543 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా!

* అనుమతిచ్చిన ఆర్థిక శాఖ
* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో కొలువులు
* అవి తేలాకే పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ప్రభుత్వోద్యోగ ప్రకటనకు మార్గం సుగమమైంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 543 ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మే 2న ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 418 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్‌ ఇంజినీర్ల పోస్టులకు నేరుగా నియామకాల (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌)కు అనుమతిచ్చింది. జోన్‌, జిల్లా స్థాయి ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, అర్హతలు తదితరాలను ఆయా విభాగాధిపతుల నుంచి తెప్పించుకొని సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. వీటితోపాటు రోడ్లు, భవనాల శాఖలో, మున్సిపల్‌ విభాగంలో దాదాపు 1300 పోస్టులు కూడా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.
వాటిపై స్పష్టత వస్తేనే..:
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటనకు అడ్డంకులు తొలగిపోలేదు. ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి ఎంత, పరీక్షల పద్ధతి (స్కీమ్‌), రోస్టర్‌ పాయింట్ల ఖరారులో స్పష్టత వస్తేనే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ ప్రకటన విడుదల చేయగలుగుతుంది. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైంది వయోపరిమితి. పదేళ్లపాటు వయోపరిమితి పెంచటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు. పదేళ్లు ఇస్తారా లేక ఎంతిస్తారనే అంశంపై నిరుద్యోగులంతా ఉత్కంఠగా వేచిచూస్తున్నారు. పరీక్షల విధివిధానంపై ఆచార్య హరగోపాల్‌ కమిటీ సమర్పించిన నివేదికను.. పీఎస్సీ ప్రభుత్వానికి అందజేసింది. దానిపై నిర్ణయం తీసుకొని, పరీక్ష విధానంపై ప్రభుత్వం జీవో జారీ చేస్తేగాని ఉద్యోగ ప్రకటన వెలువడదు. ఉద్యోగాల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పద్ధతిపైనా నిర్ణయం వెలువడాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రోస్టర్‌ పాయింట్ల పద్ధతి కూడా మారాలనే వాదన ఉంది. ఆయా విభాగాలు తమ శాఖలో రోస్టర్‌ పాయింట్లను తాజాగా ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వం స్పష్టతిస్తే వారంలో ప్రకటన: ప్రభుత్వం నుంచి అన్ని అంశాలపై స్పష్టత వస్తే న్యాయవిభాగంతో సంప్రదించి, వారం రోజుల్లో ఉద్యోగ ప్రకటన విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి 'ఈనాడు'కు తెలిపారు.
Posted on 03 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning