12 నుంచి పీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు

* ఉద్యోగ సమాచారం నేరుగా అభ్యర్థుల సెల్‌ఫోన్లకు
ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యువతరం ఆకాంక్షల్ని, అలవాట్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఒక్కసారి నమోదు (వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌-ఓటీఆర్‌) పేరిట నిరుద్యోగులకు సులభమైన దరఖాస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది. తద్వారా ఉద్యోగాల సమాచారాన్ని నేరుగా అభ్యర్థుల (అర్హతల ఆధారంగా) సెల్‌ఫోన్లకే సంక్లిప్త సందేశం రూపంలో పంపేలా ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటి నుంచే పీఎస్సీ వెబ్‌సైట్‌ http://www.tspsc.gov.in/ ద్వారా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అభ్యర్థులే సవరించుకునే అవకాశం ఉంటుంది. నెట్‌ బ్యాంకింగ్‌ తరహాలో పనిచేస్తుందిది. ఇదంతా ఉచితంగా అభ్యర్థులకు పీఎస్సీ అందిస్తున్న సేవ! ఉద్యోగ ప్రకటనలు వచ్చాక... ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌తో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. ఏప్రిల్ 11న ఆవిష్కృతమైన టీఎస్‌పీఎస్సీ అంతర్జాల వేదిక (వెబ్‌సైట్‌)లో ఈ ఒక్కసారి నమోదు (ఓటీఆర్‌) కీలకమైంది. ఒక్కసారి తమ వ్యక్తిగత, అర్హతల సమాచారాన్ని టీఎస్‌పీఎస్సీ అంతర్జాల వేదికలో నిక్షిప్తం చేశారంటే పీఎస్సీ నుంచి పది అంకెల ఓ పాస్‌వర్డ్‌, నమోదు సంఖ్య మీ ఈమెయిల్‌కు, సెల్‌ఫోన్‌కొస్తుంది. ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా వివిధ సందర్భాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా పదేపదే సమాచారాన్ని నింపాల్సిన అవసరముండదు. అభ్యర్థి దరఖాస్తును ఆధార్‌తోనే కాకుండా ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ధ్రువీకరణ పత్రాల తనిఖీని కూడా అనుసంధానిస్తారు. దీంతో ఏవైనా నకిలీ పత్రాలున్నా దొరికిపోతాయని త్వరలోనే ఫేస్‌బుక్‌లో కూడా వాల్‌ ఆరంభిస్తామని టీస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వివరించారు. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన రుసుము చెల్లింపును పీఎస్సీ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఎస్‌బీహెచ్‌ పీఎస్సీ కోసం ప్రత్యేక శాఖను తెరవబోతోంది. ''అభ్యర్థులు అన్నీ ఇంటినుంచి, ఫోన్‌ నుంచి చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ సమయంలోనే పీఎస్సీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది'' అని చక్రపాణి అన్నారు.

Posted on 12 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning