వెంటనే ఉద్యోగాలు నింపండి

* వాటి కోసం యువతరం ఓపిగ్గా ఎదురు చూస్తోంది
* గవర్నర్‌ నరసింహన్‌ ఉద్ఘాటన
* టీఎస్‌పీఎస్సీ అంతర్జాల వేదిక ఆవిష్కరణ

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ యువతరం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనల క్రమంలో కీలకమైన అడుగు పడింది. ప్రకటనలకు ముందస్తు ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) అంతర్జాల వేదిక (వెబ్‌సైట్‌)ను గవర్నర్‌ నరసింహన్‌ ఏప్రిల్ 11న ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్‌, ఖాద్రి ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వేదికతోపాటు, పీఎస్సీ ముద్రను గవర్నర్‌ ఆరంభించారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగాల భర్తీ మొదలెట్టాలని ప్రత్యక్షంగా టీఎస్‌పీఎస్సీకి... పరోక్షంగా ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించారు. ''టీఎస్‌పీఎస్సీ ఆరంభించిన ఒక్కసారి నమోదు పద్ధతి చాలా బాగుంది. ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను రూపొందించి దాని ప్రకారం ప్రకటనలు వచ్చేలా చేయండి! ఇప్పుడు అంతర్జాల వేదిక వచ్చేసింది కాబట్టి వెంటనే ఉద్యోగాల భర్తీ చేయండి. వీలున్న చోట, ఖాళీలున్నచోట మొదలెట్టండి. తెలంగాణ యువతరం ఎంతో ఓపిక పడుతోంది. చాలామంది వయసు మీరిపోతోంది! పీఎస్సీ కూడా చాలా సమయం తీసుకోకుండా తొందరగా ఫలితాలు వెల్లడించాలి. పరీక్ష పత్రాల రూపకల్పనలోనూ అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఒకట్రెండు తప్పుల కారణంగా పరీక్షలే రద్దయ్యాయి. కాబట్టి పీఎస్సీతోపాటు పరీక్షల విశ్వసనీయత చాలా ముఖ్యం. ప్రశ్నపత్రాల నిధిని ముందే సిద్ధం చేసుకుంటే మంచిది. అది కూడా ఇతర రాష్ట్రాల్లో తయారు చేయించండి. సమయం ఉన్నప్పుడల్లా నాతో మాట్లాడొచ్చు! మీ ముఖ్యమంత్రి మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సర్వీస్‌ కమిషన్‌ బాధ్యత ఎక్కువ. తెలంగాణ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా... కమిషన్‌ చేతుల్లో ఉంది'' అని గవర్నర్‌ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఈ క్షణంలోనైనా ఉద్యోగాల ప్రకటనకూ, పరీక్షల నిర్వహణకూ తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి స్పష్టంచేశారు. పీఎస్సీ ముద్రను రూపొందించిన ఏలె లక్ష్మణ్‌, హరీశ్‌లను గవర్నర్‌ సన్మానించారు.
Website: http://www.tspsc.gov.in/

Posted on 12 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning