని ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి; ఎలాంటి సంస్థలో తాము ఉద్యోగం చేయాలనుకుంటున్నారన్న దానిపై ఏ మాత్రం అవగాహన ఉండటంలేదు. కొంతమందికి కొద్దో గొప్పో అవగాహన ఉన్నా అలాంటి సంస్థల్లో ఉద్యోగం ఎలా సంపాదించాలో తెలియదు. దాంతో దిక్కుతోచక సతమతమవుతుంటారు.
నాలుగు సంవత్సరాల విద్యనూ, కాలాన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి; ఏం నేర్చుకుంటే నాలుగో సంవత్సరం ముగిసేసరికి తగిన ఉద్యోగం సంపాదించుకోవచ్చు? ఇవన్నీ ఆలోచించాలి.
పరీక్షల్లో మార్కులు సాధించగానే సరిపోదు. సబ్జెక్టు మీద అవగాహన, పట్టు అవసరం. థియరీని ప్రాక్టికల్‌ రూపంలో అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలపై చాలా సంస్థలు దృష్టిపెడుతున్నాయి.
ఏం నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా ప్రథమంగా విద్యార్థులు రియల్‌టైం సమస్యలంటే ఏంటి? వాటికి పరిష్కారాలు ఎలా ఇవ్వాలి? అనేవి అర్థం చేసుకుంటే చక్కని ఉద్యోగం, మెరుగైన కెరియర్‌ సాధించవచ్చు.
కార్పొరేట్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు కేవలం కళాశాలలోనే నేర్చుకోగలం అనుకుంటే అది అపోహే. కొన్ని విషయాలు కళాశాలలో నేర్చుకుంటే మరికొన్ని కళాశాల బయట (సంస్థలోనో, ఇంటర్నెట్‌ ద్వారానో) నేర్చుకోవచ్చు. చాలావరకు రియల్‌టైం సమస్యలకు సొల్యూషన్స్‌ నేర్చుకోవడం సంస్థల ద్వారా సాధ్యపడుతుంది. సంస్థలు కూడా ఎన్నో విధాలుగా విద్యార్థులకు అవకాశాలిస్తుండడం గమనార్హం. వీటి గురించి తెలుసుకోవాలి.
చాలాసార్లు విద్యార్థులు, కొన్ని సందర్భాల్లో కళాశాలల యాజమాన్యంతో సహా సంస్థలు ఎదురుచూసే నైపుణ్యాలను అర్థం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు. ఏదో ఒక విషయంలో పట్టు సాధించినంతమాత్రాన ఉద్యోగం వస్తుందనుకోకూడదు. ఉద్యోగ విజయానికి దోహదపడే కారణాల గురించి తెలుసుకోవాలి. తమ వాస్తవిక స్థితిని గ్రహించాలి; లోపాలను సరిచేసుకోవాలి.
ఇవీ అంశాలు.. ఇవ్వండి మీ రేటింగ్‌
కింద సూచించిన సర్వే చూడండి. దీనిలో 20 అంశాలుంటాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులూ! మీరు ఒక్కో అంశాన్ని చదివి, వాస్తవికమైన రేటింగ్‌ ఇచ్చుకోవాలి. తొందరపడకుండా ప్రతిదీ చక్కగా ఆలోచించి, పరిశీలించాకే రేటింగ్‌ ఇచ్చుకోవాలి. మీ మనస్సాక్షికి ఏమనిపిస్తుందో అంతమాత్రమే రేటింగ్‌ ఇవ్వాలి. అత్యుత్సాహంతో ఎక్కువ రేటింగ్‌ ఇవ్వకూడదు.
ఒక్కో అంశానికి 1-10 మధ్య రేటింగ్‌ ఇవ్వండి. 1 అత్యల్ప రేటింగ్‌కూ; 10 అత్యధికానికీ గుర్తు.
1. మీ లక్ష్యానికి మీరిచ్చే ప్రాముఖ్యం? ( )
2. ఉద్యోగం కోరుకుంటున్న పరిశ్రమ రంగం/ సంస్థ మీద మీకున్న స్పష్టత? ( )
3. మీకు ఎక్కువగా నచ్చిన సబ్జెక్టుపై పట్టు శాతం? ( )
4. మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులో మార్కులు తెచ్చుకోవటం కాకుండా, అదనంగా ప్రాజెక్టు/ ఆసక్తికరమైన పని చేయటం... ( )
5. మీ భావప్రసరణ (కమ్యూనికేషన్‌) నైపుణ్యాలకు మీ రేటింగ్‌? ( )
6. మీ తార్కిక- హేతుబద్ధ నైపుణ్యం స్థాయి? ( )
7. మీ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ స్థాయి ఎంత? ( )
8. మీ వెర్బల్‌ రీజనింగ్‌ నైపుణ్య స్థాయి? ( )
9. మీ కోడింగ్‌ నైపుణ్యం ఏ స్థాయిలో ఉంది? ( )
10. కోర్‌ బ్రాంచ్‌/ సబ్జెక్టులో మీకున్న పట్టు? ( )
11. మీరు చదువుతున్న కోర్‌ సబ్జెక్టులో సాధించిన ఆచరణాత్మక (ప్రాక్టికల్‌) పరిజ్ఞానం)... ( )
12. వేసవిలో కనీసం రెండు నెలల ప్రాజెక్టును ఏ కంపెనీలోనైనా చేయటం.. ( )
13. కళాశాలలో మీ ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు ద్వారా రియల్‌టైం సమస్యలకు సొల్యూషన్స్‌ ఇవ్వటం... ( )
14. మీరు చేసిన ప్రాజెక్టును తడబడకుండా కనీసం ఐదు నిమిషాలైనా వివరించగలిగే నేర్పు? ( )
15. బృంద చర్చలో పాల్గొని చూపిన ప్రతిభ ( )
16. కేస్‌స్టడీ విశ్లేషణలో పాల్గొన్న నైపుణ్యం ( )
17. రెజ్యుమె/ బయోడేటా తయారీలో అవసరమైన అన్ని అంశాలనూ పొందుపరచటం... ( )
18. మీకు అత్యంత ఆసక్తి గల సబ్జెక్టులో మీరు మిమ్మల్ని ఎంతగా రేట్‌ ఇచ్చుకుంటారు? ( )
19. మీ బ్రాంచికి సంబంధించిన సాంకేతిక పోటీలో పాల్గొనటం..( )
20. 'మీ గురించి మాట్లాడ'మంటే తడబడకుండా ఐదు నిమిషాలైనా మాట్లాడే విషయంలో మీ స్థాయి? ( )
రేటింగ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
* ఏ అంశానికైనా రేటింగ్‌ 5 గానీ, 5 కంటే పైన గానీ ఇచ్చుకుంటే దాని అర్థం- ఆ విషయంపై ఒక మోస్తరు అవగాహన మీకుందని.
* వేటిలోనైనా 5 కంటే తగ్గివుంటే ఆయా విషయాలపై శ్రద్ధ పెట్టి మెరుగుపర్చుకోవాల్సివుందని గ్రహించాలి.
* అన్నిట్లోనూ 8 పైన రేటింగ్‌ వస్తే వారికి కొంత సాధనతో ఆశించిన సంస్థలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
* అన్నిట్లోనూ 8 కంటే తక్కువ రేటింగ్‌ వస్తే తాము ఆశించిన సంస్థలో ఉద్యోగం సాధించటం కష్టం కాబట్టి ఎంతో సాధన చేయాల్సివుంటుంది.
* తక్కువ రేటింగ్‌ వచ్చినవారు బాధపడనక్కర్లేదు. శ్రద్ధతో ఆయా అంశాల్లో తమను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ తీసుకోవాలి.
పైన ఇచ్చిన అంశాల్లో ఏ ఒక్క అంశం గురించి మీకు అవగాహన లేకపోయినా, అనుకున్న స్థాయిలో నైపుణ్యం లేకపోయినా విజయం సాధించడంలో అంతరాయం ఏర్పడుతుంది.
సంస్థను బట్టీ, పోషించే పాత్రను బట్టీ ఒక్కో అంశంలో ఒక్కో సంస్థకు నైపుణ్యస్థాయి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలో ఉద్యోగం సాధించాలంటే కోడింగ్‌ నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థులు పైన చెప్పిన అంశాలను మొదటి సంవత్సరం నుంచి ఆఖరి సంవత్సరంలోపు ఎపుడైనా నేర్చుకోవచ్చు. తమ ఆసక్తి, అవగాహనలను బట్టి ప్రతి సంవత్సరం తాము ఎక్కడున్నారో తెలుసుకుంటూవుండాలి. ప్రతి అంశాన్నీ ఆచరణలో పెడుతూ విజయపథం వైపు దూసుకెళ్లొచ్చు.

Posted on 30 - 03 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning