ఉద్యోగ సాధనలో మార్గనిర్దేశం

వృత్తివిద్యలు అభ్యసించే సమయంలో, కోర్సు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటపుడూ అందరూ విజయం సాధించలేరు. వెనకబడినవారు నిరాశతో కుంగిపోకుండా తమ లోపాలు గ్రహించాలి; వాటిని సరిదిద్దుకోవాలి. ఇందుకు ఉపకరించే కౌన్సెలింగ్‌ ప్రాధాన్యాన్ని విద్యార్థులు తప్పనిసరిగా గ్రహించాలి.

ఏటా ఇంజినీరింగ్‌ చదవాలనుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వివిధ కారణాల వల్ల తరచుగా ఆటుపోట్లు ఎదురైనా ఈ విద్యకు గిరాకీ తక్కువేమీ లేదు. ఇంచుమించు అన్ని రంగాల్లోనూ ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలుండడం దీనికి ప్రధాన కారణం. ఈ ఉద్యోగాల్లో లభించే వృత్తిపరమైన సంతృప్తి, వేతనాలు, మేధాశక్తి అభివృద్ధికి అవకాశాలు... ఇలాంటి కారణాల వల్ల విద్యార్థులు ఈ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు.
మనదేశంలో ఏటా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఎక్కువశాతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ప్రాంగణ నియామకాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

అయితే 22% విద్యార్థులకు ఒక మోస్తరు గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించుకోవడానికే సుమారు రెండేళ్ల కాలం పడుతోంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడంలో వీరి ప్రయత్న లోపం వల్లగానీ, విద్యాభ్యాస సమయంలో అవగాహన లోపం వల్లకానీ ఉద్యోగార్హత నైపుణ్యాలను నేర్చుకోవడంలో మందకొడితనం వల్లకానీ వీరు సంస్థల దృష్టిని ఆకర్షించలేకపోతున్నారు.

అయితే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోగలిగినవే. ఈ విషయంలో విద్యాలయాల యాజమాన్యాల, తల్లిదండ్రుల, అధ్యాపకుల సమష్టికృషి ఎంతో అవసరం. వ్యక్తి కేంద్రీకృత సలహాలతో పాటు, నిర్దిష్టంగా వారికి వర్తించే కొన్ని మెలకువల్లో శిక్షణనిస్తే ఉద్యోగాన్వేషణ సఫలమవుతుంది.

కావాల్సిన నైపుణ్యాలు
ఉద్యోగ సంసిద్ధత అంటే- కొలువు సాధించడానికి అవసరమైన అర్హతలను సంపాదించుకోవడం అని చెప్పుకోవచ్చు. విద్యాపరమైన మెలకువలు, విషయ పరిజ్ఞానంతో పాటు భావోద్వేగ ప్రజ్ఞ, ఇతరులతో కలిసిమెలిసి ఉండే సత్సంబంధాలు, బృందంగా పనిచేయడం, వ్యక్తిగత సామర్థ్యం, ఆత్మస్త్థెర్యం, భిన్న పరిసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం వంటి కొన్ని ప్రత్యేకమైన మెలకువలు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరం. ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించటానికి కూడా ఇవి ఎంతో ఆవశ్యకం.

విద్యార్థులు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) సమయంలో ఈ మెలకువలను సరైన రీతిలో ప్రదర్శించగలగాలి. లేకపోతే ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయి. సాధారణంగా రాతపరీక్షకు 1:10 నిష్పత్తిలో, బృంద చర్చలకు 1:5 నిష్పత్తిలో, మౌఖిక పరీక్షకు 1:2 లేదా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతిస్తారు. అందువల్ల నియామకాల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించే అవకాశముండదు.

వివిధ స్థాయుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ నుంచి నిష్క్రమణకు గురైనవారు మానసిక వ్యాకులతకూ, ఒత్తిడికీ లోనవుతుంటారు. దీనిమూలంగా వీరు ఇతర ఇంటర్వ్యూల్లో కూడా సరైన ప్రతిభను ప్రదర్శించలేకపోతుంటారు. ఇలాంటివారికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వీరి లోపాలను తెలిపి- సరిదిద్దుకునే అవకాశాలను కలిగించటానికి వ్యక్తిగత కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. కౌన్సెలింగ్‌ అంటే సమయోచిత, సముచిత సలహాలనివ్వడం. ఇలాంటి ప్రయత్నం అభ్యర్థుల్లో ఆత్మస్త్థెర్యాన్ని పెంచుతుంది.. అందుకే దీని ప్రాధాన్యం గ్రహించాల్సివుంది.

విద్యార్థుల ఆలోచనాసరళిని సరైన మార్గంలో పెట్టే దిశగా నిర్దేశించడం కౌన్సెలర్‌ ప్రథమ బాధ్యతగా ఉంటుంది. సరైన సమయంలో వారి మానసిక స్థితిగతులను గ్రహించి, అర్థం చేసుకుని, తగిన సలహాలతో ఉత్తేజపరచడంలో కౌన్సెలర్‌ పాత్ర చెప్పుకోదగినది. ఫలితంగా విద్యార్థులు తమను బాధిస్తున్న సమస్యలనూ, ప్రతికూల పరిస్థితులనూ సమర్థంగా ఎదుర్కోగలుగుతారు.

వ్యక్తికేంద్రిత సలహాలు
ప్రతి వ్యక్తీ తనకు తానే ప్రత్యేకం. ఎవరూ కూడా సమూహంలో కానీ, బృందాల్లో కానీ తమకు సంబంధించిన, వ్యక్తిగత విషయాలను చర్చించడానికి ఇష్టపడరు. అందువల్ల బృందాల్లో చేసే కౌన్సెలింగ్‌ కంటే వ్యక్తిగతంగా చేసే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎక్కువ ప్రభావం చూపుతుంది.

తనకు మాత్రమే పరిమితమైన సమస్యల గురించి చర్చించడం వల్ల కౌన్సెలర్‌పై విద్యార్థికి నమ్మకం కలుగుతుంది. చదువుపై శ్రద్ధ చూపడానికి ప్రతిబంధకాలుగా అనిపించే సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశాలు ఏకాంతంలో మాత్రమే ఎక్కువ. అటువంటి సందర్భాల్లో కౌన్సెలర్‌ ద్వారా వాటిని అధిగమించే చర్యలు తెలుసుకుని, తగిన సలహాలతో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవచ్చు.

లక్ష్యాల పునర్నిర్వచన, వాటిని సాధించే దిశగా మెరుగైన ప్రయాణం మొదలుపెట్టవచ్చు. ఉద్యోగంలో అవసరమయ్యే ఇతరత్రా లక్షణాలను కూడా అలవరచుకోవచ్చు. ఐఐటీ, బిట్స్‌, ట్రిపుల్‌ ఐటీ వంటి అగ్రగామి విద్యాసంస్థల్లో అనుసరిస్తున్న ఈ విధానం సత్ఫలితాలనిస్తోంది.
సజావుగా కౌన్సెలింగ్‌
చాలా విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్‌ అనేది సవ్యంగా కొనసాగటం లేదు. ఒకవేళ ఉన్నా అది ఫీజు విషయం తెలపడానికో, విద్యార్థులు ఏవైనా తప్పులు చేసినపుడు వారి తల్లిదండ్రులను పిలిపించి చెప్పటానికో పరిమితమవుతోంది. అలాకాకుండా ఈ ప్రక్రియపై విద్యాసంస్థలు, అధ్యాపకులు శ్రద్ధ వహిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది.
కౌన్సెలింగ్‌ అనేది సాధారణ విషయం కాదు. దీన్ని ఒక క్రమపద్ధతిలో చేయాల్సివుంటుంది. ప్రతి విద్యార్థికీ ఒక అధ్యాపకుడిని కేటాయించి మొదటి రెండు సంవత్సరాలు ఎక్కువసార్లు కౌన్సెలింగ్‌ చేయటం సముచితం. ఈ ప్రక్రియ క్రమంగా సాగుతున్నదా లేదా అన్నది పర్యవేక్షించటం సత్ఫలితాలనిస్తుంది.

ఉత్తమ కౌన్సెలర్‌ లక్షణాలు: ఇతరులకు సహాయకారిగా ఉంటూ, వారి అభ్యున్నతికి తనవంతు కృషిచేసే తత్వం కౌన్సెలర్‌కు అవసరం. తమ వద్దకు సహాయం కోరి వచ్చినవారిలోని ప్రతిభను గుర్తించి, వారి సహజ ప్రతిభను చాటుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. అధ్యాపకుడి మౌలిక బాధ్యతల్లో ఇది కూడా ఒకటి. ఇందులో ప్రతిఫలాపేక్షకు ఆస్కారం లేదు.

* ఉపయుక్తమైన, సందర్భోచితమైన సలహాలనివ్వడంలో మంచి నేర్పు ఉండాలి.
* మానసిక పరిపక్వత ఉండాలి. చక్కటి భావోద్వేగ ప్రజ్ఞ కలిగివుండాలి.
* విద్యార్థులు బెరుకు లేకుండా తమ భావాలను ప్రకటించడానికి అనుకూలమైన వాతావరణం కలిగించాలి. వారు భయం, బిడియం లేకుండా మాట్లాడడానికి ప్రోత్సహించాలి.
* బేషరతు సదభిప్రాయ భావన కలిగి ఉండాలి. విరుద్ధమైన అభిప్రాయాలు, ముందస్తు అభిప్రాయాలు ఏర్పరచుకునే గుణాలను విడనాడాలి. తాను సహాయపడాలనుకునే వ్యక్తిలోని మంచి చెడులను సమానంగా పరిగణించాలి.
* దృఢమైన అవగాహన పటిమ ఉండాలి. సమస్యలను తన అభిప్రాయాల ద్వారా కాకుండా, ఆ సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థి దృక్కోణంలో చూడగలగాలి. ఆ సమస్యకు సమాధానం విద్యార్థి చర్య-ప్రతిచర్యల రూపంలో అర్థం చేసుకుని తగినరీతిని మార్గనిర్దేశనం చేయగలగాలి.
* అధ్యాపక కౌన్సెలర్‌ విద్యార్థికి స్నేహితుడిగా, ఆప్తుడిగా అనిపించాలి. విద్యార్థి మనసులో తన సమస్యలకు సరైన సమాధానాలు ఇవ్వగలవాడిగా అధ్యాపకుడు స్ఫురించాలి.
* సముచిత సలహాలివ్వడంలో అనుభవం ఉండాలి.

వ్యక్తి కేంద్రిత సలహా ప్రక్రియ శ్రేష్ఠమైనది. ఎదిగే వయసులో ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు దీని అవసరం ఎంతో ఉంది. ఈ కౌన్సెలింగ్‌ ప్రాధాన్యం గుర్తించి విద్యార్థులు తమ సహకారం అందిస్తే సరైన మార్గనిర్దేశకత్వం పొందగలుగుతారు. అది వారి భవితకు చక్కని బాటను ఏర్పరుస్తుంది.

Posted on 20 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning