2 వేల ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు ప్రకటన?

* నా శాఖతోనే ఆరంభం: కేటీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో సుమారు రెండు వేల ఇంజినీరింగ్‌ విభాగం ఉద్యోగాల భర్తీకి నెలలోపే ప్రకటన విడుదల కాబోతోంది. పంచాయతీరాజ్‌ (600పైగా), ఆర్‌ అండ్‌ బీ (సుమారు 500) మున్సిపాలిటీ (1000 దాకా)ల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అనుమతినిస్తుందని సమాచారం. ఇందులో పంచాయతీరాజ్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా వూపినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా తొలి ప్రకటన పంచాయతీరాజ్‌శాఖ నుంచే రాబోతోంది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఏప్రిల్ 11న రాజ్‌భవన్‌లో టీఎస్‌పీఎస్సీ ఒకేసారి నమోదు ప్రక్రియను ఆవిష్కరించిన కేటీఆర్‌ మాట్లాడుతూ ''తెలంగాణ ఏర్పాటులో భూమిక పోషించిన యువత కోసం నా శాఖ నుంచే తొలి ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. 628 ఇంజినీరింగ్‌ పోస్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రెండేళ్లలో లక్షా ఏడువేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాలలు పారదర్శకంగా జరగాలని సీఎం భావిస్తున్నారు. వాటినీ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను'' అని మంత్రి అన్నారు.
14న శాఖలవారీ పరీక్షలకు ప్రకటన
ఏప్రిల్ 14న టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకుద్దేశించిన శాఖలవారీ పరీక్షలకు ప్రకటన వెలువడబోతోంది. అలాగే సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర) ప్రొబేషన్‌కు సంబంధించిన అర్ధవార్షిక పరీక్షలకూ ప్రకటన విడుదలవుతుంది. దరఖాస్తులకు మూడువారాల సమయమిచ్చే అవకాశముంది. సుమారు 58 రకాల శాఖలవారీ పరీక్షలకు అన్నిరకాల సిద్ధమయ్యామని పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి తెలిపారు.

Posted on 12 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning