నైపుణ్యాల నెలవు!

ఎంఎస్‌ఐటీ'... ప్రపంచస్థాయి ఇంజినీర్లను రూపొందించటం ఈ పీజీ కోర్సు ధ్యేయం! అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ కోర్సు విభిన్నతను సంతరించుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ (CIHL)ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం విశిష్టతలెన్నో...!
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య ఎంతో చేరువైనప్పటికీ ప్రమాణాల పరంగా నిరాశాజనక పరిస్థితి. ఫలితంగా చాలామందిలో ఉద్యోగార్హతలు తక్కువగా ఉంటున్నాయి. దీనికి భిన్నంగా ప్రపంచస్థాయి నైపుణ్యాల సాధన లక్ష్యం, కార్యాచరణ సిసలైన సవాళ్ళే. ఈ నేపథ్యంలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) పాఠ్యప్రణాళిక విశిష్టతలను పరిశీలించాలి.
వర్తమాన కార్పొరేట్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను దీటుగా పరిష్కరించగల విద్యార్థుల తయారీ ఈ ప్రోగ్రాం లక్ష్యం. దీనికోసం నాణ్యమైన ఇంటర్న్‌షిప్‌లూ, ప్రాజెక్టులూ కీలకం. అందుకని జేపీ మోర్గాన్‌ చేజ్‌, గ్రామెనర్‌, టీమ్‌ ఎఫ్‌వన్‌ నెట్‌వర్క్స్‌, ఏడీపీ, మ్యూచువల్‌ మొబైల్‌ మొదలైన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశ్రమతో అనుసంధానమైంది.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం (సీఎంయూ), ఇతర సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల డిజిటల్‌ లెక్చర్లు, ప్రతి పది మంది విద్యార్థులకు ఒక మెంటర్‌... ఈ ప్రోగ్రాంలో కొన్ని విశేషాలు. దీనిలో చేరిన గ్రామీణ విద్యార్థులు తమ భావ వ్యక్తీకరణ, ప్రెజెంటేషన్‌, ఇతర జీవన నైపుణ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకోగలుగుతున్నారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాంలో రెండో సంవత్సరం నుంచి స్పెషలైజేషన్లను అందిస్తున్నారు. అవి- కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డాటా ఎనలిటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌. మారుతున్న కాలానికి తగ్గ తాజా సాంకేతికతను కోర్సులో భాగం చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో గిరాకీ ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ అప్లికేషన్‌ అభివృద్ధి ఎంఎస్‌ఐటీలో భాగమే.
ప్రవేశం ఎలా?
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ GAT అనే ప్రవేశపరీక్ష ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలుంటాయి. మరో మార్గం- వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌. ఏప్రిల్‌ 16 నుంచి మే 23 వరకూ ఇవి జరుగుతాయి. బీటెక్‌/ బీఈ అన్ని బ్రాంచిలవారూ ఈ పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిల్లో గ్యాట్‌ జరుగుతుంది. వాక్‌ ఇన్‌ టెస్టులను హైదరాబాద్‌, కాకినాడల్లో నిర్వహిస్తారు. గ్యాట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
* జులై 2012 తర్వాత జీఆర్‌ఈ రాసి 275/2.5 స్కోరు తెచ్చుకున్నవారికి ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
* జులై 2013 తర్వాత టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ రాసినవారికి ప్రవేశపరీక్ష స్టేజ్‌-2లోని లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి మినహాయింపు ఇస్తారు. టోఫెల్‌లో అయితే 79/120 (ఐబీటీ); ఐఈఎల్‌టీఎస్‌లో అయితే కనీసం 6.0 స్కోరు సాధించివుండాలి.
ప్రిపరేటరీ కోర్సు ఫీజు రూ. 20,000. వార్షిక ఫీజు రూ.1.40 లక్షలు. ఐదు వారాల ప్రిపరేటరీ ప్రోగ్రాంలో ఐటీ వర్క్‌పాప్‌, కంప్యుటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ ఉంటాయి. విద్యార్థులు దీనిలో 80 శాతం ఉత్తీర్ణత సాధించాల్సివుంటుంది.
ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్లో www.msitprogram.net దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఐఐఐటీ క్యాంపస్‌ ఉన్న కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ డీన్‌ను సంప్రదించవచ్చు. ఈమెయిల్‌: enquiries2015@msitprogram.net . ఫోన్‌: 7799834583.
ఉద్యోగావకాశాలు
ఉద్యోగార్హత ఉన్న (ఎంప్లాయబుల్‌) విద్యార్థులను రూపొందించే లక్ష్యాన్ని ఎంఎస్‌ఐటీ ప్రోగ్రాం ఎలా సాధిస్తోందో దాని ప్లేస్‌మెంట్లు తెలుపుతున్నాయి. 2003లో వందశాతం ప్లేస్‌మెంట్లతో తొలి బ్యాచ్‌ దారిచూపింది. అదే తరహా కొనసాగుతోంది. తాజాగా పరిశీలిస్తే- ఎంఎస్‌ఐటీ 2013-15 బ్యాచ్‌ దాదాపు నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌ను సాధించింది. ఐఐఐటీ హైదరాబాద్‌లో 61 మందిలో 61 మందికీ; జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 53 మందిలో 53 మందికీ; జేఎన్‌టీయూ కాకినాడలో 28 మందిలో 28 మందికీ, జేఎన్‌టీయూ అనంతపురంలో 24 మందిలో 23 మందికీ ఉద్యోగాలు లభించాయి.
ఉద్యోగ సంసిద్ధులను తయారుచేస్తున్నాం - ప్రొ. శ్రీనివాసరావు ఎం. డీన్‌, సీఐహెచ్‌ఎల్‌
'ఆచరణ ద్వారా అభ్యాసం' (Learning by doing) అనే విజయవంతమైన బోధనా పద్ధతిని ఎంఎస్‌ఐటీ కోర్సులో అనుసరిస్తున్నాం. ఈ తరహా శిక్షణ ద్వారా విద్యార్థులు తాము నేర్చుకున్న కాన్సెప్టులను సంపూర్ణంగా ఆకళించుకుని, వాటి ఆచరణను గ్రహించగలుగుతున్నారు. పరిశ్రమ వర్తమాన అవసరాలను ప్రతిఫలించే స్పెషలైజేషన్లూ, సబ్జెక్టులూ ఇక్కడి ప్రత్యేకత. వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పరిశ్రమతో చక్కని అనుసంధానం ఏర్పడి ప్రయోజనకరమైన అనుభవం సాధించగలుగుతున్నారు. ఎంచుకున్న సంస్థ, విద్యార్థుల నైపుణ్యాలను బట్టి ఇంటర్న్‌షిప్‌ కాలంలో ఒక్కొక్కరికి రూ. 10 వేల నుంచి రూ.35 వేల వరకూ స్త్టెపెండ్‌ వస్తోంది. కంపెనీలు ప్రత్యేకంగా ఆశిస్తున్న భాషాసామర్థ్యాల నైపుణ్యాల శిక్షణను కూడా జోడించి విద్యార్థులను ఉద్యోగ సంసిద్ధులుగా మలచటంలో ముందంజలో ఉన్నాం.'
నేర్చుకునే వాతావరణం - అనూష కొండపల్లి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌
'సాంకేతిక నైపుణ్యాల విషయంలో ఆత్మవిశ్వాసం నింపటంలోనూ, నా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవటంలోనూ ఎంఎస్‌ఐటీ నాకు తోడ్పడింది. ఇక్కడ నేర్చుకునే వాతావరణం మూలంగా ప్రోత్సాహం దొరికింది; జేపీ మోర్గాన్‌లో ఉద్యోగం సంపాదించగలిగాను. ఈ రకంగా ఐటీ పరిశ్రమలో అడుగుపెట్టగలిగాను.'
స్పష్టమైన తేడా - బి. కేతన్‌, జేఎన్‌టీయూ అనంతపురం
'ఈ ప్రోగ్రాంలో చేరకముందూ, చేరాకా నా జీవితంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఇక్కడి బోధన, అభ్యాస పద్ధతి ప్రాక్టికల్‌గా సాంకేతిక పరిజ్ఞానం సాధించటానికి ఎంతో సాయపడింది. టీసీఎస్‌లో ఉద్యోగిగా చేరగలిగాను. సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షణ నన్ను వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దింది.'

Posted on 27 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning