ఐటీఐఆర్‌ ప్రాజెక్టుతో లక్షల‌ ఉద్యోగాలు

 • * హార్డ్‌వేర్‌ తయారీ రంగం కొత్త పుంతలు

  మాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంత (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌-ఐటీఐఆర్‌) రూపంలో ఓ మహత్తర అవకాశం రాష్ట్ర రాజధాని నగరానికి చేజిక్కింది.


       దీని ద్వారా ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 50 లక్షల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. లక్షల సంఖ్యలో పట్టాలు పుచ్చుకొని కాలేజీల నుంచి బయటకు వస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఊరట కలిగించే పరిణామమిది. అభివృద్ధి పథంలో హైదరాబాద్‌ కొత్త పుంతలు తొక్కడానికి వీలు కల్పించే ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలివిగో...

  మహత్తర కలల మణిహారం

       సుదీర్ఘ పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన‌ సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్‌) ప్రాజెక్టు ద్వారా వచ్చే రెండు, మూడు దశాబ్దాల్లో హైదరాబాద్‌ నగరం రూపురేఖలు అనూహ్య రీతిలో మారిపోనున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో రూ.2.19 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే అంచనా వేశారు. పెట్టుబడుల్లో ఎక్కువగా ప్రైవేటు రంగం నుంచి వచ్చే అవకాశం ఉండగా... ప్రభుత్వం తనవంతుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఈ సదుపాయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.17,000 కోట్ల మేరకు వెచ్చించే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిది కావడం గ‌మ‌నార్హం.

       ఈ ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రహదార్ల నిర్మాణం, నీటి లభ్యత, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు... ఇలా అన్ని రకాలైన సదుపాయాల్ని కల్పిస్తుంది. రహదార్ల నిర్మాణానికే రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తారు. అంతేగాక ఫలక్‌నుమా నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దాకా మెట్రో రైలు సదుపాయాన్ని పొడిగిస్తారు. దీనివల్ల విమానాశ్రయం నుంచి ఐటీఐఆర్‌ ప్రాజెక్టులో ఏర్పాటయ్యే సంస్థలకు రాకపోకలు సులువవుతాయి. రెండో దశలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా అధికంగా నిధులు వెచ్చిస్తారు. దాదాపు రూ. 14,000 కోట్ల మేరకు దీనికి కేటాయించే అవకాశం ఉంది. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సమన్వయ కర్తగా వ్యవహరిస్తుంది.

  ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ రంగానికి ప్రాధాన్యం

       ఐటీఐఆర్‌ ప్రాజెక్టులో ఎంతో ఆసక్తికరమైన అంశం ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ(ఈహెచ్‌ఎం) రంగానికి పెద్దపీట వేయటం.

       ఒక పక్క ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), మరోపక్క ఈహెచ్‌ఎం రంగానికి భాగస్వామ్యం కల్పించటం వల్ల హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు దేశానికే మణిహారంగా మారనుంది. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ రంగం నుంచి ఈ ప్రాజెక్టులో రూ. 1.01 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హైదరాబాద్ ఐటీ కేంద్రమే కాకుండా.. ఇక్కడ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ కూడా గుర్తించదగ్గ స్థాయిలో ఉందని ఎక్కువ మందికి తెలీదు. ఈసీఐఎల్‌, డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్‌ రీసెర్చ్‌ లేబొరేటరీస్‌, బీఈఎల్‌కు చెందిన కేంద్రం తదితర ప్రభుత్వ రంగ సంస్థల సరసనే, కొన్ని ముఖ్యమైన ప్రైవేటు రంగ ఎలక్ట్రానిక్‌ సంస్థలు సైతం హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఈ రంగం ఆశించిన రీతిలో బహుముఖంగా విస్తరించలేకపోయింది. ఎగుమతులు కూడా తక్కువగా ఉన్నాయి. అయితే ఐటీఐఆర్‌ ప్రాజెక్టుతో పరిస్థితిలో మార్పువస్తుందని, ఎలక్ట్రానిక్‌ వస్తువులు- ఉపకరణాలు తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం కలుగుతుందని సంబంధిత రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రం నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.22.71 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఎగుమతులు నమోదయ్యాయి. మరుసటి సంవత్సరం ఎగుమతులు రూ.13.31 కోట్లు మాత్రమే. దీన్నిబట్టి ఈ విభాగంలో బహుముఖంగా విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  ఐటీలో ప్రస్తుతం 3 లక్షల మందికి ఉపాధి

       రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు యత్నాలు ఆరంభమైనప్పుడు తొలుత 1996 ప్రాంతంలో మాదాపూర్‌లో సైబర్‌టవర్స్‌ నిర్మాణం జరిగింది. ఇది హైటెక్‌ సిటీ తొలిదశ. ఈ ప్రయత్నమే ఐటీకి ఊతం ఇచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత హైటెక్‌ సిటీ రెండు, మూడో దశలతో పాటు బహుమఖంగా మాదాపూర్‌ ప్రాంతంలో 'ఐటీ క్లస్టర్‌' విస్తరించింది. పలు స్వదేశీ, విదేశీ ఐటీ కంపెనీలు ఇక్కడ తమ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. 2000 సంవత్సరం తర్వాత గచ్చిబౌలి ప్రాంతంలో మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఏర్పాటయ్యాయి.

   

   

       తత్ఫలితంగా ఆ ప్రాంతంలోనూ ఐటీ సంస్థలు బాగా విస్తరించాయి. అక్కడే రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌' లో మరికొన్ని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలకు స్థానం లభించింది. మొత్తం మీద నానక్‌రామ్‌ గూడ, గచ్చిబౌలి ప్రాంతాలను విప్రో, ఇన్ఫోసిస్‌, సీఏ, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌, సీఎంఎస్‌ వంటి దిగ్గజ సంస్థలు తమ కేంద్రస్థానంగా చేసుకున్నాయి. హైదరాబాద్‌లో మలిదశలో పోచారం ప్రాంతంలో కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇన్ఫోసిస్‌ ప్రాంగణం, రహేజా ఐటీ పార్క్‌ ఇక్కడ ఉన్నాయి. ఈ ఐటీ సముదాయాలన్నిటికీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా 30 నిమిషాల వ్యవధిలో చేరే అవకాశం ఉంది. దేశంలోని మరే మహా నగరంలో ఇంత సదుపాయం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ కేంద్రాలుగా మారిన ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, భారీ వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, విశాలమైన రోడ్లు- ఫ్త్లెఓవర్‌ర్లు, అంతర్జాతీయ పాఠశాలలు, వినోదకేంద్రాలు, మల్టీప్లెక్సులు కొలువుదీరాయి. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా 3,00,000 మంది ఐటీ-ఐటీ ఆధారిత సేవారంగాల్లో ఉపాధి పొందుతుంటే, వీరిపై ఆధారపడి పరోక్షంగా మరో 12 లక్షల మందికి జీవనోపాధి లభిస్తోందని అంచనా. గత రెండు దశాబ్దాల కాలంలో హైదరాబాద్‌లో ఐటీ, దాని అనుబంధ విభాగాల మీద వచ్చిన పెట్టుబడులు రూ.20,000 కోట్ల వరకూ ఉంటాయని పరిశ్రమ వర్గాల అంచనా. ఇప్పుడు ఐటీఐఆర్‌ వల్ల మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం, ఉప్పల్‌ ప్రాంతాల్లోనూ కొత్తగా ఐటీ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మన దేశంలో ఐటీ కార్యకలాపాలు అధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది 4వ స్థానం. దేశవ్యాప్త ఐటీ ఎగుమతులు ఏటా 70 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో మనరాష్ట్రం నుంచి దాదాపు 9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 60,000 కోట్లు) విలువైన ఐటీ ఎగుమతులు నమోదవుతున్నాయి. తద్వారా రాష్ట్రానికి ఐటీ ఎగుమతుల్లో దాదాపు 13 శాతం వాటా ఉన్నట్లు అవుతోంది.

  ఇంజినీరింగ్‌ నిపుణులకు అనుకూలం

       దేశంలో ఏటా అత్యధిక సంఖ్యలో ఇంజినీర్లను తయారుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో దాదాపు 3 లక్షల సీట్లు ఉన్నాయి. కొన్ని మిగిలిపోతున్నప్పటికీ ఏటా 2 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరుతున్నారు. ఇందులో ఎక్కువ మంది ఇష్టపడుతున్నది కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌ విభాగాలే. ఈ రెండు విభాగాల్లో 1.6 లక్షల సీట్లు రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఉన్నాయి. కానీ ఉద్యోగావకాశాలు అంతే స్థాయిలో లేవు. ఇక పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం మందిలో కొద్దిమందికి మాత్రమే రాష్ట్రంలోని ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అవి కూడా ఉన్నత స్థాయి సాఫ్ట్‌వేర్‌ నిపుణులకే పరిమితం. దీంతో మిగిలిన వారంతా తమ చదువుతో సంబంధం లేని రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కోవలసి వస్తోంది. అదే ఐటీ, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ రంగాన్ని బహుముఖంగా ప్రోత్సహించిన పక్షంలో ఉద్యోగావకాశాలు పెరిగి ఎక్కువ సంఖ్యలో నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ యూనిట్ల వల్ల దిగువ స్థాయి నిపుణులైన పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.

  ప్రాజెక్టు స్వరూపం ఇదీ..

       హైదరాబాద్‌ పరిసరాల్లో రెండువేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 50,000 ఎకరాల్లో ఐటీ విస్తరణకు ఉద్దేశించినదీ ప్రాజెక్టు ఇది. దీన్ని రెండు దశల్లో అమలు చేయ‌నున్నారు. తొలి దశను 2018 నాటికి పూర్తిచేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రెండోదశకు 2018 నుంచి 2038 వరకూ గడువు పెట్టుకున్నారు.

   

       ఐటీ రంగం నుంచి రూ.1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ రంగం నుంచి రూ.1.01 లక్షల కోట్ల పెట్టుబ‌డులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయ అభివృద్ధి ప్రాంతంతో పాటు మహేశ్వరం, ఉప్పల్‌-పోచారం ప్రాంతాలకు ఈ క్లస్టర్‌ విస్తరించి ఉంటుంది. ఇందులో మహేశ్వరం ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ కార్యకలాపాలకు ప్రత్యేకించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌, సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమలు కొన్ని ఉన్నందున మహేశ్వరం ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. ఇదే 10,000 ఎకరాల్లో వస్తుందని అంటున్నారు. మిగతా రెండు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, ఐటీ ఎస్‌ఈజడ్‌లు ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning