ఏపీలో పారిశ్రామిక కొలువులు

* రూ.35 వేల కోట్ల పెట్టుబడులు
* 72వేల మందికి ఉద్యోగాలు
* 29న పారిశ్రామిక మిషన్‌ ప్రారంభిస్తున్న చంద్రబాబు
* విశాఖ వేదికగా దేశవిదేశాలకు చెందిన 46 సంస్థలతో ఒప్పందాలు

విశాఖపట్నం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త పారిశ్రామిక అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. విశాఖపట్నం వేదికగా ఏప్రిల్ 29న పారిశ్రామిక మిషన్‌ పురుడుపోసుకుంటోంది. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో చేపడుతున్న తొలి భారీ పారిశ్రామిక కార్యక్రమంలో సుమారు 72వేల మందికి ఉద్యోగాల కల్పనకు బాటలువేసేలా రూ.32 వేల కోట్ల విలువైన ఎంఓయూలను ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఈ వేదికపైనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగాలవారీగా పారిశ్రామిక విధానాలను ప్రకటించనున్నారు. 21 రోజుల్లోనే అన్నిరకాల పారిశ్రామిక అనుమతులను ఏకగవాక్ష పద్ధతిలో మంజూరు చేసే సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న పారిశ్రామిక మిషన్‌ మోదీ ప్రారంభించిన 'మేక్‌ ఇన్‌ ఇండియా' నినాదానికి కొత్త ఊపుతెస్తుందని.. జాతీయ ఆర్థిక వృద్ధితోపాటు రాష్ట్రాభివృద్ధికీ చేయూతనిస్తుందని భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 29న స్వదేశీ, జపాన్‌, యూఏఈ, కెనడాలకు చెందిన 46 సంస్థలతో సుమారు రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఔషధరంగం, ఇంధనం, మౌలికవసతులు, ఎలక్ట్రానిక్స్‌, తయారీ, జౌళి, వాహన తదితర రంగాల్లో 72వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో వీటిపై సంతకాలు చేస్తోంది. అవగాహన ఒప్పందాల్లో భాగంగా రాష్ట్రంలో 48 కొత్త యూనిట్లు ఏర్పాటుకానున్నాయి. వీటిలో ఓ సంస్థ మూడు యూనిట్లు నెలకొల్పనుంది. చిత్తూరు జిల్లాలో 17, కర్నూలులో 6, తూర్పుగోదావరిలో 6, పశ్చిమగోదావరిలో 3, నెల్లూరులో 2, కడపలో 2, అనంతపురంలో 2, విశాఖలో 2, గుంటూరులో 2, కృష్ణా జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో ఒకటి ఏర్పాటవుతాయి. మిగతావి ఎక్కడ ఏర్పాటుచేస్తారన్నది ఇంకా ఖరారుచేయలేదు.
విశాఖలో నెలకొల్పనున్న ఏషియన్‌ పెయింట్స్‌కు ఏప్రిల్ 29 నాటి కార్యక్రమంలో సీఎం భూకేటాయింపు పత్రాలు అందజేస్తారు. ఓఎన్‌జీసీకి కాకినాడలో, క్రిబ్కోకు నెల్లూరులో, కుర్లాన్‌కు చిత్తూరులో భూములు కేటాయిస్తూ లేఖలు అందజేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి యూఏఈ రాయబారి, కెనడా కాన్సుల్‌ జనరల్‌లతో సమావేశమవుతారు. ఇసుజు ఎగ్జిక్యూటివ్‌తో చర్చలు జరుపుతారు. చివరగా 'ఇగ్నైటింగ్‌ ద స్టార్టప్‌ స్పిరిట్‌ ఇన్‌ ఏపీ', 'క్రియేటింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌' అనే అంశాలపై బృంద చర్చ నిర్వహిస్తున్నారు.

Posted on 29 - 04 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning